గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా | Barack Obama Republic Day chief guest | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా

Published Wed, Jan 28 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా

 వార్తల్లో వ్యక్తులు
  విశ్వసుందరిగా పౌలీనా వేగా
 కొలంబియాకు చెందిన 22 ఏళ్ల పౌలీనా వేగా మిస్ యూనివర్స్ 2014గా ఎన్నికైంది. జనవరి 26న జరిగిన ఫైనల్స్ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 80 మందికిపైగా పోటీదారులను వెనక్కునెట్టి వేగా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో మిస్‌యూనివర్స్ 63 ఎడిషన్ పోటీలను నిర్వహించారు. భారత్‌కు చెందిన నయోనితా ఈ పోటీల్లో టాప్ టెన్‌లోకి అర్హత సాధించలేకపోయింది. ఈ పోటీల్లో రన్నరప్స్‌గా మిస్ అమెరికా నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కూషా, మిస్ జమైకా కాసి ఫెన్నెల్, మిస్ నెదర్లాండ్స్ యాస్మిన్ వర్హెజీన్‌లు నిలిచారు.
 
 ఐరాస శాంతిస్థాపన ప్యానెల్‌లో సరస్వతీ మీనన్
 ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్.. శాంతి స్థాపన కార్యక్రమాల సమీక్ష ప్యానల్‌లో భారత సామాజికవేత్త సరస్వతి మీనన్‌ను నియమించారు. ఈ నియామకం ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ప్యానెల్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ సలహా బృందం బురుండి, దక్షిణ సూడాన్ తదితర దేశాల్లో పర్యటించి, శాంతిస్థాపన చర్యలను సమీక్షిస్తుంది.
 
 ఆర్‌కే లక్ష్మణ్ కన్నుమూత
 ‘కామన్ మ్యాన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్(94) జనవరి 26న పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. 1921, అక్టోబరు 24న మైసూర్‌లో జన్మించారు. మైసూరు వర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేసి పేరు తెచ్చుకున్నారు. లక్ష్మణ్ 1951లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘యూ సెడ్ ఇట్’ శీర్షికతో కామన్ మ్యాన్ కార్టున్లు ప్రారంభించి యావత్ దేశాన్ని ఆకర్షించారు. లక్ష్మణ్ ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో ఆత్మకథ రాశారు. ‘హోటల్ రివేరా’ తదితర నవలలూ రచించారు. ‘మాల్గుడీ డేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్‌గా పని చేశారు. కళలు, సాహిత్యం, జర్నలిజంలో విశిష్ట కృషికి ఆయన పద్మవిభూషణ్, మెగసెసే తదితర విశిష్ట పురస్కారాలు అందుకున్నారు.
 
 అభిశంసనకు గురైన థాయిలాండ్ మాజీ ప్రధాని
 సైన్యం మద్దతు ఉన్న థాయిలాండ్ పార్లమెంటు నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (ఎన్‌ఎల్‌ఏ).. ఆ దేశ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను జనవరి 23న అభిశంసనకు గురిచేసింది. దీంతో ఆమెను రాజకీయాల నుంచి అయిదేళ్లు పాటు నిషేధించడానికి అవకాశం ఏర్పడిం ది. బియ్యం సబ్సిడీ పథకంలో అవినీతిని అరికట్టలేకపోయారన్న కారణంగా ఇంగ్లక్‌ను అభిశంసించారు.
 
 జాతీయం
 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా
 భారత 66వ గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సైనిక కవాతు, శకటాల ప్రదర్శన, వైమానిక విన్యాసాలను తిలకించారు. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇదే తొలిసారి. భారత్‌లో రెండోసారి పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఒబామాయే. దేశం కోసం ప్రాణాలర్పించిన నాయక్ నీరజ్‌కుమార్, మేజర్ ముకుంద్ వరదరాజన్‌లకు మరణానంతరం ప్రకటించిన అశోకచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
 
 స్మార్ట్‌సిటీల అభివృద్ధి ఒప్పందం
 విశాఖపట్నం(ఏపీ), అలహాబాద్(యూపీ), అజ్మీర్(రాజస్థాన్)లను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై ఆయా రాష్ట్రాలు, అమెరికా మధ్య జనవరి 25న అవగాహనా ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అమెరికా, భారత అధికారుల సమక్షంలో అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడీఏ) డెరైక్టర్ లియోకాడియా ఐజ్యాక్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరస్పరం విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన అవగాహనా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
 
 అణు ఒప్పందంపై అవగాహన
 అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు జనవరి 25న ఢిల్లీలో జరిపిన చర్చలు తెరదించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య హైదరాబాద్ హౌస్‌లో మూడు గంటల పాటు కొనసాగిన చర్చల్లో.. అణు ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపైనా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు.
 
 ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ను ప్రారంభించిన మోదీ
 బాలికాసంక్షేమం, లింగ వివక్ష అంతం లక్ష్యాలుగా ‘బేటీ బచా వో.. బేటీ పఢావో’(ఆడపిల్లల్ని కాపాడండి.. ఆడపిల్లల్ని చదివించడం)’ ప్రచార కార్యక్రమాన్ని హరియాణలోని పానిపట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’ను మోదీ ప్రారంభించారు. దీన్ని బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ(9.1%), ఆదాయపన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లో కానీ, పోస్టాఫీసుల్లో కానీ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేయొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలికకు వివాహం అయ్యేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకోవచ్చు.
 
 భారత మామిడిపై నిషేధం ఎత్తేసిన ఈయూ
 భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడి పండ్లపై నిషేధం ఎత్తేయాలని ఐరోపా యూనియన్ (ఈయూ) జనవరి 20న నిర్ణయించింది. ఈ పండ్లలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ 2014, మే 1 నుంచి 2015 డిసెంబర్ వరకు నిషేధం విధిస్తూ ఈయూ గతంలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ మామిడి మొక్కల సంరక్షణ వంటి వాటిలో గణనీయ పురోగతి సాధించినందున నిషేధం అవసరం లేదని ఈయూ భావించింది.
 
 జాతీయ వారసత్వ అభివృద్ధి పథకం
 దేశంలోని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ‘హృదయ్ (హెరిటేజ్ సిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్‌మెంటేషన్ యోజన)’ పథకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు జనవరి 21న ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, రాజస్థాన్‌లోని అజ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, మధుర, పంజాబ్‌లోని అమృత్‌సర్, గుజరాత్‌లోని ద్వారక, బీహార్‌లోని గయ, కర్ణాటకలోని బాదామి, ఒడిశాలోని పూరీ, తమిళనాడులోని కాంచీపురం, వేలాంగణి నగరాలను ఎంపిక చేశారు. ఇందులో వరంగల్ నగరానికి రూ. 40.54 కోట్లు, ఏపీలోని అమరావతికి రూ.22.26 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో నగరాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొల్పాల్సి ఉంటుంది. పర్యాటకులకు పూర్తిస్థాయి భద్రతకు చర్యలు తీసుకోవాలి.
 
 దేశంలో 2,226కు చేరిన పులుల సంఖ్య
 దేశంలో పులుల సంఖ్య 2014లో 2,226కు చేరినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ జనవరి 20న విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా-2014’ నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలోని పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లో ఉన్నాయి. 2010 నాటికి 1,706 ఉండగా, 30.5 శాతం వృద్ధితో 2014 నాటికి 2,226కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2010 లో 72 పులులు ఉండగా, 2014 నాటికి 68కి తగ్గింది.కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్‌కు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) అవార్డును జనవరి 20న ప్రకటించారు. రిజర్వ్ విస్తరణలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినందుకు ఈ అవార్డు దక్కింది.
 
 వృద్ధిలో చైనాను అధిగమించనున్న భారత్
 భారత వృద్ధిరేటు 2016లో 6.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) జనవరి 20న విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక నివేదికలో అంచనా వేసింది. ఇదే ఏడాది చైనా వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండొచ్చని తెలిపింది. భారత వృద్ధిరేటు 2014లో 5.8 శాతం (చైనా 7.4 శాతం) ఉండగా, 2015లో 6.3 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ముడిచమురు ధరల క్షీణత, పరిశ్రమల్లో పెట్టుబడులు పుంజుకోవడం వంటివి భారత్‌కు అనుకూల అంశాలని నివేదికలో పేర్కొన్నారు.
 
 పురస్కారాలు
 తొమ్మిది మందికి పద్మ విభూషణ్
 దేశంలో ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించింది. 9 మందికి పద్మ విభూషణ్, 20మందికి పద్మ భూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.పద్మ విభూషణ్: ఎల్‌కే అద్వానీ (రాజకీయాలు), అమితాబ్ బచ్చన్ (కళలు), ప్రకాశ్ సింగ్ బాదల్ (రాజకీయాలు), డాక్టర్ డి.వీరేంద్ర హెగ్గడే (సామాజిక సేవ), దిలీప్ కుమార్ (కళలు), స్వామి రామభద్రాచార్య(ఆధ్యాత్మికం), ప్రొఫెసర్ రామస్వామి శ్రీనివాసన్ (సైన్స్), కొట్టాయన్ వేణుగోపాల్ (రాజకీయాలు), అల్ హుస్సేనీ అగాఖాన్ (వాణిజ్యం).తెలుగువారికి పద్మశ్రీ అవార్డులు: మిథాలీ రాజ్ (క్రీడలు), పీవీ సింధు(క్రీడలు), డాక్టర్ మంజుల అనగాని (వైద్యం), కోట శ్రీనివాసరావు (కళలు). వైద్యులు నోరి దత్తాత్రేయుడు, పిళ్లరిశెట్టి రఘురామ్.
 
 అరుంధతీ సుబ్రహ్మణ్యంకు కుశ్వంత్‌సింగ్ అవార్డు
 ప్రముఖ రచయిత కుశ్వంత్‌సింగ్ స్మారక అవార్డుకు రచయిత్రి అరుంధతీ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన సాహితీ ఉత్సవాల్లో జనవరి 24న ఈ అవార్డును ప్రకటించారు. ఆమె రాసిన ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’కు పురస్కారం దక్కింది. తొలిసారిగా అందిస్తున్న ఈ అవార్డును ఇంగ్లిష్‌లో చేసిన రచనలకు, భారతీయ భాషల నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించే కవులకు అందజేస్తారు. రూ.2 లక్షల నగదును బహూకరిస్తారు.
 
 ఎన్‌ఎండీసీకు బంగారు నెమలి అవార్డు
 సామాజిక సేవలో మంచి పనితీరు కనపర్చినందుకుగాను 2014 సంవత్సరానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగంలో నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) బంగారు నెమలి అవార్డును గెలుచుకుంది.
 
 సీవీ ఆనంద్‌కు జాతీయ పురస్కారం
 సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) జాతీయ ప్రత్యేక అవార్డును జనవరి 21న ప్రకటించింది.    ఓటర్లను మభ్యపెట్టకుండా నగదు రవాణాను అడ్డుకోవడం, ఎన్నికల ప్రచారం, పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించినందుకు అవార్డును ప్రకటించారు.
 
 రాష్ట్రీయం
  తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి
 తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి జనవరి 25న తొలగించారు. ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రిగా నియమించి, విద్యాశాఖను అప్పగించారు. గవర్నర్ నరసింహన్.. శ్రీహరితో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు. లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారు.
 
 క్రీడలు
 సింగిల్స్ చాంప్స్‌గా సైనా, కశ్యప్
 సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. జనవరి 25న లక్నోలో జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)పై విజయం సాధించింది. 2009, 2014లోనూ సైనాకు ఈ టైటిల్ లభించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ కిడాంబి శ్రీకాంత్‌పై గెలిచాడు. 2012లోనూ కశ్యప్ ఈ టైటిల్ నెగ్గాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement