గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో కీలకమైన విభాగం జనరల్ సైన్స్. ఇందులో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం నుంచి ప్రశ్నలు ఉంటాయి. మన శరీరంతో మొదలుకుని, చుట్టూ ఉన్న ప్రతీ వస్తువు రసాయన అనువర్తనాలతో తయారైనప్పటికీ వాటిని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదు. దీనికి ప్రధాన కారణం రసాయన నామాలు, రసాయన ఫార్ములాలు. అయితే ఒక క్రమ పద్ధతిలో తార్కికత జోడించి ప్రిపరేషన్ సాగిస్తే రసాయన శాస్త్రంలో కూడా మెరుగైన మార్కులు సాధించవచ్చు.
- డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా
గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో రసాయన శాస్త్రం నుంచి సగటున 10-15 ప్రశ్నలు వస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈ విభాగం నుంచి అడుగుతున్న ప్రశ్నల సంఖ్య కూడా పెరుగుతోంది. 2012 గ్రూప్-1లో 17 ప్రశ్నలు, గ్రూప్-2లో 21 ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నలన్నీ విస్తృతంగా కాకుండా.. మనచుట్టూ, నిత్య జీవితంలో ఎదురయ్యే విషయాలకు, ఉపయోగించే పదార్థాలకు సంబంధించిన అనువర్తనాలపై ఉండటాన్ని గమనించవచ్చు.
విభజించి చదువుకోవాలి:
రసాయన శాస్త్రాన్ని ప్రధానంగా మూలక రసాయన శాస్త్రం, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం, సాధారణ రసాయన శాస్త్రంగా విభజించి చదువుకోవాలి. ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు: పరమాణు నిర్మా ణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, రేడియోధార్మికత, కేంద్రక రసాయనశాస్త్రం, వివిధ కుటుంబాలకు చెం దిన మూలకాలు-ఆవర్తనాలు, లోహశాస్త్రం, జీవాణువులు, పాలీమర్లు, ఇంధనాలు, హైడ్రోకార్బన్లు, కొల్లాయిడ్‌లు, ఆమ్లాలు-క్షారాలు, వాయు నియమాలు, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఎరువులు, క్రిమి సంహారిణులు, ఔషధాలు, వివిధ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు, నోబెల్ బహుమతులు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, గాజు, సిమెంట్, వివిధ పదార్థాల రసాయన నామాలు.
రెండు రకాలు ప్రశ్నలు:
రసాయన శాస్త్రంలో సాధారణంగా రెండు రకాలు ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కంటెంట్ ప్రశ్నలు. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు (అప్లికేషన్ టైప్).
కంటెంట్ ప్రశ్నలు:
ఇటువంటి ప్రశ్నలు జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. సాధారణంగా వివిధ రసాయన నామాలపై ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. వీటిని గుర్తు పెట్టుకోవాలంటే నిరంతర పునశ్చరణ (Repeated Revision)అవసరం. అంతేకాకుండా కెమిస్ట్రీని Chemistry is a volatile subject అని కూడా అంటారు. కాబట్టి ప్రిపరేషన్‌లో పునశ్చరణకు అధిక ప్రాధాన్యత నివ్వాలి.
ఉదా: కఠిన జలంలో ఉండే అయాన్లు? (గ్రూప్ -1, 2012)
1) కాల్షియం, మెగ్నీషియం
2) సోడియం, పొటాషియం
3) కాల్షియం, బేరియం
4) సోడియం, జింక్
సమాధానం: 1
వివరణ: నీటి కాఠిన్యత రెండు రకాలు. అవి.. తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత. కాల్షియం, మెగ్నీషియం బై కార్బోనేట్ తాత్కాలిక కాఠిన్యతను, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్‌లు, సల్ఫేట్‌లు శాశ్వత కాఠిన్యతను కలిగిస్తాయి. ఈ ప్రశ్న లవణాలలోని కేటయాన్‌లు కాల్షియం, మెగ్నీషియంలపై ఆధారపడి ఉంది. అంటే సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు ఉంటే తప్ప ఇటువంటి ప్రశ్నకు సమాధానం గుర్తించడం కష్టం. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలకు సంబంధించి సినాప్సిస్ రాసుకోవడంతోపాటు వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి.
అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు:
ఇటువంటి ప్రశ్నలు అన్వయ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. అంటే సబ్జెక్ట్‌ను చదవడం ద్వారా వచ్చిన అవగాహనను వివిధ అంశాలకు అన్వయించే ప్రయత్నం చేయాలి. ఈ అనువర్తనాలన్నీ దాదాపుగా నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో ముడిపడి ఉంటాయి.
ఉదా: నిప్పును ఆర్పివేసే ప్రయత్నంలో ఉపయోగించే వాయువు? (గ్రూప్-2, 2012)
1) హైడ్రోజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) హైడ్రోజన్ సల్ఫైడ్
సమాధానం: 2
వివరణ: ఈ ప్రశ్న కార్బన్ డై ఆక్సైడ్ ధర్మంపై ఆధారపడిన అనువర్తనానికి సంబంధించింది. కార్బన్‌కు ప్రధానంగా రెండు వాయువులు ఉంటాయి. అవి.. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ దహనశీలి, విషపూరితమైంది. కార్బన్ డై ఆక్సైడ్ మంటలనార్పుతుంది. గ్రీన్‌హౌజ్ వాయువు. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని మొక్కల్లో కార్బోహైడ్రేట్ల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక సమ్మేళనం గురించి చదివేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అనువర్తనాలపై కూడా అవగాహన పెంచుకోవాలి.
రసాయన శాస్త్రంలో అన్ని అంశాలను కాకుండా కొన్ని ముఖ్యమైన వాటిని పరీక్ష క్లిష్టత మేరకు ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. ఈ క్రమంలో అంశాల వారీగా దృష్టిసారించాల్సినవి.
మూలాధారం:
రసాయన శాస్త్రానికి మూలాధారంగా భావించే పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక-ఆవర్తన ధర్మాలు, రసాయన బంధం వంటి అంశాల్లోంచి కచ్చితంగా ఒకటి-రెండు ప్రశ్నలు రావచ్చు. పరమాణు నిర్మాణంలో భాగంగా పరమాణు నమూనాలు, విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాలు (కాస్మిక్, గామా, ఎక్స్-కిరణాలు, అతినీలలోహిత, పరారుణ), కాంతి విద్యుత్ ఫలితం దాని అనువర్తనాల గురించి క్షుణ్నంగా చదవాలి. ఆవర్తన పట్టికలోని వివిధ కుటుంబాలు అంటే క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు, కార్బన్ కుటుంబం, నైట్రోజన్ కుటుంబం, చాల్కోజన్లు, హాలోజన్లు, జడవాయువులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి.
వివిధ కుటుంబాలలోని మూలకాలను గుర్తించే నైపుణ్యం సాధించాలి. వాటిలో రేడియోధార్మికత కలిగిన వాటి పట్ల ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆవర్తన పట్టికపై పట్టు పెంచుకోవాలంటే..ఆవర్తన పట్టికను మనం నిత్యం చూసే ప్రాంతం (రీడింగ్ టేబుల్ లేదా డ్రెస్సింగ్ టేబుల్, స్విచ్చ్ బోర్డు తదితర)లో స్టిక్ చేసి పరిశీలిస్తూండాలి. ఆవర్తన ధర్మాలైన పరమాణు సైజు, అయనీకరణ శక్మం, రుణ విద్యుదాత్మకత, రసాయన ధర్మం వంటి అంశాలకు కూడా ప్రిపరేషన్‌లో తగినంత ప్రాధాన్యతనివ్వాలి. రసాయన బంధంలో అయానిక, సమయోజనీయ పదార్థాలను గుర్తించే సామర్థ్యం పెంచుకోవాలి. ద్విబంధం, త్రిబంధం ఏ అణువులో ఉంటాయో గుర్తు పెట్టుకోవాలి. హైడ్రోజన్ బంధం అనువర్తనాలు, పదార్థాల ద్రావణీయత, అణువుల ఆకృతి, బంధ కోణం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
రేడియోధార్మికత, కేంద్రక రసాయన శాస్త్రం:
సహజ, కృత్రిమ రేడియోధార్మికత, ఆల్ఫా, బీటా, గామా వికిరణాలు-ధర్మాలు, కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం -అనువర్తనాలు, అణు రియాక్టర్లకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా దేశంలోని అణు
విద్యుత్ కేంద్రాలు, భారజల ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవడం ప్రయోజనకరం.
రసాయన పదార్థాలు:
వివిధ మూలకాల ధర్మాలతోపాటు ఆయా మూలకాలు ఏర్పరిచే ముఖ్యమైన సమ్మేళనాలపై తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ క్రమంలో పదార్థాల రసాయన నామాలు, వాటి ఉపయోగాలపై ప్రశ్నలు ఇస్తుంటారు. హైడ్రోజన్, సోడియం, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, కార్బన్, సిలికాన్, టిన్, లెడ్, నైట్రోజన్, ఫాస్పరస్, ఆక్సిజన్, సల్ఫర్, వివిధ హాలోజన్లు, జడవాయువులు, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మొదలైన మూలకాలు, వాటి సమ్మేళనాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
ఇంధనాలు:
ఘన, ద్రవ, వాయు ఇంధనాల శ్రేష్టత, వివిధ ఇంధనాలలోని అనుఘటక రసాయన పదార్థాలపై ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువ. ఇందులో సీఎన్‌జీ, ఎల్‌పీజీ, బయోగ్యాస్, గోబర్ గ్యాస్, వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రధానమైనవి. అదే సమయంలో పెట్రోలియం గురించి కూడా నేర్చుకోవాలి. ఉదాహరణ-ఎల్‌పీజీలో ఉండే ప్రధాన వాయువు? (గ్రూప్-1, 2012). సమాధానం: బ్యూటేన్
లోహశాస్త్రం:
రసాయన శాస్త్రంలో మరో ముఖ్యమైన విభాగం లోహశాస్త్రం. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం రాగి మొదలు కంచు, ఇత్తడి, స్టీల్ వంటి మిశ్రమ లోహాలు వాటి అనువర్తనాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వివిధ లోహాల ఖనిజాలు (ఉదాహరణ- అల్యూమినియం ఖనిజం-బాక్సైట్), లోహ నిష్కర్షణ ప్రక్రియలోని వివిధ సూత్రాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణ-భర్జనం, భస్మీకరణం.
జీవాణువులు, పాలీమర్లు, ఔషధాలు:
జీవవ్యవస్థ నిర్మాణం, పని చేయడంలోనూ వివిధ పదార్థాలు పాల్గొంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, లిపిడ్‌లు, హార్మోన్లు, విటమిన్లు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే జీవశాస్త్రంతో అన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. రబ్బర్, సెల్యూలోజ్ ఉత్పన్నాలు, పీవీసీ, టెఫ్లాన్, బేకలైట్ వంటి పాలీమర్లు అనువర్తనాలను వివరంగా చదవాలి. యాంటీపెరైటిక్స్, అనాల్జెసిక్‌లు, యాంటీబయాటిక్స్, సెడెటివ్స్, యాంటాసిడ్స్ వంటి సాధారణ ఔషధాల గురించి తెలుసుకోవాలి. టీ, సిగరెట్, గంజాయి, శీతలపానీయాల్లో ఉండే పదార్థాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి.
ఆమ్లాలు-క్షారాలు:
మన ఉదరంలో బలమైన హైక్రోక్లోరికామ్లం ఉంటుంది. తినే సోడా, తమలపాకుకు పూసే సున్నపు తేట క్షార ధర్మం కలిగి ఉంటుంది. వెనిగర్, నిమ్మ ఉప్పు, చీమల కాటు ద్వారా వచ్చే స్రవం అన్నీ ఆమ్లాలే. ఆమ్లాలు-క్షారాలు కలిసి తటస్థీకరణం జరిగితే ఏర్పడేది లవణం. ఇలా వివిధ ఆమ్లాలు- క్షారాలు, లవణాలపై సమాచారాన్ని సేకరించాలి. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలను పరిశీలిస్తూ చదవడం ప్రయోజనకరం.
వివిధ ప్రక్రియలు:
బీర్, వైన్ తయారీ, సముద్రపు నీటి నుంచి స్వాదు జలం తయారీ, మొక్కలు నీటిని పీల్చుకోవడం వంటి వివిధ ప్రక్రియలకు సంబంధించిన కిణ్వప్రక్రియ, ద్రవాభిసరణం, తిరోగామి ద్రవాభిసరణం వంటి ప్రక్రియల గురించి ప్రశ్నలు అడగొచ్చు.
ద్రావణాలు:
ద్రావణం అంటే ద్రవం అని అందరూ భావిస్తుంటారు. కానీ గాలి వంటి వివిధ వాయువుల సజాతీయ మిశ్రమం కూడా ద్రావణమే. అసంతృప్త, సంతృప్త, అతి సంతృప్త ద్రావణాలు, నిజ ద్రావణం, అవలంబనం, కొల్లాయిడ్‌ల అనువర్తనాలపై ప్రశ్నలు రావచ్చు.
మిశ్రమాలు, సమ్మేళనాలు:
పదార్థ స్థితిగతుల ఆధారంగా మిశ్రమాలను వేరు చేసే పద్ధతులు, మిశ్రమాలు-సంయోగ పదార్థాల మధ్య భేదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వీటిపై అడిగే ప్రశ్నలు ప్రాథమిక భావనలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ముందుగా మిశ్రమం అంటే ఏమిటి? సంయోగ పదార్థం అంటే ఏమిటి? వంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాలి.
కాలుష్యం:
పెరుగుతున్న కాలుష్యం కారణంగా పోటీ పరీక్షల్లో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. హరిత గృహ ప్రభావం లేదా భౌగోళిక తాపం, ఓజోన్ పొరకు చిల్లులు, ఆమ్ల వర్షాలు, ఫ్లోరోసిస్, వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఫార్మా పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు, అగ్ని పర్వతాలు, గాలి-నీటిలోకి విడుదలయ్యే కలుషితాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలి.
సూచనలు:
- బాయిల్, చార్లెస్ వంటి వాయు నియమాల అనువర్తనాలను పరిశీలించాలి.
- రసాయన శాస్త్ర గతిని మార్చిన ఆవిష్కరణలు, సంబంధిత శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలపై కూడా దృష్టి సారించాలి.
- నీటి కాఠిన్యతకు కారణమైన లవణాలు, కాఠిన్యతను పోగొట్టే పద్ధతులను తెలుసుకోవాలి.
- ఎరువులు, పురుగు మందులు, గాజు, సిమెంట్, అగ్గి పెట్టెలు, టపాకాయల వంటి పరిశ్రమల్లో ఉపయోగించే పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి.
చదవాల్సినవి:
8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫిజికల్ సైన్స్ పుస్తకాలు (పాతవి)
ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం పుస్తకాలు
ఆయా అంశాలను చదివేటప్పుడు లోతుగా వెళ్లకుండా ధర్మాలు, ఉపయోగాలు వరకు పరిమితమైతే సరిపోతుంది.
చదివేటప్పుడు ప్రతి వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటూ చదవాలి.
ప్రతి అంశాన్ని ప్రశ్న కోణంలో ఊహించుకుంటూ ప్రిపేర్ కావడం మంచిది.
నిరంతర పునశ్చరణ.. అన్వయ సామర్థ్యమే కీలకం
Published Thu, Nov 27 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement