
దావూద్ జాడలు
తరచుగా మీడియా కథనాల్లో తప్ప బహిరంగంగా కనబడని దావూద్ ఇబ్రహీం మరోసారి వార్త అయ్యాడు.
తరచుగా మీడియా కథనాల్లో తప్ప బహిరంగంగా కనబడని దావూద్ ఇబ్రహీం మరోసారి వార్త అయ్యాడు. పాకిస్తాన్‌లో అతని నివాసాలుగా పేర్కొంటూ మన దేశం అందజేసిన తొమ్మిది చిరునామాల్లో ఆరు సరైనవేనని ఐక్యరాజ్యసమితి కమిటీ దాదాపుగా నిర్ధారించింది. మూడు చిరునామాలు మాత్రమే సరైనవి కాదని చెప్పడం ద్వారా మిగిలిన ఆరింటినీ అది ధ్రువీకరించినట్టయింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిగా, అంతక్రితం నేర ప్రపంచ రారాజుగా పేరు మోసిన దావూద్‌కు పాక్ ఆశ్రయమిస్తున్నదని మన దేశం ఎప్పటినుంచో ఆరోపిస్తున్నది. పాకిస్తాన్ మాత్రం దాన్ని తోసిపుచ్చుతోంది. ఆధారాలివ్వాలని సవాల్ చేస్తోంది.
ఇప్పుడు సమితి కమిటీ తాజా నిర్ణయం వచ్చాక కూడా దాని బుకాయింపు ధోరణిలో మార్పేమీ లేదు. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి ఆ కమిటీ తీసు కోబోయే చర్యలవల్ల దావూద్‌లాంటివారికి ఆశ్రయమివ్వడం పాకిస్తాన్‌కు కష్టమవు తుంది. ఆ కమిటీ జాబితా కెక్కిన వ్యక్తులనూ, సంస్థలనూ అదుపు చేయడం... వారి ఆస్తులను, బ్యాంకు ఖాతాలనూ స్వాధీనం చేసుకోవడం, పరారీ కాకుండా చూడటం సభ్య దేశాల బాధ్యత అవుతుంది. ఆ పనే జరిగితే పాకిస్తాన్‌కు ఊపి రాడని స్థితి ఏర్పడుతుంది. దావూద్‌పై ఇప్పటికే మన దేశం రెడ్ కార్నర్ నోటీసు జారీచేయించింది. 2000 సంవత్సరం నుంచి అమల్లోకొచ్చిన నేరస్తుల అప్పగింత ఒప్పందం, ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జరిపిన పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల ఫలితంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఉగ్రవాదులను అప్పగించడంలో తోడ్పాటునందిస్తోంది. తమ నిఘా వర్గాలిచ్చే సమాచారాన్ని మన దేశంతో పంచుకుంటున్నది. ఈ చర్యల వల్ల దావూద్ కార్యకలాపాలకు పరిమితులు ఏర్పడ్డాయి. అయితే అవి పూర్తిగా ఆగిపోలేదు.
పేరుకే రహస్య జీవనంగానీ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో నాలుగు గోడల మధ్యా గుట్టుగా ఏమీ బతకడం లేదు. అమెరికాలో 2001లో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత పాక్ దాటి వెళ్లకపోయి ఉండొచ్చుగానీ అంతక్రితం అతను నేరుగా వేర్వేరు దేశాల్లో తన కార్యకలాపాలు సాగించేవాడు. ప్రస్తుతం కరాచీలో కూర్చుని గల్ఫ్ దేశాల్లోని స్థిరాస్తి వ్యాపారాలను చక్కబెడుతున్నాడు. మాదక ద్రవ్యాలు, మ్యాచ్ ఫిక్సింగ్‌లు, మన దేశంలోకి దొంగ కరెన్సీ తరలింపు వగైరా వ్యాపారాలు... వాటి ద్వారా దావూద్ వెనకేసుకునే కోట్లాది డాలర్లు పాక్ ప్రభుత్వానికి తెలియనివి కాదు. అతను కరాచీలోనే ఉంటున్నా ఇబ్బందులు తలెత్తుతాయనుకున్నప్పుడు పాక్–అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతానికి తరలించడం మామూలే. ఎక్కడున్నా శాసించ డమెలాగో అతనికి తెలుసు. తనకు ఆశ్రయమిస్తున్న ఐఎస్‌ఐకి వివిధ దేశాల్లోని తన ఏజెంట్ల ద్వారా అందే సమాచారాన్ని చేరేయడం, తన అక్రమార్జనలో వాటా లివ్వడం, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు సహకరించడం దావూద్ విధి. మన దేశాన్ని చికాకు పరచడంలో, నష్టం కలగజేయడంలో తోడ్పాటు నందిస్తున్నాడు గనుక పాకిస్తాన్ పాలకులకు అతను ఆప్తుడయ్యాడు.
అతని గురించి పైకి ఏం చెప్పినా దావూద్ ఆచూకీ, ఆనుపానుల గురించి ఎప్పుడో ఒకప్పుడు నిర్ధారణ కాక తప్పదని పాక్ పాలకులకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితే తలెత్తితే అతన్ని ఎలా వదిలించుకోవాలన్న విషయంలో కూడా వారికి తగిన అవగాహనే ఉండొచ్చు. అగ్రరాజ్యం అమెరికా దావూద్‌ను ఒక సమస్యగా, ముప్పుగా పరిగణించనంత కాలం... అతనికి గానీ, అతని వల్ల పాక్ పాలకులకు గానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యం. దావూద్ గురించి తనకేమీ తెలియనట్టు అమెరికా నటిస్తున్నా ప్రస్తుతం ఆ దేశంలోనే జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ దావూద్ గురించి, అతని కార్యకలాపాల గురించి ఇప్పటికే వారికి కావలసినంత సమాచారం అందించాడు. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం తనకు మాత్రమే ఉన్న హక్కని, అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని అమెరికా నియమం పెట్టుకున్నట్టు కనబడుతోంది.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరుడు మన దేశాన్ని సందర్శించినప్పుడు వెలువడిన సంయుక్త ప్రకటనలో ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబా, హక్కానీ నెట్ వర్క్‌లతోపాటు దావూద్ ముఠా ప్రస్తావన కూడా ఉంది. ఇలాంటి ఉగ్రవాద సంస్థలను అణచడానికి సమష్టిగా కృషి చేయాలన్న సంక ల్పాన్ని ఇరుదేశాలూ వ్యక్తంచేశాయి.అయినా దావూద్ విషయంలో అటు నుంచి అందుతున్న సహకారం పెద్దగా లేదు.
అయితే దావూద్‌లాంటివారు తలెత్తడానికీ, ఎదగడానికీ.. కొరకరాని కొయ్యగా మారడానికి మన దేశంలో ఇప్పటికీ పుష్కలంగా అవకాశాలున్నాయని నిన్న మొన్నటి నయీం ఉదంతం నిరూపించింది. దావూద్ ఇబ్రహీం ఇక్కడే పుట్టి పెరిగాడు. ముంబై మహానగరాన్ని అడ్డాగా చేసుకుని 1986 వరకూ దేశం లోనే ఉన్నాడు. అప్పట్లో రాజకీయ నాయకులతో, ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక వ్యక్తులతో, సినీ పరిశ్రమ పెద్దలతో చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు. తమ కక్షలు తీర్చుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించుకోవడానికి వీరందరికీ పని కొచ్చాడు. ఎప్పుడైనా పైనుంచి ఒత్తిళ్లు వస్తే... అరెస్టు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడితే ముందుగా సమాచారమిచ్చి అతను తప్పించుకు పోవ డానికి అన్నివిధాలా తోడ్పడింది వీరే. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిగా వెల్లడైన తర్వాత వీరిలో చాలామంది తమకు ఎప్పుడూ అతనితో సంబంధ బాంధవ్యాలు లేవన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. చిత్రమేమంటే... దావూద్ కార్యకలాపాలు ముంబైలో ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి కమిటీ తీసుకున్న చర్యతో దావూద్ విషయంలో కొంత ముందడుగు పడినట్టయింది. ప్రపంచానికి పాక్ నిజస్వరూపాన్ని చాటడానికి ఇలాంటి పరిణామాలు నిస్సందేహంగా దోహదపడతాయి. అయితే అంతకన్నా ముందు మన దేశంలో మరింత మంది దావూద్‌లు తలెత్తకుండా చూసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పాలకులు గుర్తించాలి.