యుద్ధాలెప్పుడూ అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా నేతృత్వంలో ఈజిప్టు, బహ్రైన్, కువైట్, కతార్, జోర్డాన్, సుడాన్ తదితర పది దేశాల కూటమి సేనలు యెమెన్‌పై సాగిస్తున్న బాంబు దాడులు చివరకు మరో సంక్షుభిత రాజ్యాన్ని సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాక్, సిరియా, లిబియా వంటి దేశాల్లో ఈ బాపతు తప్పునే చేసి అవి అంతర్యుద్ధ జ్వాలల్లో భగ్గున మండటానికి కారణమైన అమెరికా...యెమెన్ విషయంలో సౌదీ అరేబియాకు ‘అన్నివిధాలా’ సాయం అందిస్తామని ప్రకటించింది. ఉత్తర యెమెన్‌ను దిగ్బంధించిన హౌతీ మిలిటెంట్లు వెనక్కు తగ్గి తమ ఆయుధాలన్నిటినీ అప్పగించేవరకూ సౌదీ నేతృత్వంలోని యుద్ధ విమానాలు బాంబు దాడులు కొనసాగిస్తూనే ఉంటాయని ఈజిప్టులో జరిగిన అరబ్ లీగ్ శిఖరాగ్ర సదస్సు అనంతరం లీగ్ చీఫ్ నబిల్-అల్-అరబీ ప్రకటించారు. కనుక ఈ రావణకాష్టం అంతూ దరీ లేకుండా కొనసాగుతుందన్నమాట!
వాస్తవానికి యెమెన్ ఇప్పటికే అనేకానేక అంతర్గత ఘర్షణలతో సతమతమ వుతున్నది. భిన్న గిరిజన తెగల మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు సాగుతోంది. వీటికి తోడు అటు ఉత్తర యెమెన్‌లోనూ, ఇటు దక్షిణ యెమెన్‌లోనూ వేర్పాటువాద ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇవన్నీ స్థానికంగా అల్ కాయిదా గ్రూపు పురుడు పోసుకోవడానికి దోహదపడ్డాయి. వీటికి సమాంతరంగా సుమారు దశాబ్దకాలంగా ఉత్తర యెమెన్‌లో షియా మైనారిటీ తెగ జైదీలకు చెందిన హౌతీ తిరుగుబాటు దారులు పోరు సాగిస్తున్నారు. నెలక్రితం ఈ తిరుగుబాటుదారులు రాజధాని నగరం సనాను చేజిక్కించుకోవడంతో అధ్యక్షుడు హది అక్కడినుంచి పరారై వేరే నగరంలో తలదాచుకుంటున్నారు. తొలుత అధ్యక్ష పదవినుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించినా... తర్వాత మనసు మార్చుకుని తానే అధ్యక్షుడినన్నారు.
అంతర్గత కారణాల పర్యవసానంగా ఏర్పడ్డ ఈ పరిణామం వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చునన్న సౌదీ అరేబియా శంక వల్ల మొత్తం సమస్య అంతర్జాతీయ ఘర్షణగా రూపుదిద్దుకుంది. షియా, సున్నీ తెగల ఆధిపత్య పోరుగా మారుతున్నది. వాస్తవానికి జైదీలను ఇరాన్‌లోని షియాలు తమవారిగా భావించరు. వారి తిరుగుబాటుకు ఇరాన్ ఇంతవరకూ ఆయుధసాయాన్ని లేదా ఆర్థిక సాయాన్ని అందించిన దాఖలా లేదు. అయితే, ఆ ప్రాంతంలో జరిగే ఏ చిన్న పరిణామాన్న యినా ఇరాన్‌తో ముడిపెట్టి చూడటం, షియా విస్తరణవాద తంత్రంగా భావించడం సౌదీ తదితర గల్ఫ్ దేశాలకు అలవాటైంది. ఇరాక్ నగరాలను చేజిక్కించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సాగుతున్న పోరాటానికి ఇరాన్ అండదండలి రవ్వడం... అటు అమెరికాతో అది అణు ఒప్పందం కుదుర్చుకునే దిశగా కదలడం గల్ఫ్ దేశాలను భయానికి గురిచేస్తున్నది. ఇప్పుడు యెమెన్ పరిణామాలతో ఈ ప్రాంతంలో ఇరాన్ పలుకుబడి పెరగడం ఖాయమని అవి అంచనా వేస్తున్నాయి. అందువల్లే యెమెన్‌లో హౌతీలను అణిచేమాటున, అధ్యక్షుడు హ దీని పునఃప్రతిష్టించే మాటున అవి ఇరాన్‌కు గుణపాఠం చెప్పాలనుకుంటున్నాయి. ఆ కారణంతోనే యెమెన్‌లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీసే దుస్సాహసం. యెమెన్‌లో భిన్న రూపాల్లో సాగుతున్న పోరాటాలన్నిటికీ అక్కడున్న సామాజిక, ఆర్థిక అసమానతలే ఆజ్యం పోస్తున్నాయి.
అవి తెగల ఘర్షణలుగా, వేర్పాటు ఉద్యమాలుగా, ఉగ్రవాద ఘటనలుగా వ్యక్తమవుతున్నా...వీటన్నిటి వెనకా ఈ అసమానతల ప్రభావం బలంగా ఉన్నది. నిజానికి ఉత్తర యెమెన్‌కు ఇచ్చే ఇంధన సబ్సిడీలకు కోతపెట్టబోతున్నట్టు నిరుడు ఆగస్టులో అధ్యక్షుడు హదీ ప్రకటించాకే హౌతీ తిరుగుబాటుదారుల విజృంభణ పెరిగింది. అది చివరకు ఉధృతమై అతని పదవీభ్రష్టత్వానికి దారితీసింది. సంపద పంపిణీలో, వనరుల వినియోగంలో సాగుతున్న వివక్షపై యెమెన్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. సౌదీ సౌజన్యంతో స్థానిక తెగల నాయకులను లోబర్చుకుని ఈ అసంతృప్తిని తుంచేద్దామని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాలుగేళ్లనాడు ఇతర గల్ఫ్ దేశాలతోపాటు యెమెన్‌లో కూడా ‘జాస్మిన్ విప్లవం’ వెల్లువెత్తింది.
ఆనాటి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్‌కు వ్యతిరేకంగా సాగిన ఆ ఉద్యమానికి మహిళలే నేతృత్వంవహించారు. ఇతర గల్ఫ్ దేశాలకు భిన్నంగా, ఉన్నతంగా సాగిన ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన తవక్కుల్ కర్మన్ 2011లో మరో ఇద్దరు ఆఫ్రికా మహిళలతోపాటు ఆ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ‘జాస్మిన్ విప్లవం’ విజయవంతం అయి ఉంటే యెమెన్‌లోనే కాదు...ఇతర గల్ఫ్ దేశాల్లో సైతం ప్రజాస్వామ్యం వేళ్లూనుకునేది.
ఉగ్రవాదం, మతోన్మాదం అదుపులోకి వచ్చేవి. పశ్చిమాసియాలో ప్రశాంతత నెలకొనేది. ఆనాడు ఆ పోరాటాల పీక నులమడంలో కీలకపాత్ర పోషించిన శక్తులే ఇప్పుడు యెమెన్‌లో రావణకాష్టాన్ని రగిలిస్తున్నాయి. శిథిల సీమగా మారిన ఇరాక్‌నూ, సర్వనాశమైన లిబియానూ, బావురుమంటున్న సిరియానూ చూశాకైనా ఈ శక్తులు తమ వెనకటి గుణాన్ని వదులుకోవడం లేదు. హౌతీ తిరుగుబాటుదార్లపై ఇప్పుడిప్పుడే వస్తున్న వ్యతిరేకతను ఈ వైమానిక దాడులు ఆవిరి చేశాయని...శత్రుపక్షాలు ఏకం కావడానికి దోహదపడ్డాయని కథనాలు వెలువడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలివంటి వేదికలను కాదని ఏకపక్షంగా... మొరటుగా సౌదీ కూటమి ప్రారంభించిన ఈ యుద్ధంవల్ల మరో దేశం అంతర్యుద్ధం ఊబిలో కూరుకుపోతుంది. ఉగ్రవాదానికి మరింత ఊతం లభించే ప్రమాదముంటుంది. సౌదీ కూటమి దేశాలు... వాటికి మద్దతుగా నిలుస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇప్పటికైనా తమ తప్పిదాన్ని గుర్తించాలి. ఈ నిరర్ధక యుద్ధానికి స్వస్తి చెప్పాలి.
నిరర్ధక యుద్ధం
Published Tue, Mar 31 2015 12:25 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement