పీజీ ప్రవేశాలకు కామన్ నోటిఫికేషన్ లేనట్లే!
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించినా.. అందుకు వర్సిటీ లు సానుకూలంగా స్పందించడం లేదు. విద్యార్థులు ఒకే సబ్జెక్టుకు 2 వర్సిటీలు నిర్వహించే పరీక్షలకు ఫీజులు చెల్లిం చి, పరీక్షలు రాసేందుకు పడే ఇబ్బందులను తొలగించేందుకు ఈ చర్యలు చేపట్టినా అమలుకు నోచుకోలేని స్థితి నెలకొంది. వర్సిటీలకు ఫీజుల రూపంలో వచ్చే డబ్బుతోనే హాస్టళ్ల నిర్వహణ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే వచ్చే డబ్బు రాకుండా పోతుందన్న వాదన వర్సిటీ వర్గాల్లో నెలకొంది. దీంతో 2017–18 విద్యాసంవత్సరంలో అన్ని సబ్జెక్టులకు ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు వేర్వేరుగానే పీజీ ప్రవేశాలకు పరీక్షలను నిర్వ హించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది.
ప్రత్యేక అధికారి నేతృత్వంలో డిగ్రీ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రవేశాలు చేపట్టినా.. అనేక సమస్యలు తలెత్తడం, విద్యార్థులు సీట్లను కోల్పోయి నష్టపోయిన నేపథ్యంలో మండలి ఆధ్వర్యంలో ప్రవేశాలను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు మండలి సిద్ధమవుతోంది. ఉన్నత విద్యా మండలికి చెందిన వైస్ చైర్మన్లు ఇద్దరిలో ఎవరికైనా ఈ బాధ్యతలను అప్పగించి, ప్రత్యేక అధికారి నేతృత్వంలోనే ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
రేపు పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: పీఆర్‌టీయూ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కె.జనార్దన్‌రెడ్డి ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పీఆర్ టీయూ వెల్లడించింది. మరోవైపు జనార్దన్‌రెడ్డికి రాష్ట్రీయ పండిత పరిషత్తు మద్దతు ప్రకటిస్తూ గురువారం పీఆర్‌టీయూ కార్యాలయంలో లేఖను అందజేసింది.
ఎడ్యుకేషన్ న్యూస్
Published Fri, Feb 17 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
Advertisement