పదో తరగతి జనరల్ సైన్స్‌లో రెండో పేపర్ జీవ శాస్త్రం. పబ్లిక్ పరీక్షల్లో ఈ పేపర్‌కు 50 మార్కులు ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం సిద్ధమైతే 50కి 50 మార్కులు సాధించొచ్చు. ఇందులో పొందే మార్కులతోనే సైన్‌స సబ్జెక్టులో సులువుగా ఉత్తీర్ణులు కావచ్చు. ఈ నేపథ్యంలో జీవశాస్త్రంలో అత్యధిక మార్కుల సాధనకు సబ్జెక్ట్ నిపుణులు అందిస్తున్న టిప్స్..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. అందుబాటులో ఉన్న ఈ సమయంలో సిలబస్ మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా విభజించుకుని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తే బయాలజీలో మంచి మార్కులు పొందొచ్చు.
జీవశాస్త్రంలో మొత్తం ఆరు అధ్యాయాలు ఉన్నాయి. అవి..
జీవన విధానాలు
నియంత్రణ, సమన్వయం
ప్రత్యుత్పత్తి
హెచ్‌ఐవీ-ఎయిడ్స్
పోషణ
పర్యావరణ విద్య
ముఖ్యమైన ప్రశ్నలు
చాప్టర్-1 (జీవన విధానాలు):
దీని నుంచి పబ్లిక్ పరీక్షల్లో 23 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ చాప్టర్ నుంచి కచ్చితంగా రెండు, నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా ఈ చాప్టర్‌లోని నాలుగు ప్రయోగాలలో ఏదో ఒకదాన్ని ప్రతి ఏటా ఇస్తున్నారు. అదేవిధంగా భేదాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా తప్పనిసరిగా వస్తాయి. ఐదు మార్కులకు అడిగే పటం కూడా ఈ చాప్టర్ నుంచి ఇస్తారు.
జీవన విధానాలు - ముఖ్యమైన ప్రశ్నలు:
కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించండి?
కిరణజన్య సంయోగక్రియలో ఆమ్లజని విడుదలవుతుందని నిరూపించండి?
కిరణజన్య సంయోగక్రియకు కాంతి లేదా వెలుతురు అవసరమని ఎలా నిరూపిస్తావు?
శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని నిరూపించండి?
కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలు?
కుడి, ఎడమ కర్ణికల మధ్య భేదాలు రాయండి?
కుడి, ఎడమ జఠరికల మధ్య భేదాలను తెలపండి?
అధిక రక్తపీడనానికి కారణాలు తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
ఎర్ర రక్త కణాలు - తెల్ల రక్త కణాల మధ్య భేదాలు రాయండి?
మానవుడిలో వివిధ రక్తవర్గాలు - రకాలు?
చాప్టర్-2 (నియంత్రణ - సమన్వయం):
నియంత్రణ - సమన్వయం నుంచి 14.5 మార్కులకు ప్రశ్నలడుగుతారు. దీనిలో మొక్కలలో నియంత్రణ సమన్వయం నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న, జంతువులలో నియంత్రణ సమన్వయం నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఇస్తారు.
ఈ చాప్టర్‌లో ముఖ్యమైన ప్రశ్నలు:
మొక్కలలో సైటోకైనిన్‌ల ప్రభావం ఏమిటి?
ఆక్సిన్‌లు మొక్కల పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తాయి?
మొక్కల పెరుగుదల, అభివృద్ధిలో జిబ్బరెల్లిన్‌ల పాత్ర ఏమిటి?
పీయూష గ్రంథి ప్రాముఖ్యం, ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్‌లు, వాటి చర్యలను పేర్కొనండి?
అధివృక్క గ్రంథులను వివరించండి?
మస్తిష్క నిర్మాణాన్ని రాయండి?
నాడీకణ నిర్మాణాన్ని తెలపండి?
చాప్టర్-3 (ప్రత్యుత్పత్తి):
జీవశాస్త్రంలో మరో ముఖ్యమైన అధ్యాయం ప్రత్యుత్పత్తి. దీనిపై 18 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కచ్చితంగా 5 మార్కుల ప్రశ్న (పటం) ఈ చాప్టర్ నుంచి ఇస్తున్నారు.
ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన 4 మార్కుల ప్రశ్నలు:
లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి మధ్య భేదాలను రాయండి?
పుష్పంలోని ప్రధాన భాగాలను వివరించండి?
మొక్కల కణజాల వర్ధనం ద్వారా కలిగే ప్రయోజనాలేమిటి?
శాఖీయోత్పత్తి అంటే ఏమిటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలను తెలపండి?
అంటుకట్టడం వల్ల కలిగే ఉపయోగాలను రాయండి?
శుక్రకణానికి, అండానికి మధ్య ఉన్న భేదాలు?
మానవులలో రుతుచక్రాన్ని వర్ణించండి?
చాప్టర్-4 (హెచ్‌ఐవీ-ఎయిడ్‌స):
ఎయిడ్స్ నుంచి కచ్చితంగా ఒక నాలుగు మార్కుల ప్రశ్న అడుగుతారు. ఈ చాప్టర్‌లో ప్రశ్నలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి అధ్యయనం చేయడం చాలా సులువు.
హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌లో ముఖ్య ప్రశ్నలు:
హెచ్‌ఐవీ- ఎయిడ్‌సలో దశలను వివరించండి?
హెచ్‌ఐవీ - ఎయిడ్‌స వంటి సమస్యాత్మక పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన జీవన నైపుణ్యాలు ఏమిటి?
హెచ్‌ఐవీ ఏయే మార్గాల్లో వ్యాప్తి చెందుతుంది?
హెచ్‌ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
హెచ్‌ఐవీ-ఎయిడ్స్ మధ్య భేదాలు రాయండి?
చాప్టర్-5 (పోషణ):
ఈ చాప్టర్ నుంచి 14.5 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
ఈ చాప్టర్‌లో ముఖ్యమైన నాలుగు మార్కుల ప్రశ్నలు:
కాల్షియం గురించి రాయండి?
పిల్లల మీద క్యాషియోర్కర్ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది?
విటమిన్ ‘ఎ’ లోపం వల్ల కలిగే వ్యాధులేవి?
ఎముకల విరుపు లక్షణాలను వివరించండి?
ఎముకల విరుపునకు నీవు చేసే ప్రథమ చికిత్స ఏమిటి?
మలేరియా పరాన్నజీవి దోమ శరీరంలో ఏయే మార్పులు చెందుతుంది?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం - విధులను తెలపండి?
చాప్టర్-6 (పర్యావరణ విద్య):
దీని నుంచి మొత్తం ఐదు మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అవి.. ఒక మార్కు ప్రశ్న, రెండు మార్కుల ప్రశ్న, నాలుగు బిట్లు.
పటాలు - ప్రయోగాలు
5 మార్కుల ప్రశ్న (పటం) ఒకటి మొక్కల నుంచి, ఒకటి జంతువుల నుంచి ఇస్తారు.
మొక్కల్లో ముఖ్య పటాలు:
ఆకు అడ్డుకోత - భాగాలు
మైటోకాండ్రియా నిర్మాణం - భాగాలు
ఉమ్మెత్త పువ్వు - నిలువుకోత, భాగాలు
అండం నిర్మాణం - భాగాలు
మొక్కలలో ఫలదీకరణాన్ని చూపే పటం, భాగాలు
మానవులు/జంతువులు:
మానవుడి ఊపిరితిత్తుల నిర్మాణం- భాగాలు
మానవుని హృదయం అంతర్నిర్మాణం-కవాటాల స్థానం
కప్ప-పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం - భాగాలు
కప్ప- స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం - భాగాలు
ప్రిపరేషన్ ఇలా..
ఇప్పటికే సిలబస్ దాదాపు పూర్తైఉంటుంది. రాబోయే నాలుగు నెలల్లో ఈ కింది విధంగా సిద్ధమవ్వాలి.
డిసెంబర్‌లో యూనిట్-1 జీవన విధానాలు, యూనిట్-4 హెచ్‌ఐవీ- ఎయిడ్స్
జనవరిలో యూనిట్-2 నియంత్రణ, సమన్వయం, యూనిట్-5 పోషణ
ఫిబ్రవరిలో యూనిట్-3 ప్రత్యుత్పత్తి, యూనిట్-6 పర్యావరణ విద్యలను పూర్తి స్థాయిలో చదవాలి.
మార్చి మొదటి మూడు వారాల్లో సిలబస్ మొత్తం పునశ్చరణ (రివిజన్) చేయాలి.
ముందు జీవ శాస్త్రం పాఠ్యపుస్తకంలోని ప్రతి పాఠం చివర ఉన్న ఒక మార్కు, రెండు మార్కులు, నాలుగు మార్కుల ప్రశ్నలను బాగా చదవాలి. ఐదు మార్కులకు ఇచ్చే పటాలను కూడా వీలైనన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి.
ఖాళీలు, బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, జతపరచండి రూపంలో ఇచ్చిన బిట్స్‌ను కూడా చదవాలి.
భేదాలుగా ఇచ్చే ప్రశ్నలన్నింటిని ఒకచోట పట్టిక రూపంలో రాసుకొని అధ్యయనం చేయాలి. ఉదాహరణకు విటమిన్లు -ఏయే పదార్థాలలో లభిస్తాయి?-లోపిస్తే వచ్చే వ్యాధులేమిటి? వంటి వాటిని టేబుల్‌గా రూపొందించుకుని చదవాలి. జీవ శాస్త్రవేత్తలు-దేశం-పరిశోధనలు- బహుమతులు వంటి ప్రశ్నలకు కూడా ఇలాగే సిద్ధమవ్వాలి.
పబ్లిక్ పరీక్షల దృష్ట్యా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ జీవన విధానాలు. కాబట్టి పాఠ్యపుస్తకంలో ప్రతి సబ్‌టాపిక్‌ను అధ్యయనం చేయాలి. పాఠం చివర ఉన్న ముఖ్యమైన పాయింట్లను చదవడంతోపాటు సారాంశాన్ని ఒక పుస్తకంలో రాసుకోవాలి. ముఖ్యంగా ప్రయోగాలు అటు నాలుగు మార్కులకు, ఇటు ఐదు మార్కులకు అడగడానికి అవకాశమున్న ప్రశ్నలు. కాబట్టి ప్రయోగాలను బాగా చదివి, పటాలను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి.
గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రతి చాప్టర్‌లో ముఖ్యమైన ప్రశ్నలేవో గుర్తించాలి. అందులోనూ 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులు, 5 మార్కులు ఇలా విభజించుకుని ముఖ్యమైన ప్రశ్నలేవో గమనించాలి. ఇలా కనీసం ఐదేళ్ల పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. తర్వాత ముఖ్యమైన ప్రశ్నలను బాగా చదవాలి. నిర్దేశించుకున్న టైమ్‌లోగా వాటికి సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
పటాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కింది పద్ధతులు అవలంబించి సాధన చేయాలి.
మొదటిస్టెప్‌లో పటాన్ని 15 లేదా 20 నిమిషాలు క్షుణ్నంగా పరిశీలించాలి.
రెండో స్టెప్‌లో పటాన్ని చూసి వేయాలి.
మూడో స్టెప్‌లో పటాన్ని చూడకుండా వేయాలి.
నాలుగో స్టెప్‌లో చూసివేసిన పటాన్ని, చూడకుండా వేసిన పటాన్ని సరిపోల్చుకొని తప్పులేమన్నా ఉంటే గుర్తించాలి.
ఐదో స్టెప్‌లో మళ్లీ చూడకుండా వేయాలి.
ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే పటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ప్రజంటేషన్ స్కిల్స్
ఒక మార్కు ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు జవాబులు సూటిగా, స్పష్టంగా అవసరమైన సమాచారం మాత్రమే రాయాలి.
ఉదా: శ్వాసక్రియాధారాలు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి?
సమాధానం:
శరీర శ్వాసక్రియలో ఆక్సీకరణ చెంది శక్తి విడుదల చేసే పదార్థాలను శ్వాసక్రియాధారాలు అంటారు.
ఉదా: కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు.
రెండు మార్కుల ప్రశ్నలకు రెండు పాయింట్లు రాయాలి. ప్రశ్నను అడిగే తీరును బట్టి ఒక్కోసారి నాలుగు పాయింట్లు కూడా రాయాల్సి వస్తుంది.
ఉదా: జీవక్రియ అంటే ఏమిటి? కొన్ని జీవ క్రియల పేర్లు రాయండి?
సమాధానం:
జీవక్రియ: జీవి మనుగడకు, దాని వంశాభివృద్ధికి అవసరమైన క్రియలను జీవ క్రియలు అంటారు.
ఉదా: పోషణ, శ్వాసక్రియ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి.
నాలుగు మార్కుల ప్రశ్నకు సమాధానాలు రాసేటప్పుడు కనీసం 8 పాయింట్లు రాయాలి.
హెడ్డింగ్‌స, సైడ్ హెడ్డింగ్‌స రాసి ముఖ్యమైన పాయింట్‌లు అండర్‌లైన్ చేయాలి.
భేదాలను పట్టిక రూపంలో రాయాలి.
ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు ఈ కిందివిధంగా సైడ్ హెడ్డింగ్‌స రాయాలి.
1) ఉద్దేశం
2) కావాల్సిన పరికరాలు
3) ప్రయోగ విధానం
4) పరిశీలన
5) నిర్ధారణ
6) పటం
ఐదు మార్కుల ప్రశ్న-పటం చక్కగా గీసి, భాగాలు స్పష్టంగా గుర్తుపెట్టాలి. పటానికి మూడు మార్కులు, భాగాలకు రెండు మార్కులు ఉంటాయి. పటం పెన్సిల్‌తో మాత్రమే గీయాలి.
ప్రతి ప్రశ్నకు సమాధానాలు బ్లూ లేక బ్లాక్ పెన్నుతో మాత్రమే రాయాలి. రెడ్‌పెన్ను, స్కెచ్ పెన్నులు వాడరాదు.
బిట్ పేపర్‌లో సమాధానాలు స్పష్టంగా రాయాలి. దిద్దిన, చెరిపేసి రాసిన వాటికి మార్కులు వేయరు.
ప్రతి విద్యార్థి సబ్జెక్టుపై పట్టు సాధిస్తే మార్కులు సాధించడం చాలా సులువు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన జీవశాస్త్రం పాఠ్యపుస్తకంలో ప్రతిపాఠం వెనుక చివర్లో ప్రశ్నలు, ఖాళీలు, సరైన సమాధానాలకు సంబంధించిన బిట్లు బాగా చదివితే విజయం మీదే.
నిరంతర పరిశ్రమ, ఉన్నతమైన లక్ష్యం, పటిష్ట ప్రణాళిక, సానుకూల ఆలోచన ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఉన్నత శిఖరాలు మీవే!!
సూర సత్యనారాయణ,
సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్, హైదరాబాద్.