జాతీయ అటవీ విధానం ముసాయిదాపై సలహాలు, సూచనలు చెప్పవచ్చునంటూ కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ విధించిన నెల రోజుల గడువు శనివారంతో ముగుస్తోంది. అనుకున్నట్టే పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, గిరిజన సంఘాల నేతలు ఆ విధానాన్ని తూర్పారబట్టారు. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాక అడవుల యాజమాన్యం, సంరక్షణ, అటవీ ఉత్ప త్తుల వినియోగం వంటి అంశాల్లో ఆదివాసీలకు వ్యక్తులుగా, సమూహంగా హక్కులు కల్పిస్తూ 2006లో సమగ్రమైన అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఉన్న కొన్ని లోటుపాట్లను సవరించాలని ఆదివాసీలు కోరుతుండగా, దాన్ని మరింత నీరుగార్చేలా తాజా ముసాయిదా ఉంది. పరిశ్రమలకూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకూ అడవుల్ని కొట్టేయవలసి వచ్చినప్పుడు అందుకు పరిహారంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న ప్రత్యేక నిధి రూ. 50,000 కోట్ల వరకూ పోగు బడింది. ఏటా దానికి రూ. 6,000 కోట్లు జమ అవుతుంటాయి. ఇలా సమకూరు తున్న నిధుల్ని ఏవిధంగా వినియోగించాలన్న అంశాన్ని తాజా ముసాయిదా నిర్దేశి స్తోంది.
నష్టపోయిన అటవీ ప్రాంతాన్ని భర్తీ చేసి పర్యావరణ సమతుల్యత కాపా డేందుకు మొక్కల్ని పెంచడం దీని ఉద్దేశం. అమలు సంగతెలా ఉన్నా అటవీ హక్కుల చట్టం స్థానిక వనరులపై ఆదివాసీలకుండే హక్కుల్ని గుర్తిస్తోంది. కార్పొరేట్ సంస్థ లకు అటవీ భూముల్ని అప్పగించినప్పుడు ఆదివాసీల, గ్రామ సభల అనుమతి అవసరమని నిర్దేశిస్తోంది. కానీ కోల్పోయిన అటవీ భూములకు బదులుగా చేపట్టే ప్లాంటేషన్‌కు ఏ భూములు ఉపయోగించాలన్న అంశంలో ఆదివాసీల అభిప్రాయా నికి విలువనివ్వాలని తాజా ముసాయిదా గుర్తించడం లేదు. అటవీ భూముల్ని కార్పొ రేట్లకు అప్పగించడంవల్ల జీవికను కోల్పోయే ఆదివాసీలు తాజా అటవీ విధానంతో ఆ ప్రాంతంలోనే ఉండటానికి అర్హతలేనివారుగా మారతారు. ప్లాంటేషన్ పేరిట వారు నివాసం ఉంటున్న ప్రాంతాలను ఖాళీ చేయించే ప్రమాదం ఈ ముసాయిదాలో పొంచి ఉంది. 2016లో పరిహారక అడవుల పెంపకం నిధి (సీఏఎఫ్‌ఏ) బిల్లును తీసు కొచ్చినప్పుడు ఆదివాసీల భూముల్ని ప్లాంటేషన్ల కోసం తీసుకోదల్చుకుంటే ముందుగా వారి ఆమోదం పొందాలన్న నిబంధన లేదని విపక్షాలు ఎత్తి చూపాయి. దాన్ని సరిచేయాలని కోరాయి. బిల్లులో పొందుపరచకపోయినా ఆ విధానాన్ని అను సరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చాక బిల్లుకు ఆమోదం లభించింది. కానీ ఆ అంశం ఊసే లేదు.
నిజానికి పేరుకు అటవీ హక్కుల చట్టం ఉన్నా అనేక రాష్ట్రాలు దాన్ని బేఖాతరు చేస్తున్నాయని, అభివృద్ధి పేరిట తమ ఇష్టానుసారం కార్పొరేట్ సంస్థలకు, ఆనకట్టల నిర్మాణానికి అటవీ భూముల్ని కేటాయిస్తున్నాయని ‘ల్యాండ్ కాన్‌ఫ్లిక్ట్ వాచ్’ అనే సంస్థ గణాంకాల సహితంగా వెల్లడించింది. అటవీ హక్కుల చట్టం ఉల్లంఘనలు, దాని అమలును పట్టించుకోకపోవడానికి సంబంధించి 118 కేసులను ఉదాహరిం చింది. ముఖ్యంగా 11 రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభిప్రాయాలనూ, గ్రామసభల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న 26 కేసుల్ని వివరించింది. అటవీ హక్కుల చట్టం దేశంలో 8 కోట్ల 56 లక్షల ఎకరాల అడవుల్లో ఉన్న వనరులపై లక్షా 70 వేల గ్రామాల్లోని 20 కోట్లమంది ఆదివాసీలకు హక్కులు కల్పించింది. ఇందులో వ్యక్తిగత పట్టాలున్నాయి, సామూహికంగా ఆదివాసీ లందరూ వినియోగించుకోవడానికి వీలుకల్పించే పట్టాలున్నాయి. కంచే చేను మేయ డం అన్నది అడవులు, ఆదివాసీల విషయంలో జరుగుతున్నంతగా మరెక్కడా జర గడం లేదు.
ఏదైనా కంపెనీకి అటవీ భూముల్ని కట్టబెట్టడానికి నిర్ణయించుకున్న ప్పుడు ఆ భూమిపై లోగడ తామే ఇచ్చిన పట్టాలను ఆదివాసీలనుంచి బలవంతంగా తీసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయని ఆ సంస్థ తెలిపింది. చిత్రమేమంటే మన దేశంలో ఏ చట్టంలోనూ ‘అడవి’కి సమగ్రమైన నిర్వచనం లేదు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడి, జీవవైవిధ్యతతో నిండి ఉండే అడవుల్లో ఎన్నో రకాల వృక్షజాతులుం టాయి. వన్యప్రాణులుంటాయి. అపారమైన వనరులుంటాయి. పర్యావరణ సమతు ల్యతలో అడవుల పాత్ర కీలకమైనది. ఇలాంటి అపురూపమైన అడవుల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ అందుకు పరిహారంగా అటవీశాఖ పెంచే ప్లాంటేషన్లు ఎలాం టివి? ఒకే రకమైన మొక్కల్ని వాణిజ్య అవసరాల కోసం పెంచడం వల్ల అందులో జీవవైవిధ్యత ఉండదు. కనుక పర్యావరణ సమతుల్యత సాధ్యపడదు. అడవుల్లో ఉంటూ, అక్కడి క్రూర మృగాలతో సావాసం చేసే ఆదివాసీలు ఆ రెండింటి సంరక్ష ణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ముసాయిదా రూపకర్తలకు అందుకు సంబంధించిన అవగాహనే కొరవడినట్టు కనిపిస్తోంది. అభివృద్ధి కోసం అటవీ భూముల్ని ఇవ్వక తప్ప దనుకున్నా దానిలోనూ శాస్త్రీయ దృక్పథం ఉండాలన్నది పర్యావరణవాదుల వాదన. నిర్దిష్ట ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడే వివిధ పరిశ్రమలకు అనుమతినివ్వడం కాక, ఎక్కడబడితే అక్కడ కేటాయింపులు చేయడంవల్ల అడవి ఖండఖండాలవు తోంది. ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అడవుల విధ్వంసం ఆదివాసీల జీవితాల్లో పెను తుఫాను రేపుతోంది. వారిలో అశాంతిని రేకెత్తిస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో భూసేకరణ కోసం కార్పొరేట్లు, ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు అటవీ హక్కుల చట్టం కింద ఆదివాసీలు వాటిని అడ్డుకున్నారు. నియమగిరి పర్వతప్రాం తంలో వేదాంత సంస్థకు బాక్సైట్ తవ్వకాల కోసం అటవీభూములివ్వాలనుకున్న ప్పుడు 10 గ్రామసభలు అందుకు నిరాకరించాయి. అడవులపై ఆదివాసీలకు గల హక్కులు రాజ్యాంగదత్తమైనవి. ఆ రాజ్యాంగాన్ని గుర్తించి, గౌరవించి మా బతుకు మమ్మల్ని బతకనీయండని ఆదివాసీలు కోరుకుంటున్నారు. పర్యావరణవేత్తలతో, సామాజిక ఉద్యమకారులతో చర్చించి అటవీ విధానం ముసాయిదాను కేంద్రం సవ రించుకోవాలి. కొత్తగా అమలు చేయదల్చుకున్న ఏ చట్టమైనా, విధానమైనా ఆదివాసీల హక్కులను హరించేలా, వారి జీవనాన్ని భంగపరిచేలా ఉండకూడదని పాల కులు గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment