మోదీ ఈ మధ్య కాస్త వంగిపోయి కనిపిస్తున్నారు! స్ట్రయిట్‌గా నిలబడటం లేదు. నడక కూడా నడుస్తున్నట్లుగా లేదు. ఎవరినో నడిపిస్తున్నట్లుగా ఉంది! ఆయన చెప్పడం భారతదేశాన్ని నడిపిస్తున్నానని.
స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, సిట్ డౌన్ ఇండియా అని.. దేశానికి ఉత్సాహం తెప్పించడానికో, తను ఉత్సాహం తెచ్చుకోడానికో.. అనడానికైతే అంటున్నారు కానీ, ఆయన మాత్రం దేని మీదా నిలబడలేకపోతున్నారు. ఆయనకు బదులుగా అమిత్‌షా, అరుణ్ జైట్లీ నిలబడుతున్నారు.
మోదీని వ్యతిరేకించేవారు ఎంత దేశద్రోహులో అరుణ్ జైట్లీ వచ్చి చెప్తాడు. ఆయనకు తీరిక లేకపోతే అమిత్‌షా వచ్చి చెబుతాడు. నిన్నా మొన్నా ఇద్దరికీ తీరిక లేనట్లుంది. అనిల్ బలూనీ అనే కుర్రాడొచ్చి ‘‘యూ ఆర్ లైక్ భీష్మా’’ అని నన్ను తిట్టేసి పరుగెత్తాడు. ‘‘ఏయ్ ఆగు..’’ అన్నాను! వెనక్కి తిరిగి చూసి, ‘‘నువ్వు భీష్ముడివి. కౌరవుల సైడ్’’ అనేసి మళ్లీ పరుగెత్తాడు.
అనిల్ వెళ్లిన కొద్దిసేపటికే జీవీఎల్ వచ్చాడు. ‘అన్నీ తెలుసనుకుంటారు మీరు. మోదీజీ కంటే ఎక్కువ తెలుసా మీకు’ అనేశాడు!
‘‘ఏం తెలియాలి జీవీఎల్? హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది తెలియాలా? లేక.. నువ్వూ, అనిల్.. అధికార ప్రతినిధులని తెలియాలా?’’ అన్నాను.
‘‘యశ్వంత్‌జీ.. మీరెందుకు కాంగ్రెస్ వాళ్లతో మాట్లాడుతున్నారు? మీరెందుకు మనవాళ్లను తిడుతున్నారు?’’ అన్నాడు జీవీఎల్. అనిల్ బలూనీలా అతడు నన్ను తిట్టేసి, పరుగులు తియ్యలేదు. కాస్త ధైర్యంగా నిలబడ్డాడు.
‘‘యశ్వంత్‌జీ.. ఈ ఎనభై ఏళ్ల వయసులో మీకు ఉద్యోగం అవసరమా? ఉద్యోగం లేని రాహుల్‌ను మీరెళ్లి ఉద్యోగం అడగడం గౌరవమేనా?’’ అన్నాడు.
నాకతడి మీద కోపం రాలేదు.
‘‘ఎనభై ఏళ్ల వయసులో ఉద్యోగం’’ అన్నది అతడి మాట కాదు. ౖజñ ట్లీ మాట. దాన్ని మోసుకొచ్చాడు.
‘‘మోదీ ఎలా ఉన్నారు జీవీఎల్? ఆరోగ్యంగానే ఉన్నారా?’’ అని అడిగాను. జీవీఎల్ ఆశ్చర్యపోయాడు. ‘‘ఏమైందీ.. బాగానే ఉన్నారు కదా! మన్ కీ బాత్‌లో కూడా మాట్లాడారు. మీరు వినలేదా?!’’ అన్నాడు.
‘‘ఎందుకు వినలేదూ.. ‘మన్ కీ బాత్‌లో.. నో పాలిటిక్స్’ అని కూడా అన్నారు. అందుకే డౌట్ వచ్చింది.. ఆయన ఆరోగ్యం బాగోలేదేమోనని! పొలిటీషియన్ పాలిటిక్స్ మాట్లాడకుండా, ఎకనమిక్స్ మాట్లాడకుండా భారతంలోని క్యారెక్టర్స్ గురించి
మాట్లాడుతుంటే నీకైనా డౌట్ రాదా జీవీఎల్’’ అన్నాను.
లేచి నిలుచున్నాడు జీవీఎల్.
‘మిమ్మల్నందుకే శల్యుడు అన్నారు మోదీజీ’ అని అనేసి వెళ్లిపోయాడు.
మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment