కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఉద్యోగ నియామక పరీక్షలను ఆన్‌లైన్లో విజయవంతంగా రాయాలంటే సన్నద్ధత ఎలా ఉండాలి? - వి.అనూష, రాజమండ్రి.
ఆన్‌లైన్ పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. తొలుత ఆయా పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాయాలి. మొత్తం సిలబస్ చదవడం పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి.
ఆన్‌లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా పరీక్ష విధానానికి అలవాటుపడటంతోపాటు టైం మేనేజ్‌మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి.
ఆన్‌లైన్ మాక్ పరీక్ష రాసిన తర్వాత పేపర్, ‘కీ’ని డౌన్‌లోడ్ చేసుకొని సమీక్షిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్టు నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
కొన్ని శిక్షణ సంస్థలకు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో బ్రాంచ్‌లుంటాయి. వీటిలోని అభ్యర్థులందరికీ ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నాయి. దీనివల్ల అభ్యర్థులు తమ స్థాయిని అంచనా వేసుకొని, తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు.
వాస్తవ ఆన్‌లైన్ పరీక్ష రాసేముందు సిస్టమ్‌కు సంబంధించి ఎలాంటి టెక్నికల్ సమస్యలున్నా వెంటనే పరీక్ష కేంద్రం సమన్వయకర్త దృష్టికి తీసుకెళ్లాలి.
చాలా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాశాం కాబట్టి, మళ్లీ వాస్తవ పరీక్ష సమయంలో నిబంధనలు (ఐట్టటఠఛ్టిజీౌట) చదవనవసరం లేదన్న భావనతో కొందరు నేరుగా పరీక్ష రాయడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తప్పనిసరిగా ముందు నిబంధనలన్నీ చదవాలి. తొలుత బాగా తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, ఒత్తిడికి తావులేకుండా మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.