నిబంధనలంటే భయభక్తులు లేవు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని లేదా అంటారని బెరుకు లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికల సంఘం వేయి కళ్లతో నిఘా పెట్టి ఉంచుతుందని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే చర్యలు తీసుకునే ప్రమాదమున్నదన్న భీతి అసలే లేదు. ప్రచార సభల్లో వివిధ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు ప్రజలను దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. వీళ్ల నోళ్లకు తాళం వేసేవారెవరూ లేరా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఈ జాబితా లోకెక్కే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వరసగా రెండు రోజులు వివిధ సభల్లో పాల్గొని చేసిన ప్రకటనలు ఆయన స్థాయిని మాత్రమే కాదు... మన ఎన్నికల సంఘం సమర్థతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మన సైన్యాన్ని ఆయన ‘మోదీ సేన’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వృత్తిపరమైన నైపుణ్యంలోనూ, అంకిత భావంలోనూ ప్రపంచంలోనే మన సైన్యానికి పేరుంది. దాన్ని రాజకీయ సంకుచిత చట్రంలో ఇరి కించాలని చూడటం దిగజారుడుతనమే అవుతుంది.
తాము వచ్చాకే ఉగ్రవాదులతో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. కానీ సైన్యం నిర్వహించిన దాడుల్ని సొంత ఖాతాలో వేసుకోవాలని చూడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటి దాడులు గత ప్రభుత్వాల హయాంలో కూడా జరిగాయని లోగడ సైన్యంలో పనిచేసినవారు చెబుతున్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించడానికి ఏ శక్తులైనా ప్రయత్నించినప్పుడు, వారి ఆనుపానులు తెలుసుకుని తగిన వ్యూహాన్ని రూపొందించుకుని దాడులు చేయడం సైన్యానికి సర్వసాధారణం. కానీ దాన్ని మోదీ సేనగా అభివర్ణించి, వారు చేసిన పని తమ ఘనతగా చెప్పుకోవడం అభ్యంతరకం. మన సైన్యం ఫొటోలను వాడుకోవడం, దాని ప్రస్తావన తీసుకురావడం నిబంధనల ఉల్లంఘన కిందికొస్తుందని ఎన్నికల సంఘం గత నెల 17న స్పష్టంగా చెప్పింది. కానీ యోగి ఆదిత్యనాథ్‌కు ఇవేమీ పట్టలేదు. అంతకు ముందురోజు గ్రేటర్ నోయిడాలోని బిసారా(దాద్రి) గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో సైతం ఆయన ఇలాంటి విపరీత వ్యాఖ్యలే చేశారు. బిసారా నాలుగేళ్లక్రితం ఉన్మాద మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అఖ్లాక్ స్వగ్రామం. ‘ఇక్కడేం జరిగిందో గుర్తులేనిదెవరికి? మన భావోద్వేగాలను అణిచేయడానికి అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించిందో మరిచిపోగలమా?’ అంటూ ఆ సభలో ఆయన ప్రసంగించారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందో లేదో ఆరా తీయడం... అది జరగకపోతే అందుకు ఉన్న అవరోధాలను తొలగించడం ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. సమాజ్‌వాదీ సర్కారు అణిచేయడానికి ప్రయత్నించిన ఆ భావోద్వేగాలేమిటో యోగి వివరించలేదుగానీ...అఖ్లాక్ కుటుంబానికి జరిగిన అన్యాయమైతే చాలా తీవ్రమైనది. తండ్రిపై ఉన్మాద మూక దాడిచేస్తున్నప్పుడు అఖ్లాక్ చిన్న కుమారుడు అడ్డు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ మూక అతనిపై సైతం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వైద్య చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. ఆ గ్రామంలో తాము ఏకాకులమని, తమనెవరూ రక్షించబోరని గుర్తించి ఆ కుటుంబం వేరేచోటకు వలసపోయింది. ఆ దాడికి కారకులైనవారిని వెనువెంటనే అరెస్టు చేసి, వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి శిక్షపడేలా చేయాల్సిన సమాజ్‌వాదీ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ కేసులోని నిందితులను కాపాడు తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అవి కేవలం ఆరోపణలు కాదు... నిజాలన్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించిన ఆ సభలో అఖ్లాక్ కేసు ప్రధాన నిందితుడు విశాల్ సింగ్ రాణా, మరో 15మంది పాల్గొన్నారు. వారిపై హత్య, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులున్నాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ కేసులో ఇంకా అభియోగాలే నమోదు కాలేదు.
ఇది జరగకపోగా ఎన్నికలసభలో ఆ కేసులోని నిందితులకు మద్దతిచ్చే విధంగా ముఖ్యమంత్రే మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. ఒకవేళ ఆ కేసులో నిందితులుగా ఉన్నవారు అమాయకులని, అన్యాయంగా కేసులు పెట్టారని అనుకుంటే అసలు నిందితులెవరో ఈపాటికి యోగి సర్కారు వెలికితీయాల్సింది. ఆ సంగతినీ తేల్చకుండా, నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోకుండా ‘ఇక్కడ భావోద్వేగాలు అణిచేయడానికి ప్రయత్నించార’ంటూ మాట్లాడటం వల్ల ఎవరికి ఉప యోగం? మరి కుటుంబ పెద్దను కోల్పోయి, సొంత ఊరును విడిచి దిక్కులేని పక్షుల్లా ఎటో పోవా ల్సివచ్చిన అఖ్లాక్ కుటుంబానికి జరిగిన అన్యాయం మాటేమిటి? ఒక్క యోగి ఆదిత్యనాథ్ మాత్రమే కాదు, రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కావడం అవసరమని భావిస్తున్నారని ఒక సభలో చెప్పారు. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది.
దాన్ని అధిష్టించినవారికి కొన్ని పరిధులు, పరి మితులు ఉంటాయి. ముఖ్యమంత్రిగా, ఎంపీగా సుదీర్ఘకాలం సేవలందించిన కల్యాణ్‌సింగ్‌కు ఈమాత్రం తెలియదనుకోలేము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన స్థాయి దిగజార్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. జనాన్ని బెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకుల వ్యాఖ్యలపై ఫిర్యాదులందినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి నోటీసులు జారీ చేస్తోంది. కల్యాణ్‌సింగ్ వ్యాఖ్యల్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దృష్టికి తీసుకురావాలని అది నిర్ణ యించిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే మరింత కఠినమైన చర్యలు తీసు కునేందుకు అవసరమైన అధికారాలను ఎన్నికల సంఘానికి కల్పిస్తే తప్ప వీటిని పూర్తిగా అరి కట్టడం సాధ్యం కాదు. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? పార్టీలన్నీ ఈ విషయంలో కలిసి వస్తాయా? అది జరిగేవరకూ యోగి, కల్యాణ్‌సింగ్, చంద్రబాబు లాంటివారు ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment