సిరియా కుంపటి
సిరియాలో మొదలెట్టిన చదరంగంలో చిక్కుకుని ఏంచేయాలో దిక్కుతోచక అమెరికా విలవిల్లాడుతున్న తరుణంలో రష్యా రంగ ప్రవేశం చేయడం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందోనని పలువురు నిపుణులు వ్యక్తం చేసిన భయాందోళనలు నిజమయ్యాయి. సిరియా భూభాగంలో పాగా వేసిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర వాదులపై దాడులు జరపడానికి వెళ్తున్న రష్యా విమానాన్ని మంగళవారం టర్కీ సైన్యం క్షిపణి ప్రయోగించి కూల్చేసింది.
ఈ విమానాన్ని క్షిపణి ఢీకొనడం... అది భగ్గునమండి నేలకొరుగుతుండటం...అందులోనుంచి ఇద్దరు పెలైట్లు ప్యారాచూట్ల సాయంతో కిందకు దిగుతుండటం ప్రపంచమంతా టీవీ చానెళ్లలో వీక్షించింది. ఉగ్రవాద దాడులైనా, దేశాలమధ్య ఘర్షణలైనా, యుద్ధమైనా...ఇప్పుడేదీ రహస్యం కాదు. టర్కీ దాడి అనంతరం ప్యారాచూట్లతో దిగిన ఇద్దరు పెలైట్లలో ఒకరిని సిరియా దళాలు కాపాడగలిగాయి. మరొకరు నేలకు దిగేలోపునే మరణించారా లేక టర్కీ అనుకూల తిరుగుబాటుదార్లు అతన్ని కావాలని మట్టుబెట్టారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
సిరియా అధినేత బషర్ అల్ అసద్‌ను పదవినుంచి దించాలన్న ఏకైక లక్ష్యంతో అక్కడి తిరుగుబాటుదార్లకు విచక్షణారహితంగా ఆయుధాలు, డబ్బు అందించిన పర్యవసానంగానే ఐఎస్ సంస్థ పుట్టి పెరిగిందన్నది వాస్తవం. ఆదిలో ఎవరెంత చెప్పినా వినని అమెరికా చివరకు తన తప్పిదాన్ని తెలుసుకున్నా అప్పటికే ఆలస్య మైపోయింది.వృశ్చిక సంతానంలా ఐఎస్ ఉగ్రవాదులు అమెరికాపైనే గురిపెట్టారు. తమకు చిక్కిన అమెరికా, బ్రిటన్ బందీలను వరసబెట్టి హతమార్చి సవాళ్లు విసి రారు. దాంతో నాటో కూటమి దేశాల సాయంతో ఐఎస్ ఉగ్రవాదులపై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తున్నట్టు నిరుడు సెప్టెంబర్‌లో అమెరికా ప్రకటిం చింది. చివరి కది అయ్యేది కాదని గ్రహించి తన బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్ తోనూ, సిరియా అధినేత అసద్‌తోనూ చేతులు కలపడానికి అది సిద్ధపడింది. ఈలోగా లక్షలాది మంది పౌరులు యూరప్ దేశాలకు శరణార్థులుగా వలసపో వలసి వచ్చింది.
అసద్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు మూడు శక్తులు పోరాడుతున్నాయి. అందులో ఒకటి నేరుగా అమెరికా, దాని కూటమి దేశాలుకాగా...మరొకటి అమెరికా ఆశీస్సు లున్న తిరుగుబాటుదార్ల బృందం, ఇంకొకటి ఐఎస్ ఉగ్రవాద తండా. ఇందులో ఐఎస్‌కు అటు అసద్‌తోపాటు ఇటు అమెరికా కూడా శత్రువే. అసద్‌పై పీకలదాకా కోపం ఉన్న పొరుగు దేశం టర్కీ...ఒకపక్క నాటో కూటమిలో సభ్య దేశంగా ఉంటూనే, అమెరికా సిరియాపై సాగిస్తున్న యుద్ధానికి సహకరిస్తూనే పరోక్షంగా ఐఎస్‌కు సాయపడుతోంది. ఇలా ఇప్పటికే అత్యంత సంక్లిష్టంగా మారిన సిరియా సంకుల సమరంలోకి రష్యా అడుగుపెట్టింది. ఐఎస్‌ను అంతమొందించడమే తన లక్ష్యమని అది ప్రకటించినా తన చిరకాల మిత్రుడు అసద్‌కు బాసటగానే ఇందు లోకి దిగిందని అమెరికాతోసహా అందరికీ తెలుసు. సహజంగానే రష్యా అసద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదార్ల స్థావరాలపై నిప్పులు కురిపించింది. దాంతోపాటు ఐఎస్ ఉగ్రవాద స్థావరాలను కూడా ధ్వంసం చేస్తున్నది. ఇలాంటి సమయంలో ‘ఉగ్రవాదాన్ని మట్టుబెడదాం రమ్మ’ని రష్యా ఇచ్చిన పిలుపును కాదన డమెలాగో తెలియక అమెరికా గందరగోళంలో పడింది.
‘ఐఎస్ జోలికెళ్తే మీ దేశా నికీ, మీ పౌరులకూ ప్రమాదం సుమా’ అని హెచ్చరించింది. వాళ్లు చెప్పినట్టే ఐఎస్ ఉగ్రవాదులు 224మందితో వెళ్తున్న రష్యా విమానాన్ని ఈజిప్టు సమీపంలో కూల్చి తమ కక్ష తీర్చుకున్నారు. అయితే పారిస్ దాడుల తర్వాత పరిస్థితి మారింది. అన్ని దేశాలూ కలిసి ఐఎస్‌ను తుడిచిపెడితే తప్ప గత్యంతరంలేదన్న గ్రహింపు ఏర్ప డింది. అసద్ సంగతి తర్వాత చూసుకుందామని అయిష్టంగానైనా అమెరికా భావిం చింది. ఇదే టర్కీకి నచ్చలేదు. రష్యా రాక వల్ల తన ప్రయోజనాలు దెబ్బతింటున్నా యని గుర్తించిన ఆ దేశం అదును కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తన గగన తలాన్ని అతిక్రమించిందన్న కారణాన్ని చూపి రష్యా యుద్ధ విమానాన్ని కూల్చింది. అయితే ఈ చర్య వెనక అమెరికా పోద్బలం ఉండొచ్చునని కూడా కొందరు భావిస్తున్నారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్ మధ్యవర్తిత్వం వహించకపోతే, ఈ ఉదంతం ఊహించని పరిణామాలకు దారి తీసేదే. టర్కీపై రష్యా యుద్ధం ప్రకటిస్తే... టర్కీకి బాసటగా అమెరికా నిలిస్తే...ఆ ఇద్దరికీ మద్దతుగా నాటో రంగ ప్రవేశం చేస్తే అది మూడో ప్రపంచయుద్ధానికి దారి తీసేదని కొందరు నిపుణులు చేస్తున్న ఊహాగానాలు ఎంతవరకూ నిజమయ్యేవోగానీ...ఐఎస్ ఉగ్రవాదులు మాత్రం ఖాయంగా మరింత బలపడేవారు. ఈ యాభై ఏళ్లలో నాటో కూటమి దేశంతో రష్యా తలపడవలసి రావడం ఇదే ప్రథమం.
మెర్కెల్ మధ్యవర్తిత్వంతో అటు టర్కీ తన చర్య సరికాదని అంగీకరించింది. ఇటు రష్యా మెత్తబడినట్టు కన బడింది. అయినా ఇదే అదునుగా రష్యా తన అధునాతన క్షిపణి విధ్వంసక వ్యవస్థను సిరియాకు తరలించింది. దాని యుద్ధ విమానాలు టర్కీ సరిహద్దు సమీ పంలో అసద్ వ్యతిరేక తిరుగుబాటుదార్ల కోసం నిలిపి ఉంచిన ట్రక్కులను ధ్వంసం చేశాయి. మొత్తానికి సిరియా భూభాగంపై పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న పలు శక్తులు ఒకరితో ఒకరు విభేదించుకుంటూ...కలిసి ఉన్నట్టు నటిస్తూ సాగిస్తున్న బాంబులాట ఏ క్షణంలోనైనా చేయి దాటిపోయే ప్రమాదం ఉంది.
యుద్ధంలో ముందుగా కుప్పకూలేది సత్యమే గనుక ఎవరిది తప్పో...ఎవరిది ఒప్పో చెప్పే స్థితి ఆ తర్వాత ఉండదు. ఈ సంకుల సమరంలో సాధారణ పౌరులు ఇప్పటికే బలి పశు వులయ్యారు. రాగలకాలంలో ఆ సంఖ్య మరింతగా విస్తరిస్తుంది. ఈ ఘర్షణలు చివరకు ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల అగ్రరా జ్యాలు బాధ్యతగా మెలగాలి. ఐఎస్ ఉగ్రవాదులపైన అయినా, మరొకరిపైన అయినా ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల మార్గదర్శకత్వంలో, పర్యవేక్షణలో మాత్రమే చర్యలు తీసుకోవాలి.