
‘ప్లానింగ్’కు పాతర
ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మానసపుత్రిక ప్రణాళికా సంఘం చరిత్ర పుటల్లో చేరిపోయే ఘడియలు సమీపించాయి. సంఘం భవితవ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రుల సదస్సులో చాలామంది వర్తమాన అవసరాలను తీర్చే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటుకు మొగ్గు చూపారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడాన్నిబట్టి చూస్తే దాని ముగింపు ఇక లాంఛనప్రాయమేనని అర్థమవుతుంది. వాస్తవానికి మోదీ ఎన్నికల సమయంలోనే ప్రణాళికా సంఘం వ్యవహార శైలిపై నిశిత విమర్శలుచేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తొలిసారి ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన ప్రసంగంలో సంఘానికి వీడ్కోలు పలకబోతున్నట్టు ప్రకటించి, దాని స్థానంలో ఏర్పాటుచేయబోయే సంస్థ ఎలా ఉండాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అందుకోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేశారు. పాత కాలానికి పనికొచ్చిన సంఘం వర్తమాన సవాళ్లను ఎదుర్కొనడంలో విఫలమవుతున్నదన్నదే మోదీ ప్రధాన విమర్శ. అంతేకాదు...సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశారు గనుక ప్రణాళికా సంఘం రాష్ట్రాల ఆకాంక్షలనూ, అవసరాలనూ పట్టించుకోవడంలో విఫలమైందన్న అభిప్రాయమూ ఆయనకు ఉన్నది. మోదీ వరకూ ఎందుకు...దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ప్రణాళికా సంఘం ‘పనిపట్టాలని’ చూశారు. 2010లోనే అందుకు సంబంధించిన లాంఛనా లను ప్రారంభించినా ఎందుకనో దాన్ని తుదికంటా తీసుకెళ్లలేకపోయారు.
వాస్తవానికి ప్రణాళికా సంఘం నెలకొల్పడం వెనకున్న ఉద్దేశాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ సంస్థ ఇన్నాళ్లపాటు బతికి బట్టకట్టడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థలకు కీలకమైన పాత్రనిచ్చి,వాటిని అభివృద్ధిపరచడం... కేంద్ర ప్రభుత్వ పూర్తి నియంత్రణలో దేశంలో సమతులాభివృద్ధిని సాధించడం, ప్రాంతీయ ఆర్థిక అసమానతలను రూపు మాపడం దాని లక్ష్యాలు. పూర్వపు సోవియెట్ యూనియన్ అనుసరించిన ప్రణాళికాబద్ధ అభివృద్ధి నమూనాను చూసి ముచ్చటపడి...దాన్ని అనుసరించాలని 1950లో నెహ్రూ సంకల్పించారు. స్వేచ్ఛా విపణి ఆర్థిక విధానాలను అవలంబించి పాశ్చాత్య ప్రపంచం 150 ఏళ్లలో సాధించిన అభివృద్ధి స్థాయికి సోవియెట్ యూనియన్ కేవలం మూడు దశాబ్దాల్లో చేరడం సాధ్యమైన తీరు ఆయన ను సంభ్రమపరిచింది. ప్రణాళికా సంఘం ఇప్పటివరకూ 12 పంచవర్ష ప్రణాళికలను దేశానికి అందించింది. ప్రభుత్వ రంగంలో ఇటు మౌలిక పరిశ్రమలూ, అటు భారీ పరిశ్రమలూ నెలకొల్పడానికి అవసరమైన వనరుల సమీకరణపై కీలక సూచనలు చేసింది. అయితే, ఇదంతా మొదటి ఎనిమిది పంచవర్ష ప్రణాళికల వరకే. 1997లో ప్రారంభమైన తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక మొదలుకొని సంఘంలో పబ్లిక్ రంగ సంస్థల ప్రాధాన్యత తగ్గిపోయింది. అంతకు నాలుగైదేళ్లక్రితమే ఆర్థిక సంస్కరణలు మొదలై, లెసైన్స్ రాజ్ ప్రభావం క్రమేపీ తగ్గుతూ... ప్రైవేటు రంగం శక్తి సంతరించుకుంటున్న దశ అది. పబ్లిక్ రంగానికి దీటుగా పెట్టుబడులు పెట్టడానికి సాహసించే కొత్త తరం మదుపుదార్లు ముందుకొచ్చిన సమయమది. మరోపక్క అభివృద్ధి కోసమని ప్రపంచబ్యాంకుతో సహా ఎక్కడైనా రుణం తెచ్చుకోవడానికి వెసులుబాటు కలిగిన తరుణంలో ప్రణాళికా సంఘం నియంత్రణలేమిటని రాష్ట్రాలు విసుక్కోవడం మొదలైంది. వాస్తవానికి ఏడో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను 1985లో సంఘం ఆనాటి వైస్ చైర్మన్ మన్మోహన్‌సింగ్ సమర్పించినప్పుడు ప్రణాళిక సంఘం సభ్యుల్ని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘జోకర్ల గుంపు’గా అభివర్ణించి తన అసహనాన్ని వ్యక్తంచేశారు. తాననుకున్న బుల్లెట్ రైళ్లు, షాపింగ్ మాల్స్, ఎక్స్‌ప్రెస్ హైవేలు, వినోదాత్మక నైపుణ్యకేంద్రాలు, భారీ ఆవాస సముదాయాలు ప్రణాళిక సంఘం ముసాయిదాలో లేనందుకు ఆయనకు ఎక్కడలేని ఆగ్రహమూ కలిగింది. సంఘం ప్రమేయం లేకుండానే వాటిల్లో కొన్ని సాకారమై, మరికొన్ని దరిదాపుల్లోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రణాళికా సంఘం ‘చాదస్తాన్ని’ భరించే ఓపిక ఇక ఎవరికుంటుంది?
కనుకనే నరేంద్ర మోదీ ప్రతిపాదనకు రాష్ట్రాలనుంచి గట్టి మద్దతే లభించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కొన్ని వ్యతిరేకించినా పార్టీవ్రత్యంతోనే అవి ఆ పని చేశాయనుకోవాలి. ఎందుకంటే కేటాయింపులపై అజ్మాయిషీ చేస్తూ, వ్యయంపై నియంత్రణలు విధిస్తూ, తాము రూపొందించిన ప్రాజెక్టుల అమలుపై లక్ష్య నిర్దేశం చేస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రణాళికా సంఘం తీరు ఏ ముఖ్యమంత్రికీ నచ్చడంలేదన్నది బహిరంగ రహస్యం. అయితే, ఇన్ని నియంత్రణలున్నా దేశంలో అక్షరాస్యత, శిశుమరణాల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ సాధ్యంకావడం లేదు. ఆకలిచావులు, మహిళలపై దాడులు ఆగడం లేదు. సామాజిక అసమాన తలు తగ్గిన దాఖలాలు లేవు. పేదరిక నిర్మూలనలోనూ వైఫల్యమే. ఇప్పటికీ పల్లె సీమలు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో మెజారిటీ జనాభా కు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయరంగం నానాటికీ కుంచించుకుపోతున్నది. ఇలాంటి తరుణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యం పెరిగేలా, వాటి మనోభావాలకు పెద్దపీట వేసేలా అసలైన ఫెడరలిజాన్ని ప్రతిబింబించేలా కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. అధికారమూ, ప్రణాళికా వికేంద్రీకరించాలన్న సంకల్పమూ మంచిదే. అయితే ఈ వికేంద్రీకరణ... సామాజిక బాధ్యతలనుంచి ప్రభుత్వాలు వైదొలగడానికి సాధనగా మారితే అది సామాన్యులకు శరాఘాతమవుతుంది. కొత్త సంస్థ ఏర్పాటులో ఈ విషయమై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పాలకులు గుర్తుంచుకోవాలి.