తప్పుల నుంచి గుణపాఠాలను నేర్చుకోవడంలో, సరిద్దుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శించే వారెవరైనా అందుకు మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఆదివారం తెల్లవారుజామున యూరి సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడే అందుకు సాక్ష్యం. ఈ జనవరిలో పఠాన్‌కోట వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్రదాడి మన భద్రతా వ్యవస్థకే సవాలును విసిరింది. యావద్భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ చేదు అనుభవం తర్వాతైనా మన భద్రతా వ్యవస్థను పటిష్టం చేస్తారని, మన సైనిక స్థావరాల రక్షణకు ప్రాధాన్యాన్నిస్తారని ఆశించాం. అన్నిటికి మించి పాకిస్థాన్‌లో సురక్షిత స్థావరాలను ఏర్పరచుకున్న భారత వ్యతిరేక ఉగ్రమూకలు యథేచ్ఛగా దేశంలోకి చొరబడకుండా పటిష్ట చర్యలు చేపడతారని అనుకున్నాం.
అది అత్యాశేనని, చేసిన తప్పులనే తిరిగి తిరిగి చేస్తూ ఉగ్రవాద దాడులకు దారులను తెరిచి ఉంచే అలస త్వమనే జాడ్యం మన పాలక వ్యవస్థను ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నదని యూరి దాడి తేటతెల్లం చేసింది. ఉగ్రవాదులు భారత సైనికుల దుస్తుల్లో వచ్చారని, తెల్లవారు జాము చీకటిమాటున దాడి చేశారని, స్థావరంలోని తాత్కాలిక గుడారాలలో సైని కులు నిద్రిస్తుండగా దాడి జరగడం వల్లనే ఇంత పెద్ద నష్టం జరిగిందని, ఒక రెజి మెంటు స్థానంలో మరో రెజిమెంటు బాధ్యతలను స్వీకరించడం కోసం వచ్చిన సమయం చూసి ఉగ్రవాదులు దాడి చేశారని వినిపిస్తున్న సంజాయిషీలు ఏవీ మన పాలక వ్యవస్థ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చలేవు.
పైగా దాడికి వారానికి ముందే సరిహద్దులలోని మన సైనిక స్థావరాలపై భారీ ఉగ్ర దాడి జరుగుతుందని ఇంటె లిజెన్స్ సమాచారం ఉన్నదని కూడా వినవ స్తోంది. సుదీర్ఘమైన సరిహద్దులోని ఏ మారుమూల నుంచో ఉగ్రవాదులు చొరబడకుండా చూడటం కష్టమంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అది ఆధీనరేఖకు కూతవేటు దూరంలో 15 నుంచి 16 వేల మంది సైనికులుండే పెద్ద స్థావరం.
శత్రువు దాని దరిదాపులకు చేరడమే అసాధ్య మయ్యే రక్షణ ఏర్పాట్లు ఉండటం ఆవశ్యకం. అలాంటిది నిరాటంకంగా ఉగ్రవా దులు ఆ స్థావరాన్ని చేరుకోవడమే కాదు, సునాయాసంగా ఫెన్సింగ్‌ను కత్తిరించి చొరబడిపోగలగడం మన భద్రతా వ్యవస్థ భద్రతపైనే అనుమానాలను రేకెత్తిం చదా? పాక్ ఆధారిత ఉగ్రవాదం మన సైనిక స్థావరాలపైకి ఎక్కుపెడుతున్న దాడుల ముఖ్య లక్ష్యాలలో ఒకటి అదే కాదా?
ఈ దురాగతానికి పాల్పడ్డ ఉగ్రమూకలు భారీ మూల్యం చెల్లించక తప్పదని, పాక్‌ను ఏకాకిని చేసే వ్యూహాలను రచిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న ప్రకటనలు పఠాన్‌కోట దాడి తదుపరి ప్రతిస్పందనల ప్రతిధ్వనులే తప్ప భరోసాను కల్పించేవి కావు. పలువురు బీజేపీ నేతలు, మీడియా విశ్లేషకుల ధోరణి తక్షణమే ప్రతీకార దాడులకు పాల్పడటమో, ఏదో ఒక స్థాయి సైనిక చర్యను చేప ట్టడమో ‘ఏదో ఒకటి చేసి తీరాలి’ అనేదిగా ఉంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఏ అర్థంలోనోగానీ.. యూరి భారత్, పాక్‌ల మధ్య యుద్ధం వంటి వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు.
పాక్, అక్కడి నుంచి పనిచేస్తున్న భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు కోరుకుంటున్నది సరిగ్గా అదే. నవాజ్ షరీఫ్ నేతృత్వం లోని పాక్ రాజకీయ అధికార వ్యవస్థ, ఐఎస్‌ఐ అధికారులు, సైనికాధికారులతో కూడిన శక్తివంతమైన రాజ్యాంగేతర అధికార వ్యవస్థ ఇటీవల గొప్ప సఖ్యతను ప్రద ర్శిస్తున్నాయి. ప్రత్యేకించి జూలై 8న ిహ జ్బుల్ ముజాహిదిన్ కమాండర్ బుర్హన్ వని ఎదురు కాల్పులలో హతమైన తదుపరి క శ్మీర్ లోయలో నెలకొన్న అశాంతిని అవ కాశంగా మలుచుకుని కశ్మీరీ ప్రజలకు మిగతా దేశానికి మధ్య అగాధాన్ని సృష్టిం చాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే పాక్ నుంచి పనిచేసే జైషే మొమమ్మద్ సాగిం చిన పఠాన్‌కోట దాడిని కశ్మీర్ మిలిటెంట్ల చర్యగా చిత్రీకరించే యత్నం చేశారు. యూరి దాడికి పాల్పడినది ఎవరో ఇంకా తేలకపోయినా ఐఎస్‌ఐ ముద్ర మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
ఈ నెల చివర్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తి, దాన్ని అంతర్జాతీయం చేయగలననే భ్రమల్లో పాక్ ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం, ప్రత్యేకించి ఆ పార్టీ నేతలు సైతం ఇదే ఉష్ట్రపక్షి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుండటం విచారకరం. పాక్‌ను ఏకాకిని చేసేస్తామని ప్రభుత్వం అంటుంటే, ఇప్పటికే ఏకాకిని చేసేశామనే వరకు బీజేపి నేతలు పోతున్నారు. కశ్మీర్ సమస్యను మొత్తంగా పాక్ సృష్టిగా కొట్టిపారేస్తూ వీధుల్లో రాళ్లు రువ్వే కశ్మీరీ యువతతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ‘ఏదో ఒకటి చేసి తీరాలి’ అనే ఒత్తిడికి లోనైతే కశ్మీరీ యువత పట్ల మరింత కఠిన చర్యలకు, సైనిక బలప్రయోగానికి పూనుకునే ప్రమాదం ఉంది. అదే జరిగితే పాక్ పన్నిన ఉచ్చులోకి నేరుగా నడవడమే అవుతుంది.
యూరి ఘటనపై ఆవేశపూరిత, అనాలో చిత ప్రతీకార ప్రకటనల సంగతెలా ఉన్నా.. ఆచరణకు సంబంధించి ఆచితూచి అడుగువేయడం, పాక్ పట్ల, సీమాంతర ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరిని చూపడానికి తగ్గ అంతర్గత సంసిద్ధతకు కృషి చేయడం అవసరం. అది విస్మరించి, పోయేదేమీ లేదనే తెంపరితనాన్ని చూపే పాక్‌పైకి కాలుదువ్వడం ఆర్థికవృద్ధి పథంలో తడ బడుతూ నిలదొక్కుకుంటున్న భారత్‌ను ప్రతికూల పరిస్థితులలోకి నెట్టేస్తుంది. పైగా కశ్మీర్‌ను భారత్‌లోని అవిభాజ్యమైన అంతర్భాగంగా చూడటమంటే అక్కడి ప్రజల మానసిక స్థితిని, వారి సంవేదనలను, భావోద్వేగాలను పంచుకోవడం కూడా అని గుర్తించడం అవసరం.
పాక్ సాగిస్తున్న ఈ ముసుగు యుద్ధంలో మన విజయానికి హామీ కశ్మీరీ ప్రజల హృదయాలను గెలుచుకోవడమేనని అర్థం చేసుకో వడం ఆవశ్యకం. పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇంత వరకు చేసిందేమైనా ఉంటే కశ్మీరీ హృదయాలను మరింత గాయపరచడమే. మరిన్ని పఠాన్‌కోటలు, యూరిలు జరగకుండా నివారించుకోగలగడం ఎలాగనే విషయంపై దృష్టిని కేంద్రీకరించడం తక్షణ ఆవశ్యకత. కాగా, కశ్మీర్ సమస్యకు సామరస్యపూర్వక, శాంతియుత పరి ష్కారం కోసం ఓపికగా కృషి చేయడం, పాక్ పట్ల నిలకడలేని తత్కాలీన, ఆవేశ పూరిత విధానాల స్థానే దీర్ఘకాలికమైన, ఆచరణాత్మకమైన, నిలకడతో కూడిన ఆలోచనాయుత విధానాన్ని రూపొందించుకోవడం అవసరం.
మరో ‘పఠాన్‌కోట’
Published Tue, Sep 20 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement
Advertisement