సిరియాపై క్షిపణుల వర్షం | U.S., Britain and France Strike Syria Over Suspected Chemical Weapons Attack | Sakshi
Sakshi News home page

సిరియాపై క్షిపణుల వర్షం

Published Sun, Apr 15 2018 3:16 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

U.S., Britain and France Strike Syria Over Suspected Chemical Weapons Attack - Sakshi

డమాస్కస్‌ వైపు దూసుకెళ్తున్న అమెరికా క్షిపణి, సిరియాపై దాడికి బయల్దేరిన ఫ్రాన్స్‌ యుద్ధవిమానం

వాషింగ్టన్‌: అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న సిరియాలో బాంబులమోత మోగింది. మొన్నటి వరకూ రసాయనిక ఆయుధాలతో రష్యా, సిరియా అధ్యక్షుడు అసద్‌ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలు వందలాది అమాయకులు, చిన్నారుల్ని పొట్టనపెట్టుకుంటే ఈ సారి అమెరికా సంకీర్ణ బలగాలు వైమానిక దాడులకు దిగాయి. సిరియా రాజధాని డమాస్కస్‌పై సంకీర్ణ దళాలు క్షిపణుల మోత మోగించాయి. రసాయనిక దాడులకు ప్రతీకారంగా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నంత పనీ చేశారు.  

గట్టి జవాబిచ్చేందుకే: ట్రంప్‌
అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు సంయుక్తంగా జరిపిన ఈ వైమానిక దాడుల్ని సిరియా బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. అమెరికా, దాని మిత్రదేశాలు 100కి పైగా క్షిపణుల్ని ప్రయోగించాయని, వాటిలో కొన్నింటిని సిరియా వైమానిక బలగాలు తిప్పికొట్టాయని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిరియా సైనిక కేంద్రాలు, సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేశారని వెల్లడించింది. ‘గురితప్పకుండా దాడులు చేశాం. మిషన్‌ పరిపూర్ణమైంది’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. రసాయనిక ఆయుధాల తయారీ, వాడకంపై గట్టి సమాధానమిచ్చేందుకే ఈ దాడులు జరిపామన్నారు.   ఫ్రాన్స్, బ్రిటన్‌తో కలిసి దాడులు చేస్తామని శుక్రవారం రాత్రి ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

డమాస్కస్‌పై తొమహక్‌ క్షిపణుల వర్షం
మధ్యధరా సముద్రం మీదుగా యుద్ధనౌకల నుంచి తొమహక్‌ క్రూయిజ్‌ క్షిపణులు, బీ–1 బాంబర్‌ విమానాలతో జేఏఎస్‌ఎస్‌ఎం–ఈఆర్‌ క్షిపణుల్ని  ప్రయోగించినట్లు పెంటగాన్‌(అమెరికా) వర్గాలు పేర్కొన్నాయి. పెంటగాన్‌ ప్రతినిధి స్పందిస్తూ.. ‘క్షిపణులు లక్ష్యాల్ని ఛేదించాయి. రసాయనిక ఆయుధాల తయారీ ప్రాంతాలపై దాడులు చేశాం’ అని చెప్పారు. తూర్పు డమాస్కస్‌లోని రసాయన ఆయుధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలపై ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ దాడులు సిరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడం లేదా అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నవేనని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే చెప్పారు. ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. మరోసారి రసాయనిక ఆయుధాలు వాడితే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు.  

భద్రతా మండలి అత్యవసర భేటీ
సంకీర్ణ బలగాల దాడిని సిరియా మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్‌లు సైనిక నేరంగా, దుందుడుకు చర్యగా అభివర్ణించాయి. ‘దాడులకు ప్రతీకారంగా పర్యవసనాలు తప్పకుండా ఉంటాయి.’ అని రష్యా హెచ్చరించింది. కాగా రష్యా విజ్ఞప్తి మేరకు ఐరాస భద్రతా మండలి శనివారం అత్యవసరంగా సమావేశమైంది.

13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం
తమ శాస్త్ర పరిశోధన కేంద్రంపై దాడి చేశారని, సిరియా వైమానిక బలగాలు 13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాయని, ముగ్గురే గాయపడ్డారని సిరియా ప్రభుత్వ టెలివిజన్‌ తెలిపింది. దాడులు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమేనంది. క్షిపణుల మోత ఆగగానే డమాస్కస్‌ వీధుల్లో విజయ సంకేతాల్ని చూపుతూ జెండాలతో వందలాది మంది సందడి చేశారు. ఈ దాడులు పోరాటం కొనసాగించాలన్న సిరియా ప్రజల సంకల్పాన్ని దృఢం చేశాయని, దేశంలోని ఉగ్రవాదుల్ని అణచివేస్తామని సిరియా అధ్యక్షుడు అసద్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement