ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు అవసరమయ్యే ఎనర్జీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో సంస్థ అవసరాలు తీర్చడానికి వీలుగా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల (ఎస్‌ఎంఆర్-తక్కువ పరిమాణం, అధిక భద్రత కలిగే రియాక్టర్లు) నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలోనే ఒక కార్పొరేట్ సంస్థ ఈమేరకు వివిధ ఎస్‌ఎంఆర్‌ల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఇది మొదటిసారి కావడం గమనార్హం.
గూగుల్ సంస్థ కైరోస్ పవర్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 2030 నాటికి కైరోస్ పవర్‌కు చెందిన ఎస్‌ఎంఆర్ ద్వారా విద్యుత్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. 2035 నాటికి మరిన్ని రియాక్టర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందంలోని అంశాల అమలు తుదిదశ చేరేనాటికి ఆరు నుంచి ఏడు రియాక్టర్ల ద్వారా మొత్తం 500 మెగావాట్ల విద్యుత్‌ను గూగుల్ కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు, ఏ ప్రాంతంలోని రియాక్టర్ల నుంచి కొనుగోలు చేయబోతున్నారో మాత్రం తెలియజేయలేదు.
ఏఐ టెక్నాలజీలో నిత్యం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి వాడుతున్న పరికరాలు, డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. సంప్రదాయ విద్యుత్ తయారీకి బదులుగా గ్లోబల్ కంపెనీలు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ కంపెనీ అణు రియాక్టర్ల ద్వారా వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..
ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ టాలెన్ ఎనర్జీ నుంచి న్యూక్లియర్ పవర్డ్ డేటా సెంటర్‌ను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ పెన్సిల్వేనియాలోని త్రీ మైల్ ఐలాండ్‌లో రియాక్టర్‌ను పునరుద్ధరించడంలో కాన్‌స్టెలేషన్ ఎనర్జీకి సాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2023-2030 మధ్య యూఎస్ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం మూడు రెట్లు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. దీనికి దాదాపు 47 గిగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment