పరిపాలన సుపరిపాలన
నాగరికత పరిణామ క్రమంలో ఏర్పడిన గొప్ప వ్యవస్థలో రాజ్యం ఒకటి. ప్రజలు, ప్రదేశం (భూభాగం), ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపుల సమాహారాన్ని రాజ్యంగా నిర్వచించవచ్చు. రాజ్యంలో పాలకులు, పాలితులు ఉంటారు. పాలకులు రాజ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. పాలితులు పౌర సమాజంలో కీలకపాత్ర పోషిస్తారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అనుసంధాన కర్తలుగా ఉంటారు. వీరు రాజ్య మౌలిక భావాలైన ప్రజా రక్షణ, సంక్షేమం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను పర్యవేక్షిస్తారు.
పాలనాపరమైన ఒత్తిళ్లు, పౌరుల డిమాండ్లు, అభివృద్ధి అసమానతలు, విశాల లక్ష్యాల కారణంగా ఆధునిక రాజ్యాలు గతంలో ఎప్పుడూ లేనంత సంక్లిష్టతను ఎదుర్కొంటున్నాయి. రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఉన్నత స్థాయిలో ఉండగా, క్రమానుగత శ్రేణి గల ఉద్యోగిస్వామ్యం (బ్యూరోక్రసీ)పై స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు విస్తరించింది. శాసనాలు, చట్టాలు నియమ నిబంధనలతో కూడిన పాలనా వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు అన్ని స్థాయిల్లో వెలిశాయి. ప్రభుత్వ పాలన అంతా ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వ్యవస్థతో ముడిపడి ఉంటోంది.
ఠి పరిపాలన– ఆవిర్భావం– అర్థం: గవర్నెన్స్ లేదా పరిపాలన అనే పదం రాజనీతిశాస్త్రం, పాలనాశాస్త్రం, పరిధులను అధిగమించి అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం, రాజకీయాలు, అంతర్జాతీయ విషయాలు, సాంస్కృతిక రంగం, దౌత్యనీతి వంటి అనేక రంగాలకు విస్తరించింది. వ్యవస్థల కార్యకలాపాలు ఏవైనప్పటికీ అన్నింటిలో గవర్నెన్స్ పదం కలసిపోయింది. ఆధునిక రాజ్య వ్యవస్థ పరిణామ క్రమం మొత్తం.. వ్యవస్థల పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటోంది. ఈ వ్యవస్థల కార్యకలాపాల సమాహారాన్ని పరిపాలన అని పిలవడం 1980వ దశకం నుంచి ప్రారంభమైంది.
⇒పరిపాలన నిర్వచనం– భావన: ‘పరిపాలన’ అనే భావనను పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. కౌటిల్యుని అర్థ్ధశాస్త్రంలో పరిపాలనపై చర్చ జరిగింది. పరిపాలన ఒక కళ అని, అది సమన్యాయం, విలువలు, నియంతృత్వ వ్యతిరేక పోకడలు వంటి లక్షణాలను కలిగి ఉంటుందని కౌటిల్యుడు పేర్కొన్నాడు. రాజ్యం.. దాని సంపద, పౌరులను సంరక్షిస్తూనే వాటి ప్రయోజనాలకోసం పాటుపడాల్సిన బాధ్యత పాలకునిపై ఉంటుందని కౌటిల్యుడు సూచించాడు.
⇒పరిపాలన భావన ఎంతో ప్రాచీనమైనది అయినప్పటికీ, దాని నిర్వచనంపై ఏకాభిప్రాయం లేదు. ‘గవర్నెన్స్’అనే పదం ‘కుబేర్నాన్’ అనే గ్రీకు మూల పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థాన్ని ప్లేటో.. వ్యవస్థీకృత పాలనా నమూనాను తయారుచేయటం అని పేర్కొన్నాడు. ‘కుబేర్నాన్’ మధ్యయుగాల్లో లాటిన్ పదమైన ‘గుబెర్నేర్’తో సమానార్థాన్ని కలిగి ఉంది. నియమాల రూపకల్పన, నియంత్రణ అని దీనికి వివరణ ఇచ్చారు. ‘గుబెర్నేర్’ పదాన్ని ప్రభుత్వానికి సమానపదంగా కూడా గుర్తించారు.
⇒ ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ప్రకారం ‘గవర్నెన్స్’ అంటే పాలనా పద్ధతి, ప్రక్రియ, కార్యాలయ పని విధానం, పరిపాలన. 1980వ దశకం తర్వాత రాజనీతి శాస్త్రవేత్తలు, గవర్నెన్స్‌ను ప్రభుత్వం నుంచి విడదీసి దానికి పౌరసమాజ వర్గాలను జతచేశారు. దీనివల్ల గవర్నెన్స్ నిర్వచనాల పరిధి, రూపం మార్పు చెందింది.
⇒వనరుల మార్పిడి, పరిపాలన నియమాలు, రాజ్యం నుంచి గణనీయమైన స్వయం ప్రతిపత్తి వంటి లక్షణాలు గల స్వీయ నియంతృత్వ వ్యవస్థలు, సమూహాల పరస్పర ఆధారిత కార్యకలాపాలను పరిపాలనగా చెప్పవచ్చు.
⇒ప్రభుత్వ విధానాల రూపకల్పన, రచన వాటి అమలు తదితర బాధ్యతల నిర్వర్తన సమాహారమే పరిపాలన. లాంఛనప్రాయ, లాంఛనేతర రాజకీయ నియమాల నిర్వహణను పరిపాలన అనవచ్చు. దీంట్లో అధికార వినియోగానికి సంబంధించిన నియమాల రూపకల్పన, ఆ నియమాల మధ్య ఏర్పడే వైరుధ్యాలను పరిష్కరించడం వంటి అంశాలు ఇమిడి ఉంటాయి.
యూఎన్‌డీపీ ప్రకారం
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) నిర్వచనం ప్రకారం గవర్నెన్స్ అంటే విలువలు, విధానాలు, వ్యవస్థల సమాహారం. వీటి ద్వారా సమాజం తన ఆర్థిక, రాజకీయ, సాంఘిక వ్యవహారాలను నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో రాజ్యం, పౌరసమాజం, ప్రైవేటు రంగాల మధ్య పరస్పర సంబంధాలతో పాటు రాజ్య వ్యవస్థల మధ్య సమన్వయం కూడా ఏర్పడుతుంది.
ప్రపంచ బ్యాంకు ప్రకారం
ప్రపంచ బ్యాంకు నిర్వచనాల ప్రకారం పౌరుల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక దేశంలో సార్వభౌమాధికారాన్ని రాజ్య వ్యవస్థలు సంప్రదాయ పద్ధతులతో వినియోగించటాన్ని పరిపాలన అంటారు. ఇందులో ప్రభుత్వంపై పౌరుల పర్యవేక్షణ, ప్రభుత్వాన్ని తొలగించే అధికారం, ఉత్తమ విధానాలతో ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడే ప్రభుత్వ సామర్థ్యం ఇమిడి ఉంటాయి. పౌరులకు, రాజ్యానికి తన వ్యవస్థలపై గౌరవం ఉండాలి. వ్యవస్థలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రగతిశీల మార్పునకు దోహదం చేస్తాయి.
⇒ గవర్నెన్స్– భావన: గవర్నెన్స్ అనే పదం క్లుప్తంగా విధానాల నిర్ణయీకరణ ప్రక్రియ–ఆయా నిర్ణయాలను అమలు చేస్తున్న పద్ధతి అని చెప్పొచ్చు. ముఖ్యంగా గవర్నెన్స్ అనే పదాన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చి, వాటి ఉద్దేశాలు, లక్ష్యాలను సాధించే ప్రక్రియగా పేర్కొనవచ్చు.
⇒ఇటీవలి కాలంలో గవర్నెన్స్‌ను గుడ్‌గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్, మొబైల్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్, గ్లోబల్ గవర్నెన్స్, నేషనల్ గవర్నెన్స్, లోకల్ గవర్నెన్స్ తదితర పేర్లతో వివిధ వ్యవస్థల్లో పిలుస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి, నూతన ప్రభుత్వ నిర్వహణ ప్రక్రియల కొనసాగింపుగా∙గవర్నెన్స్‌ను భావించొచ్చు.
గవర్నెన్స్– మౌలిక సూత్రాలు
గవర్నెన్స్‌కు ఆరు మౌలిక సూత్రాలుంటాయని ప్రపంచబ్యాంకు అధ్యయనం తెలిపింది. ఇవి ప్రపంచంలోని దాదాపు 200 దేశాలకు వర్తిస్తాయి. కాబట్టి వీటిని విశ్వజనీన అంశాలుగా పరిగణిస్తారు. అవి..
1. ప్రజల వాణి– జవాబుదారీతనం
2. రాజకీయ సుస్థిరత
3. హింసారహిత సమాజం
4. ప్రభుత్వ కార్యసాధకత
5. నియంత్రణ నాణ్యత
6. అవినీతి నియంత్రణ
ఈ సూత్రాల ఆధారంగా ప్రపంచబ్యాంకు ఏటా పరిపాలనా సామర్థ్య నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచబ్యాంకు 1992లో ప్రకటించిన ‘‘గవర్నెన్స్ అభివృద్ధి’’ నివేదికకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీని ఆధారంగా గవర్నెన్స్ పదం ప్రముఖంగా ఉపయోగంలోకి రావటంతో పాటు దానిపై చర్చలు జరిగాయి. నివేదిక ప్రధానంగా మూడు అంశాలను చర్చించింది..
1. రాజకీయ అధికార స్వరూపం
2. దేశ ఆర్థిక, సామాజిక వనరులను అభివృద్ధికి వినియోగించడంలో– అనుసరించే అధికార ప్రక్రియ
3. విధాన రూపకల్పన, దాని అమలుకు సంబంధించి ప్రభుత్వ సామర్థ్యం.
⇒ప్రపంచీకరణ నేపథ్యంలో గవర్నెన్స్ స్థానంలో∙గవర్నెన్స్ –గుడ్ గవర్నెన్స్ (పరిపాలన– సుపరిపాలన) భావనలు ఏర్పడ్డాయి.
⇒సుపరిపాలన– భావన: ప్రపంచీకరణ నేపథ్యంలో ఆవిర్భవించిన పరిపాలన భావనలు, అభివృద్థి చెందుతున్న దేశాల్లో చేపట్టిన సంస్కరణలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం సుపరిపాలన అంటే ఆరోగ్యవంతమైన అభివృద్ధి నిర్వహణ విధానం. దీనికి నాలుగు సూత్రాలను గుర్తించారు. అవి
⇒ప్రభుత్వ రంగ నిర్వహణ, జవాబుదారీతనం, అభివృద్ధికి అవసరమైన చట్టబద్ధమైన వ్యవస్థ; పారదర్శకత, సమాచారాన్ని అందుబాటులో ఉంచడం.
సుపరిపాలన – ప్రధాన లక్షణాలు
⇒ప్రజలందరికీ సమన్యాయం అందించడం.
⇒హేతుబద్ధత, ఆర్థిక పరిపుష్టితో కూడిన పారదర్శక నిర్ణయాలను ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయడం.
⇒మితిమీరిన జాప్యం, లంచగొండితనం నియంత్రించడానికి కఠినమైన వ్యవస్థాపన, శాసనపరమైన / చట్టపరమైన చర్యలు చేపట్టడం.
⇒సుపరిపాలన భవిష్యత్ సమాజ అవసరాలను తీర్చేదిగా ఉంటుంది. అవినీతిని తగ్గించేందుకు, అణగారిన, బలహీన, అల్పసంఖ్యాక వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.
భారతదేశంలో చేపట్టిన చర్యలు
⇒ సమాచార హక్కు చట్టం – 2005
⇒సివిల్ సర్వీసులు, ప్రభుత్వ సర్వీసుల్లో సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు, వేతన సంఘం సిఫార్సులు
⇒జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళికలు
⇒జామ్ –కార్యకలాపాల విస్తరణ, (జన్‌ధన్ యోజన బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డులు, మొబైల్ నంబర్ల అనుసంధానం).
⇒ఆర్థిక కార్యకలాపాలకు పాన్‌కార్డు(పర్మినెంట్ అకౌంట్ నంబర్) అనుసంధానం.
డా‘‘ ఎం.లక్ష్మణ్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కాలేజీ