
ఇంటర్నెట్ సేవల్ని అందించే విషయంలో ఈమధ్య బయల్దేరిన వింత పోకడలకు వ్యతిరేకంగా టెలికాం నియంత్రణా వ్యవస్థ ట్రాయ్ వెలువరించిన తాజా సిఫా ర్సులు సర్వ స్వతంత్రమైన, పారదర్శకమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఉండాలని కోరు కునేవారికి ఊరటనిస్తాయి. ఇంటర్నెట్‌లో ప్రవహించే సమాచారానికి లాభాపేక్షతో అంతరాల దొంతరలు కల్పించడం, అధిక మొత్తం చెల్లించడానికి సిద్ధపడే వెబ్‌సైట్ల విషయంలో ఒకలా, అలా చెల్లించనివారితో మరొక రీతిలో వ్యవహరించడానికి అనేక సంస్థలు సిద్ధపడిపోయాయి. ఈ అంశాలను పరిశీలించేందుకు టెలికాం విభాగం నియమించిన నిపుణుల కమిటీ రెండేళ్లక్రితం ఇచ్చిన నివేదిక ఇంటర్నెట్ తటస్థతను సమర్ధిస్తున్నట్టు కనబడుతూనే అందుకు విరుద్ధమైన సూచనలు చేసింది. చివరకు ఈ సూచనల్నే ట్రాయ్ కూడా నెత్తిన పెట్టుకుంటుందని అందరూ ఆందోళన పడ్డారు. అయితే అది ఎన్నో ప్రగతిశీలమైన సూచనలు చేసి తన ఓటు ఇంటర్నెట్ తటస్థతకూ, పారదర్శకతకేనని స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌పై ఎవరి గుత్తాధిపత్యాన్నీ అంగీకరించబోమని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సైతం ఇప్పటికే చెప్పి ఉన్నారు గనుక ట్రాయ్ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర సులభంగానే పడుతుందని భావించవచ్చు.
ఇంటర్నెట్ పుట్టిల్లు అమెరికా దాని తటస్థత విషయంలో వెనక చూపులు చూస్తున్న తరుణంలో ఆ దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటికీ ట్రాయ్ సిఫార్సులు మార్గదర్శకంగా నిలుస్తాయి. అమెరికా ఫెడరల్ కమ్యూ నికేషన్ల కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ ఈమధ్య చేసిన ప్రతిపాదనలు అత్యంత ప్రమాదకరమైనవి. అవి అమలైతే రెండేళ్లక్రితం ఒబామా హయాంలో స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ వ్యవస్థకు అనువుగా రూ పొందిన విధానాలు కనుమరుగవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పు డమలవుతున్న విధానంలో కొంత రుసుము చెల్లించి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన డేటాను, తాము వ ¬ఖ్యమనుకున్న డేటాను చూసుకునే వీలుంది. ఆయా వెబ్‌సైట్లు అనుమతించిన మేరకు డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అందుకు విరుద్ధంగా అజిత్‌పాయ్ చేసిన ప్రతిపాదనలవల్ల అధిక మొత్తం చెల్లించినవారి వెబ్‌సైట్లు పెనువేగంతో తెరుచుకునేలా, అలా చెల్లించని వెబ్‌సైట్‌లు మాత్రం వినియోగదారుల సహనాన్ని పరీక్షించేవిధంగా ఎంతో సమయం తీసుకునేలా చేయడం సర్వీస్ ప్రొవైడర్లకు సులభమవుతుంది. వివిధ వెబ్‌సైట్ల నుంచి అవి ఉపయోగించుకునే బ్యాండ్‌విడ్త్ ఆధారంగా చార్జీలు వసూలు చేయాలని గతంలో ఎయిర్‌టెల్,ఫేస్‌బుక్ లాంటి సంస్థలు ప్రతిపాదిం చాయి.
వినియోగదారులకు కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు ఉచితంగా అందిస్తామనే పేరిట గ్రూపులు కట్టి అందులో చేరే సంస్థల నుంచి రుసుము వసూలు చేయాలని ఎత్తులేశాయి. అలాంటి ప్రతిపాదనలకు అనుమతిస్తే అధిక బ్యాండ్ విడ్త్‌ను ఉప యోగించుకునే యూట్యూట్, నెట్‌ఫ్లిక్స్ వంటి వెబ్‌సైట్లు అధిక మొత్తం చెల్లిం చాల్సివస్తుంది. చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతుంది. ఇలా వివక్ష ప్రదర్శించడం చెల్లదని ట్రాయ్ సిఫార్సులు చెబుతున్నాయి. ఈ తరహా పోకడలకు పోకుండా సర్వీస్ ప్రొవైడర్ల లైసెన్స్ నిబంధనలను మార్చాలని అవి సూచి స్తున్నాయి. ఈ వివక్షపై నిఘా పెట్టి నిబంధనలు ఉల్లంఘించినవారిపై విచారణ జరిపేందుకు, అవసరమైన చర్యలు తీసుకునేందుకు టెలికాం విభాగం బహుళపక్ష మండలి ఏర్పాటు చేయాలని కూడా ట్రాయ్ ప్రతిపాదించింది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిశీలించి, తగిన పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ తరహా మండలి తప్పనిసరి. పారదర్శకత అమలు చేయడమన్నది మరో కీలకాంశం. టెలికాం ఆపరేటర్లు వేర్వేరు వెబ్ సంస్థలతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పం దాలను బహిర్గతపర్చాలని, వెబ్ ట్రాఫిక్ విషయంలో తాము అనుసరిస్తున్న విధా నాలేమిటో వినియోగదారులకు స్పష్టం చేయాలని ట్రాయ్ చేసిన సిఫార్సు సైతం స్వాగతించదగింది.
ఇంటర్నెట్ అమల్లోకొచ్చాక ప్రపంచంలో ఏమూల నుంచి ఏ మూలకైనా సమాచారాన్ని చేరేయడం అత్యంత సులభమైంది. వినూత్న ఆవిష్కరణలకూ, విలక్షణమైన ధోరణులకూ ఇంటర్నెట్ వేదికగా నిలుస్తోంది. సమర్ధత కలిగి ఉంటే బడా బ్రాండ్లను ఛోటా సంస్థలు సైతం గడగడలాడించగలవని ఇంటర్నెట్ నిరూపించింది. భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత పదును తేలాయి. ఇలాంటి సమయంలో లాభాపేక్ష ముసుగులో కొన్ని వెబ్‌సైట్లకు పెద్దపీట వేసి, ఇతర వెబ్‌సైట్లను అందుబాటులోకి రాకుండా చేయడం వల్ల పౌరులకు ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే సంస్థల మధ్య పోటీ బయల్దేరి పరస్పర హననం మొదలవుతుంది. పెద్ద సంస్థలు చిన్న సంస్థల మనుగడను దెబ్బతీస్తాయి.
వివక్షాపూరిత విధానాలు అంతిమంగా ఇంటర్నెట్ వినియోగదారులకు శాప మవుతాయి. వారు తమకు అవసరమైనవి కాక, టెలికాం సంస్థలకు లాభాల్ని తెచ్చిపెట్టే వెబ్‌సైట్లను మాత్రమే చూసే అవకాశం ఏర్పడుతుంది. అయితే అత్యంతాధునికం అనదగ్గ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇంటర్నెట్‌తో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుసంధానించి అందించే సేవలు–టెలీ సర్జరీ, డ్రైవర్ రహిత వాహనాలు వగైరా) కిందకు ఏమేం వస్తాయో పరిశీలించి, వాటికి ఎలాంటి విధా నాలు అవసరమో నిర్ణయించుకునే స్వేచ్ఛను టెలికాం విభాగా నికే వదలాలని ట్రాయ్ సిఫార్సుచేసింది.
ఇంటర్నెట్ తటస్థత విషయంలో గత రెండేళ్లుగా నెటిజన్లలో ఎంతో ఆందోళన నెలకొంది. వాటిని పరిగణనలోకి తీసుకుని ట్రాయ్ సహేతుకమైన సిఫార్సులు చేసింది. అయితే నెటిజన్లు ఇంతమాత్రాన విశ్రమించకూడదు. అమెరికా అనుసరించబోయే విధానాలు కొంచెం ముందు వెనుకలుగా ప్రపంచ దేశాలన్నిటినీ భవిష్యత్తులో ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల స్వేచ్ఛాయుత, పారదర్శక, తటస్థ ఇంటర్నెట్ వ్యవస్థను పరిరక్షించుకోవడానికి నెటిజన్లు పోరాడక తప్పదు.