కాంపిటీటివ్ కౌన్సెలింగ్
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Wed, Nov 30 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
పోటీ పరీక్షల కోసం ఎకానమీకి సంబంధించిన అంశాలకు ఎలా సిద్ధమవాలి?
- ఆర్.రాజేంద్రప్రసాద్, హైదరాబాద్.
ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి ఎకానమీ సిలబస్‌లోని అంశాలను అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమిక భావనల (కాన్సెప్ట్స్) నుంచి ప్రారంభించాలి. దాంతోపాటు ఎకానమీలో విస్తృతంగా ఉపయోగించే వివిధ పదాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయం, వ్యష్టి-వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం వంటి ప్రాథమిక అంశాలు-వాటి నిర్వచనాలు తెలుసుకోవాలి.
మానవాభివృద్ధి, జనాభా స్థితిగతులు, వివిధ ప్రభుత్వ విధానాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంఘం, కేంద్ర బ్యాంకు విధులు, సుస్థిర వృద్ధి, సమ్మిళిత వృద్ధి, ప్రత్యక్ష-పరోక్ష పన్నులు, కరెంట్ అకౌంట్ లోటు, వాణిజ్య లోటు, ఉపాధి పథకాలు, ప్రణాళికల లక్ష్యాలు, బడ్జెటరీ ప్రక్రియలో వినియోగించే పదాలపై కనీస పరిజ్ఞానం అవసరం.
ప్రిపరేషన్‌లో గమనించాల్సిన మరో అంశం.. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సిలబస్‌లోని వివిధ అంశాలతో అన్వయిస్తూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, రుపాయి విలువ క్షీణత వంటి అంశాలకు సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని నోట్స్ రూపొందించుకోవాలి.
Advertisement