దేశంలోని జాతీయ సమస్యల కన్నా, పార్టీలోని జాతీయ నాయకుల సంఖ్యే ఎక్కువగా ఉంది! అది ఈ దేశం చేసుకున్న అదృష్టం. ఒక్కో సమస్యను ఒక్కో నాయకుడు పంచుకున్నా, ఇంకా కొంతమంది నాయకులు సమస్యల కోసం మిగిలే ఉంటారు.
‘సమస్యలు తక్కువై, నాయకులు ఎక్కువైతే ఎలా?!’ అని మొన్నటి ఇండోర్ జాతీయ పార్టీ సమావేశంలో సీనియర్ లీడర్ ఒకాయన కంగారుపడ్డారు! నాకనిపించింది, ఐదేళ్లు పూర్తి కాబోతున్నా, ఆ కంగారు పడిన మనిషి పూర్తి స్థాయి జాతీయ నాయకుడిగా ఎదగలేదని.
నాయకులు తగ్గిపోతే కంగారు పడాలి కానీ, సమస్యలు తగ్గిపోతే కంగారెందుకు? దేశాన్ని నడపడానికి కావలసినంత మంది నాయకులుంటే, దేశం నడవడానికి కావలసినన్ని సమస్యలు వాటంతటవే ఉత్పన్నమౌతాయి. ప్రజలకు ఇంతకన్నా భరోసా ఏం కావాలి!
సమస్యలు లేవు అనుకుంటున్నప్పుడు సమస్యల్ని తెచ్చిపెట్టే నాయకులు వాళ్లకై వాళ్లే ఆవిర్భవిస్తుంటారు. వాళ్లకై వాళ్లే అవతరిస్తుంటారు. బీజేపీలో ఉన్న ఒక మంచి విషయమిది. మోదీజీని అడగరు. అమిత్‌షాకు చెప్పరు. సమస్యను పుష్పగుచ్ఛంలా తెచ్చి ఎవరూ చూడకుండా పార్టీ ఆఫీస్‌లో పెట్టేసి వెళ్లిపోతారు. యూపీ డిప్యూటీ సీఎం కొత్తగా ఓ గుచ్ఛాన్ని వదిలివెళ్లాడు. సీతమ్మవారిని టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నాడు ఆయన. కొత్త సమస్య!
‘‘శర్మగారూ ఏంటిది? సమస్య దేశానికి అవ్వాలి కానీ, పార్టీకి అవకూడదు’’ అన్నాను ఫోన్ చేసి.
‘‘ఏదో అనుకోకుండా అలా వచ్చేసింది కైలాశ్‌జీ’’ అన్నాడు!
‘‘శర్మగారూ.. మనమెప్పుడూ రాముడికే కదా కన్‌ఫైన్ అవుతాం. సీతమ్మవారి దగ్గరకు సడన్‌గా ఎందుకెళ్లారు మీరు?’’ అన్నాను.
‘‘లంక గురించి, రాముడి గురించి, పుష్పక విమానం గురించీ మాట్లాడుతుంటే సీతమ్మవారి మాట కూడా నోటికి వచ్చేసింది కైలాశ్‌జీ’’ అన్నాడు!
ఆయన్తో మాట్లాడుతుంటే ఐ అండ్ బీ మినిస్టర్ ఫోన్ చేశాడు.
‘‘ఏంటి రాజ్యవర్థన్! ఏంటి సమస్య?’’ అన్నాను.
‘‘బాలీవుడ్‌కి, బాలీవుడ్ అని కాకుండా ఇంకేదైనా పేరు మార్చమని చెప్పారు కదా.. దాని గురించి మాట్లాడదామని..’’ అన్నాడు.
‘‘మాటలెందుకు రాజ్యవర్థన్. మార్చెయ్. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఈ ఉడ్‌ల దరిద్రం మనకెందుకు? క్రియేటివ్‌గా మంచి పేరు పెట్టు’’ అన్నాను.
‘‘అదే సార్.. సమస్య ’’ అన్నాడు!
‘‘అదే అంటే?’’ అన్నాను.
‘‘సమస్యే సార్.. సమస్య’’ అన్నాడు.
‘‘అర్థం కాలేదు రాజ్యవర్థన్’’ అన్నాను.
‘‘మనవాళ్లెవరికీ ఐడియాలు రావట్లేదు సార్. సమస్యల్నైతే క్రియేట్ చెయ్యగలం గానీ, సొల్యూషన్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం అని అడుగుతున్నారు సార్’’ అన్నాడు!
మాధవ్ శింగరాజు, వ్యాసకర్త
Comments
Please login to add a commentAdd a comment