న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో కూడా ఆరు సార్లు సర్జికల్ దాడులు చేశామని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను మోదీ ఖండించారు. బహుశా వారు వీడియో గేమ్‌లో సర్జికల్ దాడులు చేసి ఉంటారని మోదీ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండి పడ్డారు. ‘సైన్యం మోదీ తన సొంత ఆస్తి కాదు. కానీ త్రివిధ దళాలలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలను మోదీ తన ఆస్తిగా భావిస్తున్నార’ని రాహుల్ ఆరోపించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘సర్జికల్ దాడులు చేసింది మోదీ కాదు.. ఆర్మీ. యూపీఏ కూడా సర్జికల్ దాడులు చేసిందంటే మోదీ.. అవి నిజం కావు.. వీడియో గేమ్ అని ఎగతాళి చేశారు. అలా మాట్లాడి ఆయన ఆర్మీని కూడా అవమానించార’ని పేర్కొన్నారు. అంతేకాక ‘జనరల్ విక్రమ్ సింగ్ చెప్పింది నిజం. 2008 - 2014 వరకు యూపీఏ ప్రభుత్వం ఆరు సార్లు సర్జికల్ దాడులు చేసింది. అంతేకాక అవి ఏ రోజున జరిగాయనే వివరాలను కూడా అందజేశాం. అయితే వీటిని మా పార్టీ ఓట్ల కోసం వాడుకోవడం లేద’న్నారు రాహుల్ గాంధీ.
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందన్నారు రాహుల్. మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి ఏమైనవని రాహుల్ ప్రశ్నించారు. ఉద్యోగుల గురించి కానీ, రైతుల గురించి కానీ మోదీ ఏమీ మాట్లాడడం లేదన్నారు. చౌకీదార్ చోర్‌హై అన్న వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు రాహుల్ అంగీకరించారు. కానీ ఆ వ్యాఖ్యల పట్ల బీజేపీకి ఎన్నటికి క్షమాపణలు చెప్పబోనన్నారు. చౌకీదార్ చోర్ హై అన్నది కాంగ్రెస్ నినాదంగా పనిచేస్తుందన్నారు. మసూద్ అజర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కానీ గతంలో అతన్ని ఎవరు విడిచి పెట్టారని రాహుల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment