ముంబై: బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరపాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ప్రయత్నించాలని కోరారు.
ఫరూక్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి అని,ఆయన తన జీవితాన్ని కశ్మీర్ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఆయన నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని, అలాంటి వ్యక్తి చేసిన ప్రకటనను కేంద్రం, ప్రత్యేకంగా హోంమంత్రిత్వశాఖ సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేయాలన్నారు.
కాగా శనివారం ఉదయం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. బుద్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నవారే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. అంతేగాక ఉగ్రవాదులను చంపకుండా, ప్రాణాలతో పట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సజీవంగా బంధించి విచారిస్తే.. వారి వెనక ఉన్న వారు ఎవరో తెలుసుకోవచ్చని చెప్పారు. ఉగ్రమూకల వ్యూహాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో శుక్రవారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతరులపై కాల్పులు జరిపారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు నేడు అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో ఇలాంటి ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment