రాబర్ట్ వాద్రా రాయని డైరీ | robert vadra unwritten dairy | Sakshi
Sakshi News home page

రాబర్ట్ వాద్రా రాయని డైరీ

Published Sun, Apr 17 2016 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాబర్ట్ వాద్రా రాయని డైరీ - Sakshi

రాబర్ట్ వాద్రా రాయని డైరీ

ఈ పేపర్ వాళ్లు రాయాల్సిందంతా రాసేశారు. చెప్పాల్సిందంతా చెప్పేశారు. అవన్నీ నమ్మి ఉంటే పెళ్లయిన రెండో రోజే ప్రియాంక నాకు విడాకులు ఇచ్చి ఉండాలి. అలా జరగలేదు. పందొమ్మిదేళ్లుగా సుఖంగా ఉన్నాం. ఇంకో ఏడాది సుఖంగా ఉండగలిగితే ఇరవై ఏళ్లు సుఖంగా ఉన్నట్లు అవుతుంది. ఇరవై కంప్లీట్ అవనిస్తారో లేదో చూడాలి మీడియా మహానుభావులు.

సుఖ సంతోషాల గురించి మీడియా అదే పనిగా  రాయదు. సుఖ సంతోషాలను చెడగొట్టే వార్తల్ని మాత్రం పనిగట్టుకుని రాస్తుంది! ఇన్ని కోట్లు, ఇంత పలుకుబడి సంపాదించి ఏం లాభం? మీడియా దృష్టిలో నేనింకా అల్లుడినే. నేనింకా భర్తనే. ఆ తర్వాతే రాబర్ట్ వాద్రాని. ఒక్కోసారి ఒక్కణ్నీ కూర్చుని కుమిలిపోతుంటాను. ఎందుకు ప్రియా నా ప్రేమను అంగీకరించావ్? ఎందుకు ప్రియా నన్ను నీ జీవిత భాగస్వామిని చేసుకున్నావ్? అప్పుడే వద్దంటే.. ఇప్పుడు నాకింత వ్యధ ఉండేది కాదు కదా, నిన్ను అడ్డం పెట్టుకుని ఎదుగుతున్నాననే మాట పడేవాడిని కాదుగా.. అని ప్రపంచమంతా వినిపించేలా పెద్దగా అరిచి చెప్పాలనిపిస్తుంది. ప్రేమ వల్ల మనిషిగా ఎదిగినవాణ్ణే కానీ, ప్రేమించిన మనిషి వల్ల ఎదిగినవాణ్ణి కాదు నేను. ఎవరు నమ్ముతారు?
 
‘రాబీ’ అంటూ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసింది ప్రియాంక. ‘రేపు నీ బర్త్‌డే. గుర్తుందా?’ అంది! మౌనంగా తన కళ్లల్లోకి చూశాను. నిజమే. రేపు సోనియాగాంధీ అల్లుడి బర్త్ డే. ప్రియాంకగాంధీ భర్త బర్త్ డే!  ‘ఏం ఇమ్మంటావ్ రాబీ.. బర్త్‌డే గిఫ్ట్‌గా’ అంటోంది ప్రియాంక. తనేం మారలేదు. తన ప్రేమా మారలేదు. అలాంటి మనిషికా నేను అరిచి ఏదో చెప్పాలనుకుంది?!
 
ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను.. ‘పెళ్లి చేసుకుందాం ప్రియా’ అని. ప్రియాంక వెంటనే ఒప్పుకుంది! రాహుల్ ఒప్పుకున్నాడు. సోనియాజీ ఒప్పుకున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఒప్పుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఒప్పుకుంది. మీడియానే.. ఒప్పుకోలేదు! నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదంది. మాది రిచ్ ఫ్యామిలీ కాదంది. నాలో గొప్ప లక్షణాలేవీ లేవంది. ఫిజికల్లీ నాట్ ఎట్రాక్టివ్ అంది. ప్రియాంక కంటే ఎత్తు తక్కువ అంది. చదువులో పూర్ అంది. డిగ్రీ ఫెయిల్ అంది. కనీసం మాటకారి కూడా కాదంది. అసలు గాంధీ-నెహ్రూల ఫ్యామిలీకి ఇంత కర్మేమిటని దేశ ప్రజలను ఉద్దేశించి కూడా అడిగింది! ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టింది.. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రియాంక మంచి లీడర్‌గా ఎదిగి ఉండేదని!

నేను లేని ప్రియాంకను మీడియా ఊహిస్తూ ఉంటే .. ప్రియాంక లేని నన్ను ఊహించుకుంటూ నేను చాలాసేపు ఒంటరిగా ఉండిపోయాను. పక్కనే ప్రియాంక ఉందన్న సంగతి కూడా మార్చిపోయి అలా ఉండిపోయాను. ‘రాబీ.. ఏంటి ఆలోచిస్తున్నావు? డోన్ట్ వాంట్ గిఫ్ట్?’ అంటోంది నవ్వుతూ. అవే చిలిపి కళ్లు. అదే చిలిపి నవ్వు. తన పదమూడేళ్ల వయసులో ప్రియాంక నాతో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement