ఆన్‌లైన్ జాబ్ అప్లికేషన్స్.. తప్పులను సరిదిద్దుకోండిలా! | Correction mistakes of Online Job Applications | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ జాబ్ అప్లికేషన్స్.. తప్పులను సరిదిద్దుకోండిలా!

Published Tue, Jul 15 2014 11:06 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

ఆన్‌లైన్ జాబ్ అప్లికేషన్స్.. తప్పులను సరిదిద్దుకోండిలా! - Sakshi

ఆన్‌లైన్ జాబ్ అప్లికేషన్స్.. తప్పులను సరిదిద్దుకోండిలా!

టాప్ స్టోరీ: రోజూ వార్తాపత్రికల్లో, వెబ్‌సైట్లలో అనేక ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, మీడియా, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొలువుదీరిన  హైదరాబాద్ వంటి సిటీలో.. ఉద్యోగాలకు కొదవలేదు. అయినా ఆన్‌లైన్‌లో ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా.. కంపెనీల నుంచి స్పందన ఉండటం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు రిప్లై రావాలంటే.. వెంటనే వ్యూహం మార్చాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల విషయంలో అభ్యర్థులు సాధారణంగా ఏడు పొరపాట్లు చేస్తుంటారని చెబుతున్నారు. వీటిని సరిదిద్దుకుంటే కోరుకున్న ఉద్యోగం సంపాదించడం కష్టమేమీ కాదని సూచిస్తున్నారు.
 
దరఖాస్తు.. అసంపూర్ణం
 పూర్తి సమాచారం లేకుండా దరఖాస్తును పంపి, రిక్రూటర్స్‌కు శ్రమ కలిగిస్తే ఫలితం సున్నా. రోజూ వందలాది దరఖాస్తులను పరిశీలించేవారి సమయాన్ని హరించొద్దు.  పూర్తి వివరాలు ఉన్న అప్లికేషన్లను చూసేందుకు వారు ఇష్టపడతారు. ముందు జాబ్ బోర్డులో మీ వివరాలు నమోదు చేయాలి. తర్వాత రెజ్యుమెను, కవర్ లెటర్‌ను అప్‌లోడ్ చేయాలి. విద్యార్హతలు, ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ, గతంలో పనిచేసిన సంస్థ, పని అనుభవం, వ్యక్తిగత వివరాలను వరుస క్రమంలో ఇవ్వాలి. అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏమిటంటే.. ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు తెలియజేయకపోవడం.
 
  సంస్థ కోరుకుంటున్న అన్ని అర్హతలు మీకుంటే.. మిమ్మల్ని సంప్రదిం చేందుకు వీలుండాలి కదా!  కొందరు అభ్యర్థులు తాము కోరినంత జీతభత్యాలు ఇవ్వాలని, ఫలానా ప్రాంతంలోనే పని చేస్తామని షరతులు విధిస్తుంటారు.  ఇవి దరఖాస్తులో తెలియజేయాల్సిన విషయాలు కావు. వేతనం అంకె దరఖాస్తులో కనిపిస్తే యాజమాన్యాలకు నచ్చకపోవచ్చు. తాము ఇవ్వాలనుకుంటున్న వేతనం కంటే ఎక్కువ మొత్తం దరఖాస్తులో కనిపిస్తే దాన్ని పక్కనపెట్టేస్తారు. సంస్థ మిమ్మల్ని సంప్రదించినప్పుడు మాత్రమే వీటిని ప్రస్తావించాలి.  
 
 సూచనలు పాటించకపోవడం
 సంస్థలు ఉద్యోగ ప్రకటనలో కొన్ని సూచనలను ఇస్తుంటాయి. అభ్యర్థులు వాటిని తప్పనిసరిగా పాటించాలి. ఫోన్ ద్వారా తమను సంప్రదించాల్సిన అవసరం లేదు అని అంటే.. దానికి కట్టుబడి ఉండడమే ఉత్తమం. ఆన్‌లైన్‌లో మీ రెజ్యుమె సరైన సమాచారంతో, సరైన సమయానికి, సరైన వ్యక్తికి చేరగానే సరిపోదు.. మీరు సంస్థ సూచనలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడే కోరుకున్న కొలువును దక్కించుకోగలుగుతారు.
 
 ఒకే రెజ్యుమె అన్నింటికీ సరిపోదు
 కొందరు అభ్యర్థులు ఒకే రెజ్యుమెను రూపొందించుకొని, అన్ని సంస్థలకు దాన్నే గ్రూప్ ఈ-మెయిల్స్ ద్వారా ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. మొదట ఉద్యోగం గురించి అవగాహన పెంచుకోవాలి. వీటి ఆధారంగా రెజ్యుమెను తయారు చేసుకోవాలి. ఆ ఉద్యోగానికి మీరు సరిగ్గా సరిపోతారనే భావం రెజ్యుమే ద్వారా వెల్లడి కావాలి. తద్వారా మీకు ఉద్యోగంపై తగిన ఆసక్తి, ఇష్టం ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అప్పుడే రిక్రూటర్స్‌కు మీపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. దరఖాస్తు త్వరగా ముందుకు కదులుతుంది. కొన్నిసార్లు సంస్థల తరఫున ప్లేస్‌మెంట్ ఏజెన్సీలు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. అవి సంస్థ పేరును, వివరాలను బయటపెట్టవు. అలాంటప్పుడు ఉద్యోగంపై సమాచారం కోసం సదరు ఏజెన్సీని సంప్రదిస్తూ ఉండాలి.
 
 తొందరపాటు వద్దు
 మిగిలినవారి కంటే ముందే దరఖాస్తు చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చేస్తుందని అనుకోవద్దు. తొందరపాటు కారణంగా దరఖాస్తులో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. రెజ్యుమే, కవర్ లెటర్‌ను జతచేయడం మర్చిపోవద్దు. సరైన ఫార్మాట్‌లో లేని రెజ్యుమెలను పంపకూడదు. దరఖాస్తు పంపేముందు అన్నీ ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా సరిచూసుకున్న తర్వాతే పంపించాలి. రిక్రూటర్స్ దరఖాస్తులోని అంశాలనే పరిశీలిస్తారు తప్ప దాన్ని ఎప్పుడు పంపారనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వరు.
 
 అనవసర ఆర్భాటం
 రిక్రూటర్స్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు విషయంలో ఆర్భాటం చేయొద్దు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండకపోగా, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని గ్రహించాలి. కొందరు దరఖాస్తులకు రంగులు, హంగులు జోడిస్తుంటారు. అక్షరాల ఆకృతి, పరిమాణం(ఫాంట్) గురించి పట్టించుకోరు. ఇలాంటి అప్లికేషన్లు చూడటానికి ఇంపుగా ఉండవు. కాబట్టి అతిశయం వదులుకోవడం మంచిది. సాధారణ ఫార్మాట్‌లోనే దరఖాస్తును పంపాలి. ఇంకొందరైతే వ్యక్తిగత అభ్యర్థనలు, విజ్ఞప్తులను జతచేస్తారు. వీటివల్ల అభ్యర్థిపై రిక్రూటర్స్‌కు చిన్నచూపు ఏర్పడుతుందని తెలుకోండి. ఒక్కో దరఖాస్తును పరిశీలించేందుకు రిక్రూటర్స్ వెచ్చించే సమయం కొన్ని సెకన్లు మాత్రమే. అంత తక్కువ సమయంలో మీ గురించి తెలిపేలా దరఖాస్తును రూపొందించుకోవాలి.
 
 ఫాలోఅప్ చేయకపోవడం
 ఆన్‌లైన్‌లో దరఖాస్తును పంపగానే సరిపోదు. అది ఏ దశలో ఉందో తెలుసుకుంటూ ఉండాలి. అప్లికేషన్‌ను పంపిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లోగా రిక్రూటర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే.. ఒకసారి ఫాలోఅప్ చేయాలి. సంస్థను నేరుగా సంప్రదించాలి. అంతేతప్ప రోజూ ఈ-మెయిళ్లు పంపడం, ఫోన్లు చేయడం లాంటివి చేయొద్దు. మీ దరఖాస్తు అందినట్లు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వేరే జాబ్ పోర్టల్/ప్లేస్‌మెంట్ కన్సల్టెన్సీ ద్వారా దరఖాస్తును మరోసారి పంపడానికి ప్రయత్నించండి.
 
 పాత కొలువును వదులుకోవడం
 మబ్బును చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకోవడం తెలివైన లక్షణం కాదు. కొత్త ఉద్యోగం వస్తుందో రాదో తెలియకముందే పాత జాబ్‌కు రాజీనామా చేయొద్దు. కొత్త కొలువు వేట గురించి ప్రస్తుతం మీరు పనిచేస్తున్న సంస్థకు తెలియనివ్వకపోవడమే అన్నివిధాలా మంచిది. మరో విషయం.. పాత సంస్థ నుంచే కొత్త సంస్థను సంప్రదించడం, దరఖాస్తు పంపడం వంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు. ఇలాంటివి చేస్తే యాజమాన్యానికి వెంటనే తెలిసిపోయేలా ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఆఫీసు బయటే చేసుకోవాలి. కొత్త కొలువు ఖాయమైన తర్వాతే రాజీనామా విషయాన్ని పాత సంస్థకు తెలియజేయాలి.
 
 ఆన్‌లైన్ అప్లికేషన్ పంపేటప్పుడు పాటించాల్సినవి..
 *    ఉద్యోగ ప్రకటనలో ఇచ్చిన సూచనలను పాటించాలి
*    రిక్రూటర్స్ కోరిన సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి.
*    దరఖాస్తులో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. అప్లికేషన్‌ను పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే పంపించాలి.
*    రిక్రూటర్స్ సంప్రదించేందుకు వీలుగా ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి కాంటాక్ట్ సమాచారాన్ని దరఖాస్తులో పొందుపరచాలి.
అప్లికేషన్‌తో కవర్ లెటర్‌ను జతచేయాలి.
రెజ్యుమేను కూడా తప్పనిసరిగా జోడించాలి.
* ఇప్పటిదాకా పనిచేసిన పాత సంస్థల్లో మీరు నిర్వహించిన విధులు, నిర్వర్తించిన బాధ్యతలు కాదు.. సాధించిన విజయాలను రెజ్యుమేలో పొందుపర్చాలి.
ఎక్కువ పేజీలున్న రెజ్యుమేకు ఎక్కువ విలువ ఉంటుందనుకోవద్దు. అందులో పొందుపర్చిన అంశాలకే విలువ ఉంటుంది కానీ పేజీలకు కాదు.
 
అడ్డంకులను అధిగమించండి!
 ‘‘ఉద్యోగార్థులు రెజ్యుమె పంపడం దగ్గర్నుంచి ఆఫర్ లెటర్ అందుకునే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొందరు అభ్యర్థులు పేజీల కొద్దీ రెజ్యుమెను తయారు చేసి పంపుతుంటారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఫ్రెషర్స్ అయితే ఒక్క పేజీలోనే తమ పూర్తి వివరాలతో కూడిన రెజ్యుమెను రూపొందించడం ప్రధానం. తప్పనిసరి పరిస్థితుల్లో పేజీన్నరకు మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రెషర్స్ నుంచి కంపెనీలు అకడమిక్ అర్హతలు, ప్రాజెక్టులు, ఇతర ప్రత్యేక నైపుణ్యాలనే కోరుకుంటాయి. అందుకే సాధ్యమైనంత తక్కువ సైజులో ఉండడం మంచిది. ముందుగానే అన్ని వివరాలతో కూడిన మాస్టర్ రెజ్యుమెను రూపొందించుకుని.. దాని ఆధారంగా ఉద్యోగ సంబంధిత అంశాలకే ప్రాధాన్యమిస్తూ మరో రెజ్యుమె తయారు చేసుకోవాలి.  
 
రెజ్యుమెలో రాసిన పదాల అర్థాలు తెలియక ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడేవారూ ఉంటారు. అందుకే రెజ్యుమెలో రాసే ప్రతి అంశంపై శ్రద్ధ ఉంచాలి. చాలామంది అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను నిర్లక్ష్యం చేస్తారు. అభ్యర్థుల వ్యక్తిగత నైపుణ్యాలతో పాటు సోషల్  మీడియా అంశాలను కూడా కంపెనీలు పరిశీలిస్తాయి. కాబట్టి అభ్యర్థులు తమ ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ తదితర సోషల్ ప్రొఫైల్, ప్రవర్తన, కామెంట్లు, చర్చలపైనా సమతుల్యాన్ని పాటించాలి’’
 - జి.ఆర్. రెడ్డి,  ఫౌండర్ అండ్ చీఫ్ ఫెసిలిటేటర్,
 హ్యుసిస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement