పిసరంత పొలోనియం.. ప్రాణాలు తీస్తుంది
సాక్షి, హైదరాబాద్: అత్యంత అరుదైన రేడియోధార్మిక మూలకమిది. భూమి లోపలి పొరల్లో అతికొద్ది మోతాదుల్లో సహజసిద్ధంగా ఏర్పడే ఈ పదార్థాన్ని 1898లో మేరీ, పియరీ క్యూరీ దంపతులు కనుగొన్నారు. అణు రియాక్టర్లలోనూ దీన్ని కృత్రిమంగా తయారు చేయవచ్చు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ(ప్లాస్టిక్ కాగితాన్ని నలిపినప్పుడు దాని ఉపరితలంపై ఏర్పడే విద్యుత్తు లాంటిది)ని తొలగించే పరికరాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.
దుష్ర్పభావం ఇలా... పొలోనియం-210 అతిచిన్న మోతా దుల్లో కూడా అత్యంత ప్రమాదకరం. గ్రాము కంటే తక్కువ మోతాదుతోనూ మనిషి ప్రాణాలు తీయవచ్చు. ఇది ఒకసారి రక్తంలోకి చేరితే దాని ప్రభావాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. అందులోని ఆల్ఫా కణాలు కాలేయంతోపాటు కిడ్నీ, ఎముక మజ్జలపై దాడి చేసి పనిచేయకుండా చేస్తాయి. ఫలితంగా కొద్ది రోజుల్లో లేదంటే వారాల్లోపు మరణం సంభవిస్తుంది. రేడియోధార్మిక కణాలు శరీరంలోకి చేరినప్పుడు అవి చర్మం ద్వారా బయటకొచ్చే అవకాశముంది.
కానీ పొలోనియం-210లోని ఆల్ఫా కణాలు పెద్దవిగా ఉండటం వల్ల లోపలే ఉండిపోతాయి. గాజు పరికరాల్లో ఉంచితే రేడియోధార్మిక డిటెక్టర్లు కూడా గుర్తుపట్టలేవు. శరీరంలోకి చేరిన విషంలో 50 నుంచి 90 శాతం మలమూత్రాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మిగిలిన కొద్ది మోతాదులో సగం ముందుగా రక్తంలోకి ఆ తర్వాత ప్లీహం, మూత్రపిండాలు, కాలేయాల్లోకి చేరుతుంది. పది శాతం పొలోనియం ఎముక మజ్జలో పేరుకుపోతుంది. రక్తంలోకి చేరిన పొలోనియం శరీరం మొత్తం ప్రయాణిస్తూ ఎర్రరక్త కణాలను చంపేయడం మొదలుపెడుతుంది. రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. ఆయా అవయవాలు విఫలం కావడంతోపాటు వికారం, తలనొప్పి, విరేచనాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రభావం కేన్సర్ చివరి దశను పోలి ఉంటుంది.
దీనితో ఎవరైనా మరణించారా?
2006లో రష్యా గూఢచారి అలెగ్జాండర్ లెథ్‌వింకో మరణంతో పొలోనియం విష ప్రయోగంపై విసృ్తత చర్చ మొదలైంది. అంతకుముందు 1956లో ఇరేన్ జోలియట్ క్యూరీ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త (1935 నోబెల్ అవార్డు గ్రహీత) కూడా ఈ విష ప్రభావంతో మరణించినట్లు ఆధారాలున్నాయి. నాలుగేళ్ల క్రితం పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ మరణానికి కూడా ఇదే కారణమన్న ఆరోపణలు వచ్చాయి.