వ్యవసాయ పట్టభద్రులకు.. అగ్రిసెట్ | Agricultural graduates .agriset | Sakshi
Sakshi News home page

వ్యవసాయ పట్టభద్రులకు.. అగ్రిసెట్

Published Wed, Jun 4 2014 11:09 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వ్యవసాయ పట్టభద్రులకు.. అగ్రిసెట్ - Sakshi

వ్యవసాయ పట్టభద్రులకు.. అగ్రిసెట్

దేశ ఆర్థికాభివృద్ధికి ఆధారం.. వ్యవసాయ రంగం. ఇప్పటికీ 70 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడిజీవనం సాగిస్తున్నారు.. ప్రభుత్వాలు కూడా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. సంబంధిత కార్యక్రమాలను చేపట్టడంతోపాటు అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రచిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను రైతులకు చేరువచేయడం లేదా ఆయా పరిశ్రమల్లో విధులు నిర్వహించడానికి అవసరమైన పట్టభద్రులను రూపొందించే కోర్సు.. బీఎస్సీ (అగ్రిక ల్చర్). 2014-15 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశానికి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు..
 
 ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నాలుగేళ్ల బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశానికి ప్రకటనను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష అగ్రిసెట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీలో డిప్లొమా అభ్యర్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత: డిప్లొమా (అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ) ఉత్తీర్ణత. 2013-14 విద్యా సంవత్సరంలో డిప్లొమాను పూర్తి చేసే విద్యార్థులు కూడా అర్హులే.మొత్తం సీట్ల సంఖ్య: 105. ఇందులో అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు: 95 సీట్లు, డిప్లొమా (సీడ్ టెక్నాలజీ): 10 సీట్లు కేటాయించారు.
 
 ప్రవేశం:
 రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు భాషలో ఉంటుంది. ప్రశ్నలను నూతనసిలబస్ ఆధారంగా ఇస్తారు. సమాధానాలను గుర్తించడానికి గంటన్నర సమయం (90 నిమిషాలు) ఉంటుంది. ప్రవేశ పరీక్షలోమొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ప్రశ్నాపత్రంలో 40 ఖాళీలను పూరించడం (ఫిలింగ్ ద బ్లాంక్స్), 60 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులోని ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 అవకాశాలు:
 ఎంసెట్ ద్వారా వచ్చిన విద్యార్థుల కంటే అగ్రిసెట్ ద్వారా వచ్చిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయి. వీరిని వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలైన వ్యవసాయ విస్తరణ అధికారులుగా(ఏఈవో), ప్రైవేట్ కంపెనీల్లో డ్రిప్ ఇరిగేషన్, సీడ్, ఫర్టిలైజర్ కంపెనీలలో ఉద్యోగావకాశాలతో పాటు రూరల్ డెవలప్‌మెంట్ విభాగాల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఏజీ బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులు భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్)లో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసి వర్సిటీలో శాస్త్రవేత్తలుగా ఉద్యోగావకాశాలు పొందొచ్చు. వర్సిటీ నిర్వహించే పీజీ సెట్‌కు కూడా వీరు అర్హులే.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 వయసు: 2014, డిసెంబర్ 31 నాటికి 17-22 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు-25 ఏళ్లు, పీహెచ్‌లకు 27 ఏళ్లు).ఫీజు: రూ. 300 (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌లకు రూ. 150). దీన్ని డీడీ రూపంలో చెల్లించాలి. డీడీని ‘కంప్ట్రోలర్, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం’ పేరిట హైదరాబాద్‌లో చెల్లుబాటయ్యేలా తీయాలి.రాత పరీక్షను కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్-రాజేంద్రనగర్, హైదరాబాద్ (తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థులకు), అగ్రికల్చర్ కాలేజ్-బాపట్ల, గుంటూరు (సీమాంధ్ర పాలిటెక్నిక్ విద్యార్థులకు)లలో నిర్వహిస్తారు. రాత పరీక్ష తేదీ: జూలై 6, 2014.దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లు, సొంత చిరునామా ఉన్న రెండు కవర్లను జత చేయాలి.
 
     దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 21, 2014.
     చిరునామా:    కన్వీనర్, అగ్రిసెట్-2014,
     డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్,
     కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్,
     హైదరాబాద్-500030.

 వివరాలకు:    www.angrau.ac.in
 -డాక్టర్ కాటం శ్రీధర్,
 న్యూస్‌లైన్, ఏజీ వర్సిటీ.
 
 అగ్రిసెట్-2014 నిర్వహణకు
 సంబంధించి అగ్రిసెట్ కన్వీనర్
 డాక్టర్ సునీల్‌కుమార్ బాబుతో ఇంటర్యూ...
 
 రెండు వేలకు పైగా:
 గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య రెండు వేలకు పైగా ఉండొచ్చు. అగ్రిసెట్ ద్వారా వచ్చే విద్యార్థులకు 105 సీట్లు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో 42:36:22 నిష్పత్తిలో సీట్లను భర్తీ చేస్తాం.
 
 కేంద్రాలు వేర్వేరు:
 ప్రస్తుతం రాష్ట్ర విభజనను దృష్టిలో పెట్టుకొని రెండు ప్రాంతాలకు వేర్వేరు కేంద్రాలను కేటాయించాం. ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, మరొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల వ్యవసాయ కళాశాల.
 
 43 పాలిటెక్నిక్‌లు:
 ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో మొత్తం 43 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ కళాశాలలు 23, ప్రైవేట్ కళాశాలలు 20 ఉన్నాయి. వీటిలో 5 సీడ్ టెక్నాలజీ కళాశాలలుండగా, అందులో రెండు ప్రభుత్వ, మూడు ప్రై వేట్ పరిధిలో నడుస్తున్నాయి.
 
 జూలై చివర్లో ఫలితాలు:
 హాల్‌టికెట్లను వర్సిటీ వెబ్‌సైట్ www.angrau.ac.inనుంచి పొందవచ్చు. జూలై చివరి వారంలో ఫలితాలను విడుదల చేస్తాం.
 
 ఎంసెట్ కంటే అధికం:
 ఎంసెట్ ద్వారా వచ్చిన విద్యార్థుల కంటే అగ్రిసెట్ ద్వారా వచ్చిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అధికం. వీరికి వ్యవసాయ శాఖలో ఏఈవో, ప్రై వేట్ కంపెనీలతో పాటు రూరల్ డెవలప్‌మెంట్ విభాగంల కూడా మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement