సామాజిక అంశాలు- సమకాలీన సన్నద్ధత | Contemporary social elements preparedness | Sakshi
Sakshi News home page

సామాజిక అంశాలు- సమకాలీన సన్నద్ధత

Published Wed, Sep 9 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

సామాజిక అంశాలు- సమకాలీన సన్నద్ధత

సామాజిక అంశాలు- సమకాలీన సన్నద్ధత

 వివిధ ఉద్యోగ నియామకాలకు టీఎస్‌పీఎస్సీ ఇటీవల నూతన సిలబస్‌ను విడుదల చేసింది. ఎప్పటి నుంచో
 ఆసక్తితో ఎదురు చూస్తున్న ఔత్సాహికులకు దీంతో స్పష్టత వచ్చింది. ఈ క్రమంలో గ్రూప్-1, గ్రూప్-2లోని
 భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన అంశాలకు సంబంధించి సిలబస్‌కు అనుగుణంగా
 ఎలా తయారుకావాలి? ఎలాంటి వ్యూహం అనుసరించాలి? వంటి వాటికి అవసరమైన సూచనలు
 అందించే ప్రయత్నమే ఈ వ్యాసం...

 
 కొత్త పరీక్ష విధానంలో గ్రూప్-1 పరీక్షల్లో పాలిటీ, సామాజిక అంశాలకు సంబంధించి 150 మార్కులకు ప్రత్యేకంగా ఒక పేపర్ (పేపర్-3)ను ప్రవేశపెట్టారు. ఈ అంశాలకు గ్రూప్-2లోని పేపర్-2లో 100 మార్కులు కేటాయించారు. సిలబస్ స్వభావాన్ని కూడా మార్చారు. రాజకీయ అంశాలతో పాటు సామాజిక అంశాలు, సమస్యలను ఇందులో చేర్చారు. గ్రూప్-2లోని పేపర్-2లో రెండు, మూడు సెక్షన్లలో పాలిటీ, సామాజిక అంశాలను పొందుపరిచారు. రెండో సెక్షన్‌లో సాధారణంగా అన్ని పోటీ పరీక్షల్లో ఉండే భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలనా అంశాలను యథాతథంగా కొనసాగించారు.
 
 రాజ్యాంగం-మౌలిక అంశాలు:
 రాజ్యాంగం అంటే ఏమిటి? రకాలు, లక్ష్యాలు, భారత రాజ్యాంగం చారిత్రక వికాసం- బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి.రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులను సమగ్రంగా చదివి, వాటికి సంబంధించిన తాజా పరిణామాలను, సుప్రీంకోర్టు తీర్పులను తెలుసుకోవాలి. ఈ విభాగంలో ప్రకరణలను విస్తృతంగా గుర్తుంచుకోవాలి. సమాఖ్య పద్ధతి- కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు, నిర్మాణం, అధికారాలు, విభజన సమస్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వాటి వివాదాలను అధ్యయనం చేయాలి.
 
 ప్రజాస్వామ్య వికేంద్రీకరణ- నూతన పంచయితీ వ్యవస్థ; 73, 74వ రాజ్యాంగ సవరణలు, అధికార బదలాయింపు సంబంధిత అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి.భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు, దిగువ కోర్టుల నిర్మాణం, న్యాయశాఖ క్రియాశీలత, న్యాయ ప్రవర్తన, తాజా వివాదాలను తెలుసుకోవాలి.ఎన్నికలు, ఎన్నికల సంఘం, ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల్లో అక్రమాలు-మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, రాజకీయ పార్టీలు, విధివిధానాలను విస్తృతంగా చదవాలి.సామాజిక న్యాయం, అణగారిన వర్గాలు, రాజ్యాంగ, చట్టపర రక్షణలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు, సదుపాయాలను తెలుసుకోవాలి.భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు... ముఖ్యంగా ఐక్యత, సమ్రగత, అవినీతి, మతతత్వం, కులతత్వం, తీవ్రవాదం, వ్యవస్థలు, రాజకీయ విలువల పతనం తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
 
 సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు:
 గత సిలబస్‌లోని సంక్షేమ యంత్రాంగం, సామాజిక న్యాయం అనే చాప్టర్ నుంచి చాలా అంశాలను యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త అంశాలను చేర్చారు.ముఖ్యంగా భారత సమాజ ముఖ్య లక్షణాలు, సామాజిక పరిణామాల్లోని కుటుంబం, వివాహం, బంధుత్వం, తెగలు, కులం, మతం వంటి అంశాలను పేర్కొన్నారు. వీటిని చదివే సమయంలో భారతీయ అంశాలకు పరిమితం కావాలి. సమాజ శాస్త్రంలో పాశ్చాత్య రచయితలు చెప్పిన నిర్వచనాలు, సాంకేతిక అంశాలను అధ్యయనం చేయనవసరం లేదు.
 సామాజిక సమస్యలైన కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, వరకట్నం, మహిళలపై హింస, బాలకార్మికుల సమస్య, మానవ అక్రమ రవాణా, పరువు హత్యలు వంటివి ముఖ్యమైనవి. వాటి చారిత్రక నేపథ్యం, కారణాలు, ప్రభుత్వ చర్యలు, పౌర సమాజం పాత్ర, వివిధ పరిమితులను క్షుణ్నంగా తెలుసుకోవాలి. సాంఘిక ఉద్యమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతాంగ పోరాటాలు, గిరిజన తిరుగుబాట్లు, దళిత, అణగారిన వర్గాల అస్తిత్వ ఉద్యమాలు, పర్యావరణ, మహిళా ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు వంటి అంశాలపై స్వాతంత్య్రానికి ముందు తర్వాత పరిణామాలను తెలుసుకోవాలి. ప్రభుత్వ విధానాలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి.తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకించి కొన్ని సామాజిక, ఆర్థిక సమస్యలున్నాయి. వెట్టి, జోగిని, దేవదాసీ, ఫ్లోరోసిస్, వలసలు, చేనేత కార్మికుల సమస్యలను తెలంగాణలోని ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలి.
 
 ప్రభుత్వ విధానాలు:
 ప్రభుత్వ అధికారిగా నియమితులయ్యే వారికి తన చుట్టూ ఉన్న సమాజం స్థితిగతులపై స్పష్టమైన అవగాహన, ఆయా వర్గాల ప్రజల పట్ల సామాజిక స్పృహ కలిగి ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్‌ను రూపొందించారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభివృద్ధికి, వికాసానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి.కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యన్నతి కోసం దాదాపు 200 పథకాలను అమలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఎన్డీయే ప్రభుత్వం చాలా కొత్త పథకాలను ప్రారంభించింది.బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు.. ముఖ్యంగా మిషన్ కాకతీయ, గ్రామజ్యోతి, గ్రామ ప్రగతి, హరితహారం, మన ఊరు-మన ప్రణాళిక, కల్యాణజ్యోతి, ఆసరా, సింగిల్ విండో పారిశ్రామిక విధానం, ఐటీ కారిడార్ తదితర అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి.
 
 ప్రిపరేషన్ మెలకువలు- జాగ్రత్తలు:
 ప్రతి పేపర్ సిలబస్‌ను సవివరంగా ఇచ్చారు. కాబట్టి ఏది చదవాలి? ఏది చదవకూడదు? అనే సందిగ్ధతకు ఆస్కారం లేదు.
 ఒక పేపర్‌లోని అంశాలకు, మరో పేపర్‌లోని అంశాలకు అంతర్గత సంబంధం ఉంది. ఉమ్మడి అంశాలను గుర్తించి, ప్రిపరేషన్ కొనసాగించాలి.
 సిలబస్ విస్తృతంగా, పరిధి ఎక్కువగా ఉందనే ఆలోచన అనవసరం. పోటీ పడుతున్న అభ్యర్థులందరికీ ఇదే పరిస్థితి ఉంటుందని గుర్తించాలి.
 మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకాన్నీ చదవద్దు. రచయిత, పోటీ పరీక్షల బోధన అనుభవం, పబ్లికేషన్ ప్రాధాన్యత ఆధారంగా పుస్తకాలను పరిశీలించండి.
 సిలబస్‌లోని ప్రతి అంశానికి తాజా పరిణామాలను జోడించి చదవాలి.

 ఫ్యాక్ట్స్‌ను గుర్తుంచుకునేందుకు ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి.
 రాజ్యాంగంలోని ప్రకరణలను కంఠతా చేయాల్సిన అవసరం లేదు. సందర్భానుసారం గుర్తుంచుకుంటే సరిపోతుంది.
 ఆత్మ విశ్వాసంతో ప్రారంభించాలి.. నిరంతరం శ్రమించాలి... ప్రిపరేషన్ విధానాన్ని సమీక్షించుకోవాలి.. తప్పులను సరిదిద్దుకొని, ఉత్సాహంతో ముందుకెళ్లాలి.. విజయం తథ్యం.
 
 సమాజ నిర్మితి, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు విభాగంలో మాదిరి ప్రశ్నలు
 
 1.    ఈ కింది వాటిలో ఏది భారత సామాజిక నిర్మితి కాదు?
     1) అంచెలతో కూడిన సామాజిక అసమానతలు
     2) పరాయీకరణ
     3) ఆసక్తి, అభిరుచి ఆధారిత వృత్తులు
     4) ఏవీకాదు
 2.    వివాహ వ్యవస్థకు సంబంధించి సరైన అంశం?
     1) వివాహం ఒక సాంస్కృతిక సంశ్లిష్టత
     2) విశ్వజనీన మానవ సమాజానికి ఆధారం
     3) ఒక రకమైన పరిచయం
     4) 1, 2
 3.    వరకట్న నిషేధ చట్టం సక్రమంగా అమలు కాకపోవటానికి కారణం?
     1) చట్టంలో స్పష్టత లేకపోవడం
     2) చట్టం పురుషుని అంతస్థును తగ్గిస్తుంది
     3) సామాజిక ఆమోదం లేకపోవడం
     4) పైవేవీ కాదు
 4.    కుటుంబం విశిష్ట లక్షణం కానిది?
     1) ప్రాథమిక యూనిట్
     2) సార్వజనీనమైనది
     3) సాంఘికీకరణ సాధనం
     4) పైవేవీ కాదు
 5.    {V>Ò$-×-నగర వలస పర్యావసానంగా ఏ ఫలితాలు కనిపిస్తాయి?
     1) తలసరి ఆదాయం పెరగటం
     2) జీవన ప్రమాణాలు కొంత మేరకు పెరగటం
     3) ఉద్యోగావకాశాలు పెరగటం
     4) పైవన్నీ
 6.    సమాన అవకాశాలు అందుబాటులో ఉండటం అంటే ఏమిటి?
     1) అందరికీ ఒకేరకమైన ఆదాయం ఉండటం
     2) సమాన పనికి సమాన వేతనం
     3) సమాన ప్రతిభ, అర్హతలు ఉన్నవారిపై వివక్ష చూపించకపోవటం
     4) అందరికీ ఉపాధి కల్పించటం
 7.    సామాజిక ఉద్యమాలు అనేవి?
     1) సమష్టి చర్య    2) సంఘర్షణారూపం
     3) వైయక్తిక ప్రవర్తనా రూపం
     4) ధిక్కార స్వభావ రూపం
 8.    తెలంగాణ రైతాంగ ఉద్యమం గురించి కింది వాటిలో సరైంది?
     1) భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, నిజాంకు వ్యతిరేకంగా జరిగింది
     2) పేద రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు మొదటి నుంచి చివరి వరకు పాల్గొన్నారు
     3) గొరిల్లా పద్ధతిలో జరిగిన అతిపెద్ద పోరాటం
     4) అన్నీ సరైనవే
 9.    కింది వాటిలో సరిగా జతపరచనిది?
     1) శరద్‌జోషి - షేట్కారీ సంఘటన్
     2) భారతీయ కిసాన్ యూనియన్ - మహేందర్‌సింగ్ తికాయిత్
     3) ఆచార్య ఎన్జీరంగా - అఖిల భారత కిసాన్ సభ
     4) కర్ణాటక కిసాన్ సభ - ప్రొఫెసర్ నంజుండప్ప
 10.    షెడ్యూల్డ్ తెగలను గుర్తించటానికి ప్రాతిపదిక కానిది?
     1) ఆర్థిన వెనుకబాటు    2) భౌగోళిక ఐసోలేషన్
     3) ప్రత్యేక లక్షణాలు    4) లిపిలేని భాష
 11.    ఒక వ్యక్తి జీవితంలో వివిధ వివక్షతలు వివిధ దశల్లో ప్రవేశిస్తాయి. ఏ వివక్షత మాత్రం పుట్టుక ముందే ప్రవేశిస్తుంది?
     1) కుల వివక్షత     2) లింగ వివక్షత
     3) మత వివక్షత    4) ఏవీకాదు
 12.     బాల కార్మిక వ్యవస్థకు కారణం?
     1) పేదరికం    2) అధిక సంతానం
     3) సామాజిక ఆమోదం    4) పైవన్నీ
 13.    సమకాలీన సమాజంలో సామాజిక సంఘర్షణలు తలెత్తటానికి కారణం?
     1) వైయక్తికవాదం    2) సామాజిక ఆమోదం
     3) పరిణిత ప్రవర్తన లేకపోవటం
     4) పైవన్నీ
 14.    {V>Ð]l$-gZÅతి కార్యక్రమానికి సంబంధించి సరైన అంశం?
     1) మన ఊరు - మన ప్రణాళిక కార్యక్రమానికి కొనసాగింపు
     2) గ్రామ పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించి, వాటిని బలోపేతం చేయటం
     3) విధులు, నిధులు పరమైన వివిధ అంశాలను సమ్మిళితం చేసి, అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయటం
     4) పైవన్నీ సరైనవే
 15.    రక్షిత వివక్షత, వితరణ న్యాయానికి రాజ్యాంగంలోని స్థానం?
     1) ప్రత్యక్షంగా ఉంది
     2) పరోక్షంగా ఉంది
     3) సందర్భానుసారంగా ఉంది
     4) ఎలాంటి ప్రస్తావనా లేదు
 
 సమాధానాలు
 1) 3    2) 4    3) 3    4) 4    5) 4
 6) 3    7) 1    8) 4    9) 4    10) 4
 11) 2    12) 4    13) 4    14) 4    15) 1
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement