జనరల్ సైన్స్
జంతువులు-ప్రయోజనాలు
మనిషి పరిణామం, నాగరికత అభివృద్ధిలో జంతువుల పాత్ర చాలా కీలకమైంది. ప్రారంభంలో మనిషికి కేవలం ఆహార వనరులుగానే జంతువులు ఉపయో గపడ్డాయి. అయితే, వాటి ఇతర అవసరాలను గుర్తించిన మనిషి జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు. వ్యవసాయ ఆవిర్భావానికి ముందు మనిషి ఆహా రం కోసం.. వేట, సేకరణపైనే ఆధారపడేవాడు. జంతువులను మచ్చిక చేసుకోవడంతో వ్యవసాయం సాధ్యమైంది. ఆహార, శ్రామిక వనరులుగా జంతువుల వినియోగం పెరిగింది. క్రమంగా తోలు, ఉన్ని, పట్టు, ఔషధాలు వంటి ఉత్పత్తుల ప్రాధాన్యత పెరిగేకొద్ది వాటిని అందించే జంతువుల పెంపకం వృద్ధి చెందింది. ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధికి కూడా జంతువులు దోహదపడ్డాయి. పౌల్ట్రీ, పిగ్గరీ, పిసికల్చర్, సెరికల్చర్, ఎపికల్చర్, డెయిరీ, ప్రాన్‌కల్చర్ వంటి రంగాల ప్రాముఖ్యత పెరిగింది.
ఆహార వనరులుగా: జంతువుల నుంచి మాంసం, పాలు, గుడ్ల రూపంలో ఆహారం లభిస్తుంది. జంతు మాంసంలో ప్రొటీన్లు ఎక్కువగా లభిస్తాయి. మొక్కల ఆహారంతో పోలిస్తే జంతు ఆహార ప్రొటీన్లలో ఆవశ్యక అమైనో ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి. జంతు ఆహారంలోని కొవ్వు పదార్థాలు పరిమిత మోతాదులో మనిషి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ బి-12 కేవలం జంతు ఆహారంలో మాత్రమే లభిస్తుంది. చేపల మాంసంలో గుండె పనితీరును మెరుగుపర్చే అనేక అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా లభిస్తాయి. కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువులు, చేపలు, రొయ్యలు, లాబ్‌స్టర్, ష్రింప్‌లు, బాతులు.. ఇంకా అనేక రకాల పక్షులు, కొన్ని రకాల కీటకాలు మనిషికి ఆహార వనరులుగా ఉపయోగపడుతున్నాయి. ఎలుకలు, కుక్కలు, వన్య జంతువులు, తిమింగలాలు, డాల్ఫిన్‌లు, ఒంటె, గాడిదలను కూడా మనిషి ఆహార వనరులుగా ఉపయోగిస్తున్నాడు. పశువులు, మేకలు, ఒంటె వంటి జంతువుల నుంచి పాలు లభిస్తాయి. పిల్లల పెరుగుదలకు పాలు చాలా అవసరం. ఇందులో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. పాల నుంచి నెయ్యి, వెన్న, పెరుగు ఇతర ద్వితీయ ఉత్పత్తులు తయారవుతాయి. గుడ్లలో కూడా ప్రొటీన్లు, కొవ్వు సమతుల్యతలో లభిస్తాయి. కోళ్లు, బాతులు, ఆస్ట్రిచ్, ఇతర పక్షుల నుంచి గుడ్లు లభిస్తాయి.
శ్రామిక అవసరాలకు.. : అనేక జంతువులను బరువు లాగడానికి, బరువు మోయడానికి మనిషి వినియోగిస్తున్నాడు. వీటిలో ముఖ్యమైనవి ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, ఒంటెలు, కుక్కలు. ఎద్దులను ప్రధానంగా వ్యవసాయంలో భూమి దున్నేందుకు, బండ్లు లాగడానికి ఉపయోగిస్తున్నారు. గుర్రాలు, ఏనుగులు ఒకప్పుడు యుద్ధాల్లో ఉపయోగపడేవి. ఇప్పటికీ గుర్రాలు సైనికులకు సాయపడుతూనే ఉన్నాయి. గుర్రాలను క్రీడల్లో కూడా ఉపయోగిస్తున్నారు.
తోలు వనరులుగా.. : జంతువుల చర్మంలోని అంతశ్చరం నుంచి తోలు లభిస్తుంది. దేశంలో దాదాపు 87 శాతం తోలు మృత పశువుల నుంచి, మిగతా 13 శాతం వధించిన జంతువుల నుంచి లభిస్తోంది. ఆవుల నుంచి లభించే తోలును కిప్స్ అని, గేదెల నుంచి లభించే తోలును బఫ్స్ అని అంటారు. బెల్టులు, పర్సులు, బ్యాగులు, జాకెట్లు, బూట్ల తయారీలో తోలును విరివిగా ఉపయోగిస్తారు. అదనంగా సర్పాలు, మొసళ్ల నుంచి కూడా తోలు లభ్యమవుతోంది.
ఉన్ని వనరులుగా: గొర్రెల చర్మంపై దట్టంగా ఉండే మృదువైన, గరుకైన రోమాలను ఉన్ని అంటారు. జూరియ, బికనేరీ, కాశ్మీరీ, రాజ్‌పుఠానా వంటివి ఉన్ని రకాలు. పష్మిన అనే మేక నుంచి కూడా ప్రత్యేకంగా ఉన్ని లభిస్తుంది. దీన్ని పష్మిన శాలువల తయారీలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.
పట్టు: పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. క్రీస్తు పూర్వం 2679 నాటికే చైనాలో పట్టు ఉత్పత్తి ప్రారంభమైంది. క్రీ.శ. 555 వరకూ బయటి ప్రపంచానికి పట్టు తయారీ విధానం తెలియకుండా చైనీయులు జాగ్రత్త వహించి, పట్టు ఉత్పాదనలో తమ ఆధిక్యతను చాటుకున్నారు. పట్టు పురుగుల జీవిత చక్రంలోని కకూన్ దశ నుంచి పట్టు లభిస్తుంది. పట్టులో సెరిసిన్, ఫైబ్రోయిన్ అనే రెండు ప్రొటీన్లు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అధిక పెంపకంలో ఉన్న పట్టు పురుగు - చైనీస్ పట్టు పురుగు లేదా మల్బరీ పట్టు పురుగు.
లక్క: లక్కపురుగు భారీ చెట్ల కొమ్మలపై గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చే పిల్లలు తమ చుట్టూ రక్షణ కోసం రెజిన్ అనే పదార్థాన్ని స్రవిస్తాయి. పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ నుంచి ఎగిరిపోతాయి. ఆ తర్వాత కొమ్మలపై ఉన్న రెజిన్‌ను సేకరించి శుద్ధి చేసినపుడు లక్క లభిస్తుంది. దీన్ని బొమ్మలు, కాస్మెటిక్స్, పెయింట్స్, వార్నిష్‌ల తయారీలో, తపాలా, ప్రభుత్వ కార్యాలయాల్లో సీలు వేయడానికి ఉపయోగిస్తారు.
ఔషధ వనరులుగా జంతువులు: అనేక జంతువులు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. సర్పం విషంలోని ప్రొటీన్లు... మంచి నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. నాగుపాము విషం కోబ్రడిన్‌ను.. క్షయ, పక్షవాతం, కీళ్లవాపు చికిత్సలో తక్కువ మోతాదులో వినియోగిస్తారు. కోబ్రడిన్ నుంచి తయారయ్యే కోబ్రాక్సిన్ అనే ద్రావణాన్ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. సర్పాల విషాన్ని.. విరుగుడు (యాంటీవీనమ్) తయారీలో ఉపయోగిస్తారు. తేళ్ల విషాన్ని ప్రత్యేకంగా కీళ్ల వాపు చికిత్సలో వాడతారు. నెమలి పైత్యరసాన్ని, తేనెను రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు. జలగ లాలాజలం నుంచి లభించే హిరుడిన్ అనే రక్తస్కంధన నివారిణిని శస్త్ర చికిత్సలో ఉపయోగిస్తారు. శంఖాల నుంచి సంగ్రహించే పదార్థాన్ని అజీర్తి, మొలల చికిత్సలో ఉపయోగిస్తారు. దీని భస్మాన్ని గుండె పనితీరు పెంచే కార్డియాయిక్ స్టిమ్యులెంట్‌గా ఉపయోగిస్తారు. సెపియ(కటిల్ ఫిష్) అస్థికలను, అది విడుదల చేసే విషాన్ని కూడా హోమియోపతి వైద్యంలో ఉపయోగిస్తారు. దాదాపు అన్ని ఆయుర్వేద ఔషధాల్లో తేనెను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.
పరిశోధనలో నమూనాలుగా: ప్రాథమిక జీవశాస్త్ర అధ్యయనంలో, వైద్య రంగంలో ప్రతి అవయవం పనితీరును అర్థం చేసుకోవడంలో, మందులను పరీక్షించడంలో, శస్త్ర చికిత్సలను అభివృద్ధి చేయడంలో అనేక రకాల జంతువులను విరివిగా వినియోగిస్తున్నారు.
ఉదా: ఎలుకలు, కుందేలు, చింపాంజీలు, కోతులు.