మళ్లీ రెచ్చిపోయిన వీఐపీలు! | once again vips dominations | Sakshi
Sakshi News home page

మళ్లీ రెచ్చిపోయిన వీఐపీలు!

Published Fri, Jul 3 2015 12:02 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

అధికారంతో అహం తలకెక్కినవారిని సుమతీ శతకకారుడు ‘అధికార రోగపూరిత బధిరాంధక శవం’తో పోల్చాడు.

అధికారంతో అహం తలకెక్కినవారిని సుమతీ శతకకారుడు ‘అధికార రోగపూరిత బధిరాంధక శవం’తో పోల్చాడు. జనం ఓట్లతో సంక్రమించిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారిపైనే స్వారీచేసే వర్తమాన నాయకగణాన్ని చూసివుంటే ఆయన ఇంకెంత ఆగ్రహించేవాడో ఊహకందదు. వీఐపీల పేరిట ఎక్కడంటే అక్కడ దర్పాన్ని ప్రదర్శించే నాయకుల గురించి మీడియా గతంలో అనేకసార్లు బయట పెట్టింది. కాస్తయినా సిగ్గూ శరమూ లేకుండా రోడ్లపైన ఎర్రబుగ్గ కార్లలో వెళ్తూ సామాన్య పౌరులకు ఎంతో అసౌకర్యం కలిగించే నేతలకు సుప్రీంకోర్టు సైతం చీవాట్లు పెట్టింది. గణతంత్ర వ్యవస్థలో రాచరిక దర్పాన్ని ప్రతిబింబించే ప్రతీకలుండటం తగదని చెప్పింది. ‘అధికార రోగం’ ఎలాంటి జబ్బో కానీ... ఏంచేసినా ఆ బాపతు నేతలను అది వదలడం లేదు. గత మూడురోజుల్లో వెల్లడైన ముగ్గురు నేతల ప్రవర్తనను గమనిస్తే అది ఎప్పటికీ వదిలే రోగం కాదేమోనన్న అనుమానం కలుగుతుంది. ఈ ముగ్గురిలో ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, మరొకరు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజూ కాగా...మరొకరు డీఎంకే నేత స్టాలిన్.

మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శితోపాటు అమెరికా వెళ్తూ ఆ అధికారి కోసమని ఎయిరిండియా విమానాన్ని 57 నిమిషాలపాటు ఆపించారని ఆరోపణలు వచ్చాయి. విమానం ఎక్కబోతుండగా అమెరికా వీసాను ఇంటి దగ్గర మరిచిపోయి వచ్చిన సంగతిని ఆ అధికారి గుర్తించారట. అది వచ్చేవరకూ విమానం ఆపించారని ప్రయాణికులు చెబుతుంటే, అది నిజంకాదని ఫడణవీస్ కొట్టిపారేస్తున్నారు. కానీ, సీఎం ఆదేశంతోనే విమానాన్ని ఆపవలసి వచ్చిందని ఎయిరిండియా డ్యూటీ మేనేజర్ పై అధికారులకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. మరో ఘటన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూకు సంబంధించింది. ఆయన, జమ్మూ-కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్, మరో అధికారి లేహ్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కడానికి రాగా అందులో ఖాళీ లేదట. అంతే...అందులో అప్పటికే కూర్చుని ఉన్న ఒక ఐఎఫ్‌ఎస్ అధికారి కుటుంబసభ్యులు ముగ్గుర్ని దించేశారు.

యధావిధిగా ఈ ఉదంతంలో కూడా తమ తప్పేమీ లేదని కిరణ్ రిజిజూ చెబుతున్నారు. 11.40కి బయల్దేరే విమానం కోసం తాము 10.20కే విమానాశ్రయానికి వచ్చామని, కానీ ఆ సమయాన్ని ముందుకు జరపడంవల్ల అప్పటికే విమానం బయల్దేరబోతున్నదని తెలిసి నిర్మల్‌సింగ్ ఆగ్రహించగా... తప్పు గ్రహించి తమకు చోటిచ్చారని అంటున్నారు. ఈ క్రమంలో మరో ముగ్గుర్ని దించేసిన సంగతి తెలియదంటున్నారు. అయితే, అసలు కేంద్రమంత్రి చివరి నిమిషంలో టిక్కెట్టు కొన్నారని తాజాగా బయటపడింది. మూడో ఉదంతం డీఎంకే నేత స్టాలిన్‌ది. చెన్నైలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైల్లో ప్రయాణించిన స్టాలిన్ తనకు సమీపంగా నిల్చున్న యువకుణ్ణి పక్కకు వెళ్లమని చెబుతూ చెంపదెబ్బ కొట్టారు. అది యూ ట్యూబ్‌లో వచ్చి సంచలనం కలిగించాక సమీపంలో ఉన్న మహిళా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్న ఉద్దేశంతో చేత్తో నెట్టానని స్టాలిన్ సంజాయిషీ ఇచ్చారు. చెంపపై చేయివేసి ఎవరినైనా నెట్టడం సాధ్యమేనా అన్న సంగతి పక్కనబెట్టి మహిళా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే పోలీసులకు అప్పగించాలి తప్ప తానే దౌర్జన్యం చేయడం సరైందేనా?

 ఈ ఉదంతాలన్నిటా తాము నాయకులం...ఏంచేసినా చెల్లుబాటవుతుందనే అహంకారమే కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా చాన్నాళ్లనుంచి నష్టాలు చవిచూస్తున్నది. దాన్ని లాభాల బాట పట్టించడమెలాగో తెలియక పాలకులు తలలు పట్టుకుంటున్నారు. మిగిలిన సమస్యల మాటెలా ఉన్నా ప్రయాణికులంటే కనీస గౌరవం లేకపోవడం, చెప్పిన సమయానికి వారిని గమ్యస్థానాలకు చేర్చలేకపోవడం ఆ సంస్థ ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి ముఖ్య కారణమని వారు గుర్తించలేకపోతున్నారు. పైగా అలాంటి సమస్యలు ఏర్పడటానికి ప్రధానంగా తామే బాధ్యులమని తెలుసుకోలేకపోతున్నారు. ఒక ముఖ్యమంత్రి హుకుం జారీచేశారని అమెరికా వెళ్లే విమానాన్ని దాదాపు గంటసేపు ఆపడం... మరో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎంల కోసం టిక్కెట్లు కొని కూర్చున్న ప్రయాణికులనే దించేయడం ఆ సంస్థ నిర్వహణా తీరును వెల్లడిస్తుంది.

ఎయిరిండియాకు నిరుడు రూ. 5,500 కోట్ల నష్టం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని రూట్లలోనూ అది నష్టాలే చవిచూస్తున్నదని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అవసరమైనంతమంది ప్రయాణికులు లేకపోవడంతో కొన్ని రూట్లలో వెళ్లే విమానాలను తరచు రద్దు చేయాల్సివస్తున్నదని ఈమధ్య వెలువడిన కథనం చెబుతోంది. చెప్పిన సమయానికే విమానాలు బయల్దేరతాయన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రయాణికుల్లో ఎయిరిండియా కలిగించలేకపోతున్నది. అందువల్లే ఆ సంస్థ తిరిగి పుంజుకోవడానికి రాగల పదేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.30,000 కోట్లు ఇవ్వాలని ఆమధ్య నిర్ణయించారు. సమస్య ఎక్కడవస్తున్నదంటే ఈ నేతలంతా ఎయిరిండియాను నిలబెడుతున్నది తామేననుకుంటున్నారు. అందుకోసం ఆ సంస్థ సిబ్బంది తమకు కృతజ్ఞులై ఉండాలనీ, తాము చెప్పినట్టల్లా నడుచుకోవాలనీ ఆ నేతలు భావిస్తున్నట్టు కనబడుతోంది. లేహ్ ఉదంతంలో విమానం పెలైట్ కిందకు దిగి వీఐపీల కారణంగానే సమస్యలొస్తున్నాయని ఆగ్రహిస్తే డిప్యూటీ సీఎం ఎదురుదాడి చేయడమే కాక... అతనిపైనా, విమానం సిబ్బందిపైనా ఫిర్యాదుచేస్తానని బెదిరించడం దీన్నే ధ్రువీకరిస్తున్నది.

 ఈ రెండు ఉదంతాల్లోనూ నివేదిక సమర్పించమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ప్రధాని ఆదేశించారని చెబుతున్నారు. అందువల్లే కావొచ్చు... పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. అంత మాత్రాన ఇకపై అంతా సవ్యంగా ఉంటుందనుకోలేం. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాము వీఐపీలమని, ఏం చేసినా చెల్లుతుందనుకునే భావన నేతల్లో నరనరానా జీర్ణించుకుపోయింది. ముందు అది వదలగొడితే తప్ప పరిస్థితి దారికి రాదు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వీఐపీ సంస్కృతిని సంపూర్ణంగా తుడిచిపెట్టే చర్యలకు శ్రీకారం చుట్టాలి. అలా చేయగలిగితే పరిస్థితులు కాస్తయినా చక్కబడతాయి తప్ప ‘ఇన్‌స్టెంట్’ పశ్చాత్తాపాలూ...ఆదరాబాదరా నివేదికల వల్ల ఒరిగేది శూన్యమని గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement