సునంద హంతకులెవరు? | Who assassin Sunanda? | Sakshi
Sakshi News home page

సునంద హంతకులెవరు?

Published Wed, Jan 7 2015 12:44 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

సునందా పుష్కర్ - Sakshi

సునందా పుష్కర్

సంపాదకీయం

 ఏడాది కాలంగా సంచలనం కలిగిస్తున్న సునందా పుష్కర్ మృతి కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సునందపై విషప్రయోగం జరిపి ఎవరో ఆమెను హతమార్చారని ఢిల్లీ పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఆమెను అత్యంత ప్రమాదకరమైన ప్లుటోనియం- 210 అనే రేడియోథార్మిక పదార్థాన్ని వినియోగించి హతమార్చి ఉండొచ్చని ఫోరెన్సిక్ నివేదిక అభిప్రాయపడ్డాక పోలీసులు దీన్ని హత్య కేసుగా మార్చారు. సునంద ఎవరో సాధారణ గృహిణి అయితే బహుశా ఆమె మరణం చుట్టూ ఇన్ని రకాల కథనాలు అల్లుకునేవి కాదు. ఆమె ఆనాటి కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి గనుకా, మరణానికి ముందు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గనుకా ఈ అనుమానాస్పద మృతి కేసు ఎన్నో మలుపులు తిరిగింది. సునంద హోదా, పలుకుబడి ఆమెను కాపాడలేకపోయాయి సరిగదా...కనీసం మరణించాకైనా అందుకు గల కారణాలేమిటో చకచకా ఆరా తీయడానికి అక్కరకు రాలేకపోయాయి.  

 చానెళ్లు, సామాజిక నెట్‌వర్క్‌ల ప్రాచుర్యం తర్వాత మన దేశంలో బాగా వాడుక లోకొచ్చిన పదం ‘సెలబ్రిటీ’. ఏ వ్యక్తిపైన అయినా ఇలాంటి ముద్ర పడ్డాక అది ఏకకాలంలో వారికి వరమూ, శాపమూ కూడా. ఆ ముద్రపడిన వ్యక్తి మహిళ అయితే ఎక్కువ సందర్భాల్లో అది శాపమే అవుతుంది. సునందా పుష్కర్ 2010కి ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. జమ్మూకు చెందిన ఒక సైనికాధికారి కుమార్తెగా... దుబాయ్‌లో ఒక స్పా నిర్వాహకురాలిగా... అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి చెందిన సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నంతకాలమూ సునంద గురించి ఎవరికీ పట్టలేదు. కానీ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలో వచ్చిన పెను వివాదంలో ఆనాటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్‌తోపాటు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాక, అప్పటికి వారిద్దరూ స్నేహితులు మాత్రమే అయినందువల్లా అది ఎన్నెన్నో మలుపులు తీసుకుంది. శశిథరూర్‌తో పెళ్లయిన తర్వాత కూడా ఆమె తరచు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. శశి భార్యగానే కాక వ్యక్తిగతంగా కూడా ఆమెకు సెలబ్రిటీ స్థాయి వచ్చింది. వీటన్నిటికీ తోడు ఆమె చనిపోవడానికి రెండు రోజులముందు రేపిన దుమారం సామాన్యమైనది కాదు. శశి థరూర్‌కు పాకిస్థాన్‌కు చెందిన మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉన్నదంటూ ట్విటర్‌లో సునంద ఆరోపించారు. తమ వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని కూడా అన్నారు. మెహర్ తరార్ ఐఎస్‌ఐ ఏజెంటని కూడా అభియోగం మోపారు. దీన్నుంచి బయటపడటం కోసం తన ట్విటర్ ఖాతాను ఎవరో తెరచి ఇలాంటి వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారని శశిథరూర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా సునంద వదల్లేదు. ఆయన ఖాతాను ఎవరూ హ్యాక్ చేయలేదని, తానే ఆ వ్యాఖ్యలను పోస్టు చేశానని బదులిచ్చారు. ఇదంతా అయ్యాక ఇద్దరిమధ్యా రాజీ కుదిరింది. తమ వైవాహిక జీవి తం సంతోషంగా ఉన్నదంటూ దంపతులిద్దరూ సంయుక్త ప్రకటన విడుదలచేశారు.

  అక్కడితో ఈ మొత్తం వివాదం పరిసమాప్తమైంది. అందరూ అలాగే అనుకున్నారు. బహుశా సునంద కూడా అలాగే అనుకుని ఉంటారు. దేశ రాజధానీ నగరంలోని ఏడు నక్షత్రాల హోటల్‌లో బసచేసి ఉన్నప్పుడు తాను అత్యంత సురక్షితమైన ప్రాంతంలో ఉన్నానని భావించి ఉంటారు. కానీ కొన్ని గంటల్లోనే ఆమె విగతజీవిగా మారారు. చనిపోయిన సమయానికి హోటల్ గదిలో ఆమె ఒక్కరే ఉన్నారు. సునందది హత్యే అయితే ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఎవరు ప్రయత్నించి ఉంటారు? ఆ అవసరం ఎవరికుంటుంది? చనిపోయిన వ్యక్తి ప్రముఖురాలే గాక, కేంద్ర మంత్రి సతీమణి కూడా అయినందువల్ల ఢిల్లీ పోలీసులు చురుగ్గా దర్యాప్తు సాగించి వాస్తవాలను వెల్లడించి ఉంటే వేరుగా ఉండేది. ఇలాంటి ముఖ్యమైన కేసుల విషయంలోనైనా వారు కర్తవ్యనిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది. పోలీసుల సంగతి అలా ఉంచి...శవపరీక్ష జరిపి ఏం జరిగి ఉంటుందో చెప్పాల్సిన వైద్యులు కూడా ఆ పని సక్రమంగా నిర్వహించలేదు. మితిమీరిన వ్యాధి నిరోధక ఔషధాలు తీసుకోవడంవల్లే సునంద మరణించారని తొలుత నివేదిక వచ్చినా...అదంతా ఒత్తిళ్లతో రూపొందిన నివేదిక అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ చీఫ్ సుధీర్‌గుప్తా ఆరోపించడంతో వ్యవహారం మొదటికొచ్చింది. ఇన్నాళ్ల సమయం గడిచాక ఇప్పుడు తాజా నివేదిక సునందపై విషప్రయోగం జరిగిందన్న నిర్ధారణకొచ్చింది. అంతేకాదు...ఆమె శరీరంపై 15 గాయాలున్నాయని వెల్లడించింది. సీసీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రత ఉన్న పెద్ద హోటల్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి జరిగుంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఎటుపోయినట్టు? ఆ సాక్ష్యాలను పోలీసులు సేకరించారా? సేకరించి ఉంటే వాటిగురించి ఇంతవరకూ ఎందుకు మాట్లాడటంలేదు?

 ఏదైనా వ్యవహారం చుట్టూ గోప్యత పాటిస్తే అది మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. అప్పటికే ఎన్నో కుంభకోణాల్లో అది చిక్కుకుని ఉండటం, మరణానికి ముందు సునంద చేసిన ఆరోపణల స్వభావం ఈ కేసులో ఎన్నో ఊహాగానాలకు దారితీశాయి. వీటికి తోడు ఆమె మరణానికి పొలోనియం-210 కారణం కావొచ్చని అంటున్నందువల్ల ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ పదార్థాన్ని ఉపయోగించి హతమార్చిన ఉదంతాలు ప్రపంచంలో ఇప్పటికి రెండు సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. 2004లో పాలస్థీనా అధినేత యాసిర్ అరాఫత్, 2006లో కేజీబీ మాజీ ఏజెంటు లుత్వినెంకో ఇలాంటి విషప్ర యోగం వల్లనే మరణించారు. ఈ స్థాయిలో సునందను హతమార్చడానికొచ్చిన హంతకులు ఎవరో, వారి చర్య వెనకున్న కారణాలేమిటో తేల్చాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీసులపై ఉన్నది. ఈ కేసులో ఇప్పటికే అంతులేని జాప్యం జరిగింది. కనీసం ఇకనుంచి అయినా చురుగ్గా కదిలి హంతకుల ఆచూకీని కనుక్కుంటే సునందా పుష్కర్‌కు వారు న్యాయం చేసినవారవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement