
ఏపీ ట్రిపుల్ ఐటీలు
♦ దరఖాస్తుల గడువు ఈనెల 8వ తేదీకి పొడిగింపు
♦ ఎంపిక జాబితా జూన్ 26న
♦ కౌన్సెలింగ్ జులై 5 నుంచి 9వ తేదీవరకు
♦ 4వేల సీట్లకు ఇప్పటివరకు 36,632 దరఖాస్తులు
వేంపల్లె: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
గతనెల 5వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా..
దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల (జూన్) 5వ తేదీ కాగా సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ఆలస్యం కావడంతో ఈనెల 8వ తేదీవరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు. ఆర్‌జీయూకేటీ ఏపీ పరిధిలో ఆర్‌కెవ్యాలీ ట్రిపుల్ ఐటీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ, నూజివీడు ట్రిపుల్ ఐటీ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి.
వీటిల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
పదో తరగతిలో మంచి జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఆరేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లపాటు ప్రీ యూనివర్సిటీ కోర్సు అంటే ఇంటర్మీడియెట్‌తో సమానమైన కోర్సులో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్‌సైన్సెస్ వంటివి బోధిస్తారు. ఈ కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ నాలుగేళ్లకు పేర్లను కేటాయించడం జరుగుతుంది.
ప్రవేశ విధానం
పదో తరగతి తత్సమాన పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే రెగ్యులర్ విద్యార్థిగా పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31.12.2017 నాటికి 18ఏళ్లు నిండి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 21ఏళ్లు నిండి ఉండకూడదు. పదవ తరగతిలో పాసైన జీపీఏ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి మండలానికి సంబంధించిన విద్యార్థులకు ఈ ట్రిపుల్ ఐటీల్లో అవకాశం కల్పించనున్నారు. మొత్తం 4 వేల సీట్లలో 85 శాతం సీట్లను లోకల్‌గానూ.. 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేస్తారు.
నాన్ రెసిడెన్షియల్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వెనుకబాటు కింద 0.4జీపీఏ అదనంగా కలుపుతారు. ఉదాహరణకు ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థికి 9.8జీపీఏ పాయింట్లు వస్తే.. 0.4జీపీఏ పాయింట్లు అదనంగా కలపడంతో 10.2జీపీఏగా మారిపోతుంది.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి ఈ అవకాశం కల్పిస్తూ వస్తున్నారు.
ఇంజనీరింగ్ కోర్సులివి
ట్రిపుల్ ఐటీలో మొత్తం 6 రకాల ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ), కెమికల్‌ఇంజనీరింగ్ (సీఈ), సివిల్ ఇంజనీరింగ్(ఇసీ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈఈఈ), మెటీరియల్స్ సైన్స్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ (ఎంఎంఈ), మెకానికల్ ఇంజనీరింగ్(ఎంఈ) కోర్సులు ఇక్కడ ఉన్నాయి.
ఈ ఏడాది పోటీ ఎక్కువే
ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలకు పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 2016–17 పదో తరగతి పరీక్షలకు 6,09,502 మంది హాజరయ్యారు. ఫలితాలు 91.92 శాతం వచ్చాయి. 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 10కి పది జీపీఏ పాయింట్లు సాధించిన వారు 18,225 మంది ఉన్నారు. వీరితోపాటు 10జీపీఏ కంటే తక్కువ వచ్చిన విద్యార్థులు కూడా ప్రవేశాలలో పోటీ ఉంటుంది. ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి సీట్ల చొప్పున 4వేల సీట్లకు పోటీ ఎక్కువగానే కనిపిస్తోంది.
సబ్జెక్టు మార్కులే ఆధారం
చాలామంది 10జీపీఏ పాయింట్లు సాధించామని అనుకున్నప్పటికి.. అభ్యర్థుల మధ్య పోటీ ఈ ఏడాది తీవ్రంగా ఉండటంతో సబ్జెక్టు మార్కులే కీలకంగా మారనున్నాయి. మొదట గణితంలోనూ ఎక్కువ జీపీఏ పాయింట్లు సాధించిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ కూడా సమానంగా ఉంటే ప్రాధాన్యత క్రమంగా సైన్స్, ఇంగ్లిష్, సోషల్, మొదటి లాంగ్వేజ్‌లలో వచ్చిన జీపీఏ పాయింట్లను పరిశీలిస్తారు. అవీ సమానమైతే పుట్టిన తేదీని బట్టి ఎవరి వయసు ఎక్కువైతే వారినే ఎంపిక చేస్తారు. అక్కడ సరిపోకుంటే తక్కువ హాల్ టిక్కెట్ నెంబర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. రిజర్వేషన్ నిబంధనలు అనుసరించి సీట్లు కేటాయిస్తారు.
ఉచితం కాదు.. ఫీజులు చెల్లించాల్సిందే
ట్రిపుల్ ఐటీల్లో ఉచిత విద్య అని చాలామంది అనుకుంటుంటారు.. కానీ ఇక్కడ కూడా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆరేళ్ల కాలంలో మొదటి రెండేళ్ల ఇంటర్ విద్యకు ఏడాదికి రూ.36 వేల చొప్పున, నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకుగానూ ఏడాదికి రూ.42 వేలు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. లక్ష రూపాయలల్లోపు సంవత్సర ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఇంత తక్కువ మొత్తంతో నాణ్యమైన విద్య, చక్కటి భోజన వసతి, హాస్టల్‌వసతి కల్పించడం ట్రిపుల్ ఐటీలకే సాధ్యం. ఇక ఉద్యోగస్తుల పిల్లలైతే స్థోమత లేని విద్యార్థులకు ఆయా బ్యాంకులలో రుణాలు ఇచ్చేవిధంగా అవకాశం కల్పిస్తున్నారు.
లోకల్..నాన్ లోకల్
ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాను లోకల్ జిల్లాలుగా పరిగణిస్తారు. మిగతా జిల్లాలు నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు లోకల్ కిందకు వస్తాయి.
గతేడాది కటాఫ్ జీపీఏ ఇలా..
2016–17 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కటాఫ్ జీపీఏ పాయింట్లు ఇలా ఉన్నాయి. ఇడుపులపాయ ఆర్‌కె వ్యాలీ ట్రిపుల్ ఐటీలో బీసీ–ఏ 10.1 జీపీఏ, బీసీ–బి 10.1 జీపీఏ, బీసీ–సి 9.7, బీసీ–డి 10, బీసీ–ఇ 10.1, ఓసీ 10.1, ఎస్సీ 9.9, ఎస్టీ 9.7 కటాఫ్ జీపీఏ పాయింట్లుగా ఉన్నాయి. అలాగే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి బీసీ–ఏ 9.9, బీసీ–బి 10, బీసీ–సి 9.7, బీసీ–డి 10, బీసీ–ఇ 9.9, ఓసీ 10, ఎస్సీ 9.8, ఎస్టీ 9.4 కటాఫ్ జీపీఏ పాయింట్లుగా ఉన్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీసీ– ఏ 10.1 జీపీఏ, బీసీ–బీ 10.1 జీపీఏ , బీసీ– సీ 10జీపీఏ, బీసీ–డీ 10.1 జీపీఏ , బీసీ– ఈ 10 జీపీఏ , ఓసీ 10.2 జీపీఏ, ఎస్సీ 10 జీపీఏ, ఎస్టీ 9.7 జీపీఏ కటాఫ్‌లుగా ఉన్నాయి.
పారదర్శకంగా ఎంపిక
ట్రిపుల్ ఐటీల సీట్ల ఎంపిక విధానంలో ఎలాంటి లోపాలు ఉండవు. అవినీతికి ఎలాంటి ఆస్కారం ఉండదు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ప్రతిభావంతులకు అడ్మిషన్ లభిస్తుంది.
– ఆచార్య భగవన్నారాయణ
(ట్రిపుల్ ఐటీ డైరెక్టర్),
ఇడుపులపాయ