ఉద్యోగ నియామక పరీక్షల కోసం భారతదేశ చరిత్ర విభాగానికి ఎలా సిద్ధమవ్వాలి?
– చంద్రశేఖర్, హైదరాబాద్.
భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి.. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ప్రాచీన చరిత్రలో భాగంగా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతియుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ.6వ శతా బ్దంలో ప్రచారంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు–వారి బోధనలు, సామాజిక మార్పులకు అవి ఏ విధంగా కారణమయ్యాయో విశ్లేషించుకోవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, ఆంధ్ర శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి.
ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి. కుషాణులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పల్లవులు, చోళులు, చాళుక్య రాజులు.. ఆర్థిక, సాంస్కృతిక రంగాలను ఏవిధంగా ప్రభావితం చేశారో తెలుసుకోవాలి. మధ్యయుగ చరిత్రలో సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్ల–మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టిసారించాలి.
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Tue, Jan 31 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
Advertisement