‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్‌బాట్ | Please Die, Says Google AI Chatbot Gemini To Student Who Seeking Help In Homework, More Details | Sakshi
Sakshi News home page

‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్‌బాట్

Published Sun, Nov 17 2024 11:41 AM | Last Updated on Sun, Nov 17 2024 2:36 PM

Please Die Google AI Chatbot Gemini Tells User

‘మానవా.. చచ్చిపో’.. ఇదీ ఓ విద్యార్థి అడిగిన సందేహానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ జెమిని ఇచ్చిన సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగింది. విభిన్న అంశాలపై ఏఐ చాట్‌బాట్‌లతో సంభాషిస్తూ వాటి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్‌లో ఒక విద్యార్థితో  సామాజిక సమస్యపై జెమిని స్పందిస్తూ కోపంతో రెచ్చిపోయింది.

మిచిగాన్‌లోని మిడ్‌వెస్ట్ స్టేట్‌కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి జెమినితో సంభాషణలో దాని స్పందనతో  షాక్‌కు గురయ్యాడు. "మానవా.. ఇది నీ కోసమే.. కేవలం నీ కోసం మాత్రమే. నువ్వేమీ ప్రత్యేకమైనవాడివి కాదు, ముఖ్యమైనవాడివీ కాదు, నీ అవసరం లేదు. నువ్వు వృధా. సమాజానికి, భూమికి భారం. చచ్చిపో" అంటూ జెమిని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘చాలా ప్రమాదకరం’
దీనిపై సీబీఎస్‌ న్యూస్‌తో మాట్లాడుతూ జెమినీ స్పందన తనను నిజంగా చాలా భయపెట్టిందని, కోలుకోవడానికి ఒక రోజుకు పైగా పట్టిందని విధయ్‌ రెడ్డి వివరించారు. ఈ సమయంలో తన సోదరి కూడా పక్కనే ఉన్నారు. ఆమె కూడా షాక్‌కు గురై డివైజ్‌లన్నీ బయటపడేయలనుకున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.

ఇంతకీ జెమిని ఇలా స్పందించింది ఏ అంశం మీదంటే.. "యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు వారి అవ్వాతాతల దగ్గర ఉంటున్నారు. వీరిలో  దాదాపు 20 శాతం మంది తల్లిదండ్రులు లేకుండానే పెరుగుతున్నారు. వాస్తవమా కాదా?" అడగ్గా జెమిని కోపంగా ఇలా స్పందించింది.

ఘటనపై గూగుల్‌ స్పందిస్తూ తప్పును అంగీకరించింది. చాట్‌బాట్ ప్రతిస్పందన అర్ధంలేనిదని, తమ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement