ఒకపక్క వివిధ రాష్ట్రాల్లో జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్‌సీఆర్)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లు వెత్తుతుండగా మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) ప్రక్రియ అమలు ప్రతిపాదనను ఆమోదించింది. ఇందుకోసం రూ. 3,941 కోట్లు కేటా యించింది. ఎన్‌సీఆర్ వ్యతిరేక ఆందోళనల నేపథ్యం కావొచ్చు... కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను ప్రక టిస్తూ ఎన్‌పీఆర్‌కూ, ఎన్‌ఆర్‌సీకీ సంబంధం ఉండబోదని కేంద్ర మంత్రులు ప్రకాష్ జావ్డేకర్, పీయూష్ గోయెల్ తెలిపారు. విధాన నిర్ణయాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఎన్‌పీఆర్ అమలు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన కూడా ఎన్‌పీఆర్–ఎన్‌ఆర్‌సీల మధ్య ఏ సంబంధమూ ఉండబోదని హామీ ఇచ్చారు. ఎన్‌పీఆర్‌కు సంబంధించిన సమాచార సేకరణ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగుస్తుంది. తొలిసారి దీన్ని 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2015లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అమలు చేసి ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ ఎన్‌పీఆర్‌ను నవీకరించింది. ఎన్‌పీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక 2021లో జనాభా గణన ఉంటుంది. అదే సమయంలో ఆ ఎన్‌పీఆర్ డేటాను నవీకరిస్తారు.
భిన్న అవసరాల కోసం ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన డేటా సేకరించడం ఎప్పటినుంచో రివాజుగా వస్తోంది. చరిత్ర తిరగేస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతక్రితం మాటెలా ఉన్నా మన దేశంలో మౌర్యుల కాలంలో జనగణన జరిగిందని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతోంది. అప్పట్లో ఈ జనగణన జరపడానికి కారణం పన్నుల వసూలు విధానాన్ని పటిష్టపరచడమే. బ్రిటిష్ వలస పాలకులు తొలిసారి 1872లో జనగణన నిర్వహించారు. తొలి జనగణనగా దాన్నే పరిగణిస్తున్నారు. 2021లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ ఆ ప్రకారం 16వ జనగణన అవుతుంది. ఈ జనగణన మాట అలావుంచి దేశంలో ఉండే పౌరులు, ఇతర నివాసుల వివరాలు ఆధారాలతోసహా సేకరించి అవసరమైనప్పుడల్లా ఆ వివరాలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించాలన్న ఆలోచనకు పెద్ద నేపథ్యమేవుంది.
1999లో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులు పౌర దుస్తుల్లో చొరబడి కొన్ని ప్రాంతాలను ఆక్రమించడం, మన సైనికులు దాన్ని తిప్పికొట్టి విజయం సాధించడం జరిగాక పౌరు లకు గుర్తింపు కార్డు ఇవ్వాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వాజపేయి ప్రభుత్వం నియమించిన కార్గిల్ సమీక్ష కమిటీ ఈ సూచన చేసింది. సరిహద్దు ప్రాంతాల్లోని వారికి ఈ కార్డులు అంద జేయాలన్న ప్రతిపాదన కాస్తా ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న నిర్ణయానికి దారి తీసింది. అందుకోసం 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు (ఎంఎన్‌ఐసీ) ప్రాజెక్టు, జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)లకు చోటిచ్చారు.
అయితే 2002లో ఈ రెండు ప్రాజెక్టుల మాటా ఏమైందని పార్లమెంటులో అడిగినప్పుడు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగరరావు ఎంఎన్‌ఐసీకి చట్టబద్ధత కల్పించడంతోసహా ఇందుకు సంబంధించిన అన్ని అంశాలనూ లోతుగా పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రతిపాదనల్లో ఆధార్ మూలాలు న్నాయి. ఎంఎన్‌ఐసీపై ఆ తర్వాత చెప్పుకోదగ్గ అడుగులు పడలేదు. యూపీఏ హయాంలో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో నందన్ నీలేకని చీఫ్‌గా భారత ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ (యూఐడీఏఐ) ఏర్పడి, ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దాన్ని ప్రారంభించిన ఉద్దేశం పెద్దగా నెర వేరలేదు సరిగదా దానివల్ల పౌరుల వ్యక్తిగత వివరాలు బజార్నపడి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ బృహత్తరమైన ప్రాజెక్టుకు చట్టబద్ధత తీసుకురావాలన్న స్పృహ, అది లీకైన పక్షంలో జవాబుదారీ తనం ఎవరు వహించాలో నిర్ణయించాలన్న ఆలోచన కూడా యూపీఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మరోపక్క కార్డు నమోదు ప్రక్రియకు అనుసరించిన విధానాలవల్ల ఎవరికి పడితే వారికి ఆ కార్డు సంపాదించడం సులభమైపోయింది.
వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభం కాబోయే ఎన్‌పీఆర్‌లో ‘సాధారణ నివాసుల’ వివరాలను సేక రిస్తారు. ఈ నివాసులు మన దేశ పౌరులే అయివుండనవసరం లేదు. ఒక ప్రాంతంలో ఆర్నెల్లుగా నివసిస్తున్నవారు... లేదా వచ్చే ఆరునెలలూ అంతకన్నా ఎక్కువకాలం అక్కడ ఉండదల్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ నిర్వచనం పరిధిలోకొస్తారు. వీరంతా ఎన్‌పీఆర్‌లో నమోదుకు అర్హులు. అది తప్పని సరని నిబంధనలు చెబుతున్నాయి. ఎన్‌పీఆర్ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, వారి తల్లిదండ్రుల జన్మస్థలం వివరాలు అందజేయాల్సివుంటుంది. ఇవన్నీ ఈసారి కొత్తగా పెట్టిన నిబం ధనలు. అంతక్రితం పేరు, జెండర్, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ యజమానితో ఉండే సంబంధం, పుట్టిన తేదీ, జాతీయత, చేస్తున్న వృత్తి, చిరునామా వివరాలు మాత్రమే అడిగేవారు.
ఏతావాతా గతంలో ఆధార్ కార్డు నమోదుకు అందజేసిన వివరాల్లో చాలా భాగం మళ్లీ ఎన్‌పీఆర్‌లో కూడా ఇవ్వకతప్పదు. అయితే ఈ రెండింటిలోని వివరాలూ సరిపోల్చడం అంత సులభమేమీ కాదు. వేర్వేరు ప్రాజెక్టుల కింద సేకరించే డేటానంతటినీ ఒకే డేటా బేస్‌లో ఉంచగలిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఎన్‌ఆర్‌సీపై సాగుతున్న నిరసన ఉద్యమాల పర్యవసానంగా ఎన్‌పీఆర్‌కూ, దానికి సంబంధం లేదని, ఈ డేటాను దానికి వినియోగించబోమని అమిత్ షా చెబుతున్నారు. ఎన్‌పీఆర్ కింద నమోదు కానట్టయితే అలాంటివారు అనేక విధాల నష్టపోతారంటున్నారు. ఇన్ని రకాల డేటాను సేకరించడం, దాన్ని నిక్షిప్తం చేయడం, వినియోగించడం వంటివి ప్రభుత్వానికి అవసరమే. కానీ ఆ సేకరిస్తున్న డేటా లీక్ కాకుండా చూడటం, అలా అయినపక్షంలో జవాబుదారీతనం ఎవరిదో నిర్ణ యిం చడం అవసరమని గుర్తించాలి. వ్యక్తిగత డేటా పరిరక్షణకు చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కూడా సంకల్పించింది. అయితే ఎన్‌పీఆర్ ప్రారంభం కావడానికి ముందే అది సాకారం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment