
మీడియా గొంతు నులమాలనుకునేవారు దేశంలో ఈమధ్య ఎక్కువయ్యారు. ఆ జాబితాలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా వచ్చి చేరారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలనాడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు బిగించి దాని పర్యవసానాలు అనుభవించారు. అయినా ఏదో రూపంలో మీడియాను అదుపు చేయాలన్న యావ పాలకుల్లో పోలేదు. అయితే వసుంధర ఈ మాదిరి పాలకు లందరినీ తలదన్నారు. మీడియా గొంతు నొక్కడమే కాదు... అసలు అవినీతికి వ్యతిరేకంగా ఎవరూ పోరాడే అవకాశమే లేకుండా నేర శిక్షాస్మృతికి సవరణలు తెస్తూ గత నెల 7న ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నిరసనలు వెల్లువెత్తుతున్నా ఖాతరు చేయకుండా సోమవారం ఆ ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దాని ప్రకారం సర్వీసులో ఉన్న లేదా రిటైరైన అధికారులు, న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలొస్తే ప్రభుత్వం అనుమతి మంజూరు చేసేవరకూ వాటిపై ఎలాంటి దర్యాప్తూ జరపకూడదు. ఆ అవినీతి ఆరోపణల గురించి మీడియా సంస్థలేవీ మాట్లాడకూడదు. ఆరోపణలపై దర్యాప్తు అవసరమో కాదో ప్రభుత్వం ఆర్నెల్ల వ్యవధిలోగా నిర్ణయిస్తుందట.
ఆ సమయం దాటితే దర్యాప్తునకు ప్రభుత్వం అంగీ కరించినట్టే భావించవచ్చునట! గతంలో కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్నప్పుడు ఈ మాదిరి బిల్లునే రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నీతిమంతులైన అధికారులను కాపాడటానికే బిల్లు తీసుకొస్తున్నట్టు అప్పట్లో ఆ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అలాంటి ఆరోపణలొచ్చిన ప్రభుత్వ లేక రిటైర్డ్ అధికారుల, న్యాయమూర్తుల పేర్లను మీడియా వెల్లడించకూడ దంటూ ఆంక్షలు పెట్టింది. దాన్ని ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకూ జైలుశిక్ష విధించేం దుకు వీలు కల్పించింది. నేర శిక్షాస్మృతిలో చేర్చిన సెక్షన్ 156(3), సెక్షన్ 190(1)ల ప్రకారం పబ్లిక్ సర్వెంట్ అన్న పదానికిచ్చిన నిర్వచనాలకు అవధుల్లేవు. ప్రస్తుత లేదా పదవీకాలం పూర్తయిన పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లు, సహకార సంస్థల కార్యనిర్వాహకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశ్వవిద్యాలయ అధికారులు, న్యాయ మూర్తులు, మేజిస్ట్రేట్‌లు తదితరులంతా ఈ నిర్వచనాల పరిధిలోకొస్తారు.
ఇప్పుడు అనుసరిస్తున్న ప్రక్రియ ప్రకారం కేసు పెట్టదగిన నేరం జరిగిందని భావించినప్పుడు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ఆ వెంటనే నేరంపై దర్యాప్తు ప్రారంభిస్తారు. అది పూర్తయ్యాక సంబంధిత కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తారు. ఆ చార్జిషీటును పరిశీలించి ముద్దాయిపై విచారణ ప్రారంభించడానికి తగిన ఆధారాలున్నాయో లేదో మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు.ఒకవేళ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించిన పక్షంలో ఎవరైనా జిల్లా ఎస్పీని ఆశ్రయించ వచ్చు లేదా దర్యాప్తు జరపమని పోలీసుల్ని ఆదేశించాల్సిందిగా కోరుతూ మేజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమాన్నంతటినీ రాజస్థాన్ ప్రభుత్వం కాలరాసింది. అసలు దర్యాప్తు కోసమే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటున్నది. ఆఖరికి మేజిస్ట్రేట్ అయినా సరే దీనికి లోబడవలసిందే! అది అవసరమో కాదో తేల్చడానికి ప్రభుత్వం ఆర్నెల్ల గడువు కోరుతోంది. ఈ నిబంధనల వరస గమనిస్తే బిల్లు రూపొందించినవారికి ఇంగిత జ్ఞానం కొరవడిందా లేక ఎవరేమనుకుంటే మనకేమిటన్న తెగింపు తలకెక్కిందా అన్న అనుమానం రాకమానదు. ఈ బిల్లు చట్టమైతే పోలీసులు మాత్రమే కాదు... లోకాయుక్త వంటి సంస్థ సైతం అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టడం అసాధ్యం.
పైగా ఈ బిల్లులో న్యాయ వ్యవస్థను కూడా చేర్చి దానికి సైతం మకిలి అంటించే పనిచేశారు. మేజి స్ట్రేట్‌లపైనా, న్యాయమూర్తులపైనా ఆరోపణలొస్తే ఏంచేయాలన్న అంశంలో న్యాయవ్యవస్థకు వేరే విధానాలున్నాయి. దాన్ని గురించిన కనీస అవగాహన బిల్లు రూపొందించినవారికి కొరవడిందని అర్ధమవుతుంది. నిజాయితీపరులైన అధి కారులు అనవసర నిందల వల్ల వ్యధ చెందకూడదన్న సదుద్దేశంతో బిల్లు తీసు కొచ్చామని వసుంధర సర్కారు పైకంటున్నా అవినీతిపరులైనవారిని కాపాడేందుకే దీన్ని ప్రవేశపెట్టారని ఎవరికైనా అనిపిస్తుంది. తమపై ఆరోపణలొచ్చాయని తెలి యగానే ఎవరైనా చేతులు ముడుచుకుని కూర్చోరు. వెనువెంటనే రంగంలోకి దిగి ఆధారాలన్నీ మటుమాయం చేసే ప్రయత్నాలు మొదలెడతారు. అలాంటివన్నీ తీరిగ్గా చక్కబెట్టుకునేందుకు రాజస్థాన్ బిల్లు వీలు కల్పిస్తోంది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తోంది. అవినీతి ఆరోపణ లొచ్చినప్పుడు దర్యాప్తునకు ముందస్తు అనుమతి అవసరమన్న నిబంధనను మూడేళ్లక్రితమే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
పాలన పారదర్శకంగా ఉండాలని, ఏం జరుగుతున్నదో ప్రజలకు తేటతెల్లం కావాలని అందరూ ఘోషిస్తున్న తరుణంలో పాలకులకు ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చినట్టు? ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లోనూ అవినీతి పెరిగిపోయిందని నాలుగేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వందలాది అవినీతి కేసుల్లో దర్యాప్తు సాగుతున్నా శిక్షలు పడిన కేసులు స్వల్పం. ఈమధ్య కాలంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవినీతి ఆరోపణల కారణంగా అరెస్టు చేయాల్సివచ్చింది కూడా. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇదంతా కొంప ముంచుతుందన్న భయం ప్రభుత్వాన్ని వెన్నాడుతోంది. పర్యవసానంగానే ఆర్డినెన్స్, ఆ తర్వాత బిల్లు పుట్టుకొచ్చాయి. ఈ నిబంధనలే అమలైతే బోఫోర్స్ కేసు మొదలుకొని 2 జీ స్కాం, బొగ్గు కుంభకోణం వరకూ ఏదీ బయటికొచ్చేది కాదు. అసలు అన్నా హజారే ఉద్యమమే ఉండేది కాదు. ఆ కుంభకోణాలనూ, వాటిపై వెల్లువెత్తిన నిరసనలనూ ఆసరా చేసుకునే అధికారంలోకి రాగలిగామన్న సంగతిని బీజేపీ పెద్దలైనా వసుంధర రాజే సింధియాకు గుర్తుచేయాలి. అవినీతి రహిత పాలన అందించాల్సింది పోయి, ఆ అవినీతికి ముసుగు కప్పే, మీడియా గొంతు నొక్కే ఇలాంటి అనాగరిక చర్యలకు ఎంత త్వరగా స్వస్తి పలికితే అంత మంచిదని గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment