అమెరికా ముక్కలవుతుందా?!
అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న లిబరల్ డెమొక్రాట్లు ఆయనను తమ అధ్యక్షుడిగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుండీ ట్రంప్ ‘మా అధ్యక్షుడు’ కాదు అంటూ దేశ వ్యాప్తంగా ముఖ్యంగా నగరాల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నారుు. ట్రంప్ గెలిస్తే తాము అమెరికాను విడిచివెళతామని ఎంతో మంది ప్రముఖులు ఎన్నికలకు ముందే ప్రకటించారు. అరుుతే.. తాము వ్యక్తులుగా అమెరికాను వీడే ఆలోచన నుంచి రాష్ట్రాలుగానే అమెరికా నుంచి వేరుపడాలన్న నినాదాలు, ఉద్యమాలు ఇప్పుడు బలపడుతున్నారుు. ముఖ్యంగా అమెరికా పశ్చిమ తీరంలోని నాలుగు కీలక రాష్ట్రాలు కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్, నెవాడాలలో ఈ డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. అమెరికా నుంచి వేరుపడి, అలా వేరుపడే ఇతర భావసారూప్య రాష్ట్రాలతో కలిసి కొత్త దేశంగా అవతరించడమో లేక పొరుగునే ఉన్న కెనడాతో కలవడమో చేయాలన్నది వారి ఆలోచన. పశ్చిమ తీర రాష్ట్రాలు అమెరికాతో విడిపోరుు తమ దేశంతో కలవాలని కెనడా ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించటం కూడా ఊపందుకుంది.
బలపడుతున్న కాలెగ్జిట్ డిమాండ్...
ప్రస్తుత కాలిఫోర్నియా రాష్ట్రం 1846 కు ముందు మెక్సికోలో భాగంగా ఉండేది. ఆ ఏడాది అమెరికా, మెక్సికోల మధ్య యుద్ధం జరిగినపుడు.. కాలిఫోర్నియాలోని అమెరికన్ సెటిలర్లు ఆ రాష్ట్రాన్ని స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. కానీ.. నెల తిరగకుండానే అమెరికా నౌకాదళం ఆ రాష్ట్రంలో అమెరికా జెండాను ఎగురవేసి దానిని యూఎస్‌ఏలో భాగంగా ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తున్నారన్న సంకేతాలు వెలువడుతుండగానే.. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా కాలిఫోర్నియాలో తీవ్ర అలజడి మొదలైంది. ట్రంప్ అధ్యక్షతను తప్పించుకోవడానికి అమెరికా నుంచి కాలిఫోర్నియా విడిపోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, హైపర్‌లూప్ వన్ సహ వ్యవస్థాపకుడు షెర్విన్ పిషేవర్ ఈ నెల 9వ తేదీనే ప్రతిపాదించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన ‘బ్రెక్జిట్’ తరహాలో.. యూఎస్‌ఏ నుంచి కాలిఫోర్నియా వైదొలగాలంటూ.. ‘కాల్‌ఎగ్జిట్’కు సంబంధించిన ప్రక్రియపై 25 పేజీల పత్రాన్ని రూపొందించి విడుదల చేశారు. కాలిఫోర్నియా ప్రపంచంలోనే ఆరో ఆర్థికశక్తిగా అవతరించగలదని అందులో వివరించారు. చీజ్‌బర్గర్ వ్యవస్థాపకుడు బెన్ హహ్, డిజైన్ ఇంక్ సీఈఓ మార్క్ హెమియాన్, పాత్ వ్యవస్థాపకుడు డేవిడ్ మోరిన్ వంటి పలువురు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు ఆయనకు మద్దతుగానిలిచారు.
అదే బాటలో ఓరెగన్, వాషింగ్టన్, నెవాడా...
ఓరెగన్ వేర్పాటు చట్టాన్ని బ్యాలెట్‌లో చేర్చాలని జెన్నిఫర్ రోలిన్‌స, క్రిస్టియన్ ట్రెజ్‌బాల్‌లు గురువారం విజ్ఞాపన సమర్పించారు. ఓరెగన్ వాసులు విశ్వసించే విలువలు దేశంలోని ఇతరులు విశ్వసించే విలువలు ఒకే రకమైనవి కావని ఎన్నికల ఫలితాలు చూపుతున్నాయన్నది వారి వాదన. ‘‘సమానత్వమనే విలువ చాలా రాష్ట్రాలకు లేదు. అక్కడ మైనారిటీలు, రంగున్న వారు, వలసలు, ఎల్‌జీబీటీక్యూ సమాజం పట్ల వివక్ష ఉంది. ‘యూనియన్’ నుంచి విడిపోరుు కాలిఫోర్నియా, వాషింగ్టన్, నెవాడా వంటి ఇతర రాష్ట్రాలతో కలవడం ద్వారా ముందుకు సాగగలం. ఈ రాష్ట్రాలు అన్నీ ఏకమై ఉమ్మడిగా విశ్వసించే విలువలను నిలబెట్టే దేశంగా రూపొందవచ్చు’’ అని వారు పేర్కొన్నారు. ఈ బ్యాలెట్ రూపకల్పన ప్రక్రియ మొదలు పెట్టడానికి ఓరెగన్ వేర్పాటు చట్టానికి మద్దతుగా 1,000 సంతకాలు అవసరం. తమ స్వస్థలమైన పోర్ట్‌ల్యాండ్ నుంచి సంతకాల సేకరణ మొదలుపెడతామని రోలిన్‌స, ట్రెజ్‌బాల్‌లు చెప్పారు. ఇక వాషింగ్టన్, ఓరెగన్‌లలోనూ ఇదే తరహా వేర్పాటు ప్రయత్నాలు ఊపందుకుంటున్నారుు.
ప్రపంచంలో ఆరో ఆర్థిక శక్తి!?
కాలిఫోర్నియా స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీడీపీ) 2015లో 2.46 ట్రిలియన్ డాలర్లు. అదే ఏడాది ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక శక్తి అరుున ఫ్రాన్‌స జీడీపీ (2.42 ట్రిలియన్ డాలర్లు) కన్నా ఎక్కువ. ప్రపంచ బ్యాంకు గణాంకాలను బట్టి చూసినపుడు.. కాలిఫోర్నియా ఒక స్వతంత్ర దేశం అరుునట్లరుుతే అది ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక శక్తి అవుతుంది. ప్రస్తుతం ఆర్థికశక్తిగా ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్‌స ఏడో స్థానానికి, ఏడో స్థానంలో ఉన్న భారతదేశం ఎనిమిదో స్థానానికి చేరతారుు. హాలీవుడ్ సినిమాలు, స్మార్ట్‌ఫోన్ల తయారీ, సాఫ్ట్‌వేర్ రంగం,కార్ల భాగాల తయారీ, విమాన భాగాల తయారీ వంటి భారీ పరిశ్రమలతో పాటు.. పత్తి, బాదం, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల వరకూ కాలిఫోర్నియా ప్రధాన కేంద్రం.
ప్రజాభిప్రాయ సేకరణ బ్యాలెట్...
కాలిఫోర్నియా వేరుపడాలన్న డిమాండ్ కొంత కాలం ముందు నుంచే ఉంది. ‘సార్వభౌమ కాలిఫోర్నియా’ అనే పేరుతో లూయీ మారినెల్లి అనే ఉద్యమకారుడు ఒక ఉద్యమ సంస్థను నడుపుతున్నారు. గత ఏడాది సంస్థ పేరును ‘ఎస్ కాలిఫోర్నియా’గా మార్చారు. 2020 నవంబర్‌లోను, ఆ తర్వాత ప్రతి నాలుగేళ్లకోసారి కాలిఫోర్నియా స్వాతంత్య్రంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరుతూ మారినెల్లి 2015 లోనే రాష్ట్ర అటార్నీ జనరల్‌కు ఒక బ్యాలెట్ అంశాన్ని సమర్పించారు. 2018 మధ్యంతర (సెనేట్) ఎన్నికల్లో బ్యాలెట్ అంశాల్లో కాలిఫోర్నియా స్వాతంత్య్రం అంశాన్ని చేర్చనున్నారు.
వేర్పాటు సాధ్యమా?
అమెరికా చరిత్రలో భూభాగం వేర్పాటుకు సంబంధించి రెండు ప్రధాన ఘట్టాలు ఉన్నారుు.
► మొట్టమొదటిది.. అమెరికా కాలనీలు 1776 లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకోవడం. అప్పుడు.. బ్రిటన్ చట్టం ప్రకారం కాకుండా సార్వజనీన హక్కుల ప్రాతిపదికగా అమెరికా స్వాతంత్య్ర ప్రకటన చేశారు. అరుునా ఆచరణలో బ్రిటన్‌తో యుద్ధం చేసి అమెరికా కాలనీలు స్వాతంత్య్రం పొంది ఒక దేశంగా అవతరించారుు.
► రెండో ఘట్టం.. 1861లో బానిసత్వం రద్దును వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలు వేరుపడటం. ఈ పరిణామం అమెరికాలో సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో కాన్ఫెడరేట్‌గా ఏర్పడిన దక్షిణాది రాష్ట్రాలు ఓడిపోయారుు. వేర్పాటు సాధ్యం కాలేదు.
‘లెఫ్ట్ కోస్ట్’ విడిపోతే..?
అమెరికా పశ్చిమ తీరంలోని వాషింగ్టన్, ఓరెగన్, కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల్లో యూఎస్‌ఎ నుంచి వేరుపడాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పశ్చిమ తీరానికి - మధ్య పశ్చిమ, దక్షిణ దేశానికి మధ్య సైద్ధాంతిక విభేదాలు అమెరికా ఆవిర్భావం నుంచే ప్రబలంగా ఉన్నారుు. అబ్రహాం లింకన్ అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసినపుడు ఈ రెండు ప్రాంతాల మధ్య సుదీర్ఘ అతర్యుద్ధం సాగింది. పశ్చిమ తీరంలో స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. బానిసత్వం రద్దు వల్ల తీవ్రంగా నష్టపోయామన్న ఆగ్రహం, తెల్ల అమెరికన్ ఆధిక్య భావనలు మధ్య, దక్షిణ ప్రాంత అమెరికాల్లో అధికంగా ఉంటుంది. డెమొక్రాట్ పార్టీకి మూలస్తంభంగా నిలిచే ‘వెస్ట్ కోస్ట్’ను ‘లెఫ్ట్ కోస్ట్ (వామపక్ష తీరం) అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ తీర రాష్ట్రాలు విడిపోతే అమెరికా ఎలా ఉంటుందన్న అంచనాలూ, విశ్లేషణలూ, మ్యాపులూ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారుు. మరోవైపు.. పశ్చిమ తీరం వేరుపడితే.. తూర్పు తీరంలోని న్యూయార్క్, మసాచుసెట్స్, రోడ్ ఐలండ్, మేరీల్యాండ్ వంటి డెమొక్రటిక్ ప్రాబల్య రాష్ట్రాల్లో తాము ఏకాకులమవుతామన్న ఆందోళనా రేగుతోంది.