
న్యూఢిల్లీ/కోల్‌కతా/బిజ్నోర్/మీరట్: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గత వారం ‘పౌర’ ఆందోళనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను మీరట్ పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో నిషేధాజ్ఞలు విధించాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. దీంతో వారే వెనక్కి వెళ్లిపోయారు’ అని పోలీసులు తెలిపారు. ‘సంబంధిత ఉత్తర్వులను చూపాలని పోలీసులను అడిగాం. అవేమీ చూపకుండా వారు మమ్మల్ని వెనక్కి వెళ్లాలన్నారు’ అని రాహుల్, ప్రియాంక మీడియాతో అన్నారు.
‘పౌర’ చట్టంపై ఏకమైన విద్యార్థి సంఘాలు
పౌరసత్వ చట్ట సవరణతోపాటు, కేంద్రం చేపట్టదలచిన జాతీయ పౌర పట్టిక, జనాభా పట్టిక సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 70 యువ, విద్యార్థి సంఘాలు ఏకమయ్యాయి. నేషనల్ యంగ్ ఇండియా కో ఆర్డినేషన్ అండ్ కాంపెయిన్ (వైఐఎన్‌సీసీ) ఛత్రం కింద ఈ సంఘాలు మంగళవారం ఏకమయ్యాయి. 71వ గణతంత్ర దినోత్సవాలకు ముందుగానే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని వైఐఎన్‌సీసీ సభ్యుడు సాయి బాలాజీ డిమాండ్ చేశారు.
అతడు మా కాల్పుల్లోనే చనిపోయాడు
‘పౌర’ ఆందోళనల సందర్భంగా ఒక యువకుడి మృతికి తామే కారణమని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ పోలీసులు అంగీకరించారు. బిజ్నోర్‌లోని నహ్‌తౌర్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ విశ్వజీత్ శ్రీవాస్తవ మంగళవారం వెల్లడించారు. కాగా, ఎన్నార్సీపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటనలు పొంతనలేకుండా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
బెంగాల్ గవర్నర్‌కు చుక్కెదురు
బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధంఖర్ మరోసారి భంగపాటుకు గురయ్యారు. కోల్‌కతాలో జాదవ్‌పూర్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయన్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీఎంసీ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు ఆయన వాహనం వర్సిటీలోకి ప్రవేశించకుండా మెయిన్ గేట్ వద్దే రోడ్డుపై బైఠాయించారు. గో బ్యాక్ అని నినాదాలు చేసుకుంటూ, నల్ల జెండాలు ప్రదర్శించారు. దీంతో యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అయిన సురంజన్ దాస్‌కు గవర్నర్ ఫోన్ చేశారు. ఆందోళనకారులను శాంతింప జేయాలని సురంజన్‌ను కోరారు. ఫలితం లేకపోవడంతో గవర్నర్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ధంకర్ మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.