సర్కారు బడికి స్పందన కొంతే.. | little response on the government schools | Sakshi
Sakshi News home page

సర్కారు బడికి స్పందన కొంతే..

Published Thu, Jul 21 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

సర్కారు బడికి స్పందన కొంతే..

సర్కారు బడికి స్పందన కొంతే..

  • కొత్తగా చేరిన విద్యార్థులు 57,974 మంది 
  • వివిధ కారణాలతో వెళ్లిపోయిన విద్యార్థుల సంఖ్య 53వేలకు పైగానే
  • మెుత్తంగా గత సంవత్సరం కంటే పెరిగిన విద్యార్థులు 4311
  • తెరుచుకున్న 42 పాఠశాలలు.. 44 పాఠశాలల్లో అడ్మిషన్లు నిల్‌
  •  
    విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య చాలా స్పల్పంగా ఉంది. జిల్లాలో 2049 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 360 యూపీఎస్‌లు, 510 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిల్లో 2015–2016 విద్యాసంవత్సరం 1నుంచి పదో తరగతి వరకు మొత్తంగా 2,42,413 మంది విద్యార్థులుండగా ఈ సంవత్సరం ( 2016–2017) బడిబాట తరువాత 2,46,724 మంది విద్యార్థులున్నారు. గత ఏడాదితో పోలిస్తే 4,311 మంది విద్యార్థులు పెరిగారు. గత ఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులతోపాటు మిగతా తరగతుల్లో విద్యార్థులు సుమారు 53వేల మందికి పైగానే అవుట్‌గోయింగ్‌ విద్యార్థులుగా గుర్తించారు.  
     
    ఈసారి బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగస్వాములై ఎక్కువగా విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా మరికొన్ని చోట్ల తగ్గినట్లు కూడా తెలుస్తోంది. బడిబాట ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు 24,581మంది ఉండగా అందులో బాలురు 12,539మంది, బాలికలు 12,042 ప్రవేశాలు పొందారు. ఇక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తగా 33,393మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా అందులో బాలురు 16,303మంది, బాలికలు 17,090 మంది ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 1నుంచి 10వ తరగతి వరకు కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల సంఖ్య 57,974.
     
     పెరిగిన విద్యార్థుల సంఖ్య ఇలా..
     జిల్లాలో బడిబాట ద్వారా అక్కడక్కడ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారు. నెల్లికుదరు మండలం జామతండాలో ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 30మంది ఉండగా ప్రస్తుతం 100మంది విద్యార్థులున్నారు. నర్సంపేటలోని హనుమాన్‌దేవ్‌ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంలో గత ఏడాది 390మంది ఉండగా ఈఏడాది 426 మంది ఉన్నారు. నర్సంపేట మండలం సర్వాపురం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 42మంది ఉంటే.. ప్రస్తుతం 73మంది ఉన్నారు. జీడయ్యపల్లి ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 70 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 133 మంది ఉన్నారు. గూడూరు మండలం అయోధ్యపురం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 165మంది ఉంటే ప్రస్తుతం 331మంది. 
     
    అదే మండలం గాజులగట్టు యూపీఎస్‌లో గత ఏడాది 72మంది ఉంటే ప్రస్తుతం 140మంది, సీతానాగారం పీఎస్‌లో గత ఏడాది 26మంది ఉంటే ప్రస్తుతం 52మంది ఉన్నారు. అలాగే కొమ్ములవంచ ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది ఆరుగురు ఉంటే ప్రస్తుతం 26 మంది విద్యార్థులున్నారు. మహబూబాబాద్‌ జీపీఎస్‌లో గత ఏడాది 172మంది విద్యార్థులుంటే ప్రస్తుతం 233 మంది విద్యార్థులున్నారు. అదేమండలం కొత్తరెడ్యాల యూపీఎస్‌లో గత ఏడాది 104మంది ఉంటే ప్రస్తుతం 132మంది విద్యార్థులున్నారు. చేర్యాల మండలం ముస్త్యాలపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో గత ఏడాది 166మంది ఉంటే విద్యార్థుల సంఖ్యపెరిగి ప్రస్తుతం  304 మంది ఉన్నారు.
     
     తెరుచుకున్న 42పాఠశాలలు 
    జిల్లాలో అసలే విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు 86 ఉండగా ఈ విద్యాసంవత్సరంలో 42 పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ చాలా తక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తంగా అయా పాఠశాలలు అన్నీ కలిపితే 368మంది విద్యార్థులే చేరినట్లు రికార్డులను బట్టితెలుస్తోంది. మిగతా 44 పాఠశాలలకు అడ్మిషన్లు లేవు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను వర్క్‌అడ్జస్ట్‌మెంట్‌కింద అవసరం ఉన్నచోటుకు పంపాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement