అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయడానికి ప్రధాని కార్యా లయం కృతనిశ్చయంతో ఉన్నదని సరిగ్గా వారం క్రితం మీడియాలో కథనాలు హోరెత్తాయి. ఇందుకోసం కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు మార్కెటింగ్ సంస్థలతో సమావేశం కాబోతున్నారని కూడా ఆ కథనాలు వివరించాయి. ఆ నిర్ణయం కోసం సామాన్యులంతా ఆత్రంగా ఎదురుచూస్తుండగా బుధవారం చమురు సంస్థలన్నీ కూడబలుక్కుని ఒక్క పైసా తగ్గించి తమ ‘ఉదారత’ చాటుకున్నాయి.
జనంతో పరిహాసమాడాయి. గత 17 రోజులుగా పెట్రో ధరలు నిరాటంకంగా పైపైకి పోతున్నాయి. పెట్రోల్‌పై గరిష్టంగా 36 పైసలు, కనిష్టంగా 14 పైసల చొప్పున పెరిగింది. కానీ బుధవారం పెట్రోల్ ధర 60 పైసలు తగ్గిందని వార్తలొచ్చేసరికి ధరలకు కళ్లెం వేయడమంటే ఇదా అని అందరూ నిట్టూర్చారు. కానీ ఈలోగానే లెక్క తప్పామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తన ప్రకటన వెనక్కు తీసుకుని తగ్గింపు ఒక్క పైసా మాత్రమేనని తేల్చింది. కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూపాయి చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేరళలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ఒక్కరూ ఈ దిశగా ఆలోచించలేదు.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎలాం టివారికైనా తల తిరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలకనుగుణంగా దేశంలో పెట్రో ధరలుండాలని కీర్తి పారిఖ్ కమిటీ 2010లో సూచించాక ఆనాటి యూపీఏ ప్రభుత్వం దాన్ని ఆమో దించింది. అయితే పెట్రోల్‌కు మాత్రమే దీన్ని వర్తింపజేస్తామని, డీజిల్‌పై సబ్సిడీ కొనసాగు తుందని చెప్పింది. కానీ కొన్నాళ్లకే డీజిల్‌పై ‘పాక్షికం’గా నియంత్రణ ఎత్తేసింది. ఎన్‌డీఏ అధికారం లోకొచ్చి ఆర్నెల్లు గడవకుండానే ఆ పాక్షిక నియంత్రణను కూడా తొలగించింది.
ఇదంతా విని యోగదారుల మేలు కోసమేనని ప్రభుత్వాలు చెప్పాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పడిపోయినప్పుడు ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. అక్కడ పెరిగినప్పుడు ఇక్కడా పెరగాలి. కానీ ఆచరణలో ఇదేమీ జరగటం లేదు. దేశంలో ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడు ఇంధనం ధరలు స్తంభిస్తున్నాయి. అవి పూర్తి కాగానే పరుగులు తీస్తున్నాయి. అందుకు ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యం.
ఈ నెల 12న అక్కడ పోలింగ్ జరగ్గా దానికి ముందు 19 రోజులపాటు పెట్రో ధరలు నిలకడగా ఉండిపోయాయి. కానీ ఆ తర్వాత 14 నుంచి 29వ తేదీ వరకూ రోజూ అవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ పక్షం రోజుల్లో ఒక్క పెట్రోల్‌పైనే లీటర్‌కు దాదాపు రూ. 4 వరకూ పెరిగింది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకున్నా పెట్రో ధరలు చవగ్గా ఉండాలి. బుధవారంనాటికి అక్కడ బ్యారెల్ ముడి చమురు ధర 75.38 డాలర్లు. 2013లో బ్యారెల్ ధర 113 డాలర్లున్నప్పుడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 79.12. కీర్తి పారిఖ్ కమిటీ లెక్క ప్రకారమైతే ఇప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ. 53 మించకూడదు. కానీ అది రూ. 83.07గా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? పాలకుల దగ్గర జవాబు లేదు.
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విధానం అస్తవ్యస్థంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నాయి. పెట్రోల్‌నే ఉదాహరణగా తీసు కుంటే చమురు సంస్థలు డీలర్‌కు దాన్ని లీటర్ రూ. 37.43 చొప్పున అమ్ముతాయి. దానిపై కేంద్రం ఎక్సైజ్ సుంకం రూ. 19.48 విధిస్తోంది. ఇదిగాక డీలర్ కమిషన్ రూ. 3.62. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ దాదాపు రూ. 17 వరకూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది ఇంతకన్నా అధికం.
వ్యాట్ విధింపులోనూ మతలబు ఉంది. రాష్ట్రాలు మూల ధర(డీలర్‌కు అమ్మే లీటర్ పెట్రోల్ ధర)పై కాకుండా కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై వ్యాట్‌ను లెక్కేస్తున్నాయి. పర్యవసానంగా అవి అదనపు ఆదాయాన్ని రాబడుతున్నాయి. ఏతా వాతా విని యోగదారుల దగ్గరకెళ్లేసరికి పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపుకన్నా అధికంగా ఉంటున్నాయి. ఆమధ్య ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక ఇంధన ధరలపై కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర సగటున ఒక డాలర్ పెరిగితే రాష్ట్రాలకు అదనంగా రూ. 18,728 కోట్ల ఆదాయం వస్తుందని ఆ నివేదిక తేల్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రం రూ. 1.60 లక్షల కోట్లు రాబట్టింది. నిరుడు ఇది రూ. 2.42 లక్షల కోట్లు. వ్యాట్ ద్వారా రాష్ట్రాలన్నీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ 1.66 లక్షల కోట్లు ఆర్జిం చాయి. పెట్రో ధరలు తగ్గించమని డిమాండు వచ్చినప్పుడల్లా రాష్ట్రాలు తగ్గించాలని కేంద్రం అంటుంటే... కేంద్రం వసూలు చేసే సుంకాలు తగ్గాలని రాష్ట్రాలు చెబుతున్నాయి.
‘ఒకే దేశం–ఒకే పన్ను’ నినాదంతో ఎంతో ఆర్భాటంగా జీఎస్‌టీ అమలు ప్రారంభించినా ఇంతవరకూ పెట్రోల్, డీజిల్ దాని పరిధిలో లేవు. అలా తెస్తామని కేంద్రం అంటున్నా అదంత సులభం కాదు. రాష్ట్రాలు సభ్యులుగా ఉన్న జీఎస్‌టీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను అంగీకరించాలంటే మొదటి అయిదేళ్లూ అవి కోల్పోతున్న ఆదాయానికి కేంద్రం తగిన పరిహారం ఇవ్వాలి. జీఎస్‌టీ పరిధిలోకొచ్చాక తన ఆదా యమే తగ్గే అవకాశం ఉన్నప్పుడు కేంద్రం ఈ పని ఎలా చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. పైగా జీఎస్‌టీ అమలు కావడం మొదలైనా మద్యం, పొగాకు ఉత్పత్తులపై విధించినట్టు ‘సిన్ టాక్స్’ పేరిట పెట్రో ధరలపై రాష్ట్రాలు సర్‌చార్జి విధించుకోవడానికి అవకాశం ఉంది.
అదేమంటే వాహన కాలుష్యాన్ని తగ్గించడానికే ఈ సర్‌చార్జి అని అవి చెబుతాయి. ఏతావాతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన పెట్రో ధరల పద్మవ్యూహంలో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా పెట్రో ధరలకు బ్రేకులేస్తూ, అవసరం తీరాక ఇష్టానుసారం పెంచే నీతిమాలిన విధానాన్ని జనం గట్టిగా నిలదీసే వరకూ ఈ పరిస్థితి మారదు.
Comments
Please login to add a commentAdd a comment