chemical industry
-
రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి శివారులో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా ఎస్పీ రూపేశ్ కథ నం ప్రకారం.. కొడకంచి గ్రామానికి ఐదు కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కి సంబంధించిన 3.30 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వాటర్ ప్లాంట్‌తో పాటు అదనంగా మూడు గదులు ఉన్నాయి. కొడకంచి గ్రామానికి చెందిన కిష్టంగారి శివకుమార్‌గౌడ్ అధీనంలో ఈ భూమి ఉంది. కాగా, ఓ రసాయన పరిశ్రమలో డ్రగ్గిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పసుపులేటి మాణిక్యాల రావు అతని మిత్రులు గౌండ్ల శ్రీనివాస్‌గౌడ్, కిష్ణంగారి నిర్మల్‌గౌడ్, ఎండీ యూసుఫ్ తేలిగ్గా డబ్బులు సంపాదించే లక్ష్యంతో మాదకద్రవ్యాలను తయా రు చేయాలని నిర్ణయించారు. రసాయనాల తయా రీపై మాణిక్యాలరావుకు పట్టు ఉండటంతో గ్రామా నికి దూరంగా స్థలం ఉంటే బాగుంటుందని భావించారు. దీంతో శివకు మార్గౌడ్ను సంప్రదించి ఆయన అధీనంలోని భూమిని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఉన్న మూడుగదుల్లో రూ.25 లక్షలు వెచ్చించి ఓ రియాక్టర్, కూలర్, డ్రయ్యర్‌తో పాటు ఇతర పరికరాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారీ ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకున్న జిన్నారం పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారు లు డ్రగ్స్ తయారీ కేంద్రంపై గురువారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పాటు తయారీ మిషన్లను సీజ్ చేశారు. నిందితులు మాణిక్యా లరావు, శివశంకర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నిర్మల్‌గౌడ్, ఎండీ యూ సుఫ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించారు. ఇందులో ప్రమేయం ఉన్న రాహుల్ రె డ్డి, శ్రీశైలంయాదవ్‌లు పరారీలో ఉన్నారు. వారి కో సం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని ఎస్పీ తెలిపారు. మాణిక్యాలరావు, ఎండీ యూసు ఫ్లు గతంలో కూడా డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అనుభ వించారని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శ్రీధర్, పటా న్చెరు డీఎస్పీ పురుషో త్తంరెడ్డి, సీఐ వేణు కుమార్, ఎస్ఐ విజ యారావు పాల్గొ న్నారు. -
రసాయన పరిశ్రమలో ప్రమాదం
జిన్నారం (పటాన్చెరు): మైలాన్ రసాయన పరిశ్రమ యూనిట్ – 1లో రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఆది వారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మైలాన్ పరి శ్రమ లోని లిక్వి డ్ రా మెటీరియల్స్ శాంపిల్ డిస్పెన్సింగ్ గదిలో 1.1.3.3 టెట్రా మిథైల్ డిసిలోక్సేన్ అనే రసాయన మెటీరియల్‌ను (దీనితో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తులకు అవసరమైన మందులు తయారు చేస్తారు) సుమారు 400– 500 డిగ్రీ సెల్సియస్‌లో వేడి చేసి దాని నుంచి జిప్రసైడోన్ ఇంటర్మీడియెట్ రసాయనం తయారు చేస్తుంటారు. ఈ ప్లాంటులో పది మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటిలాగానే రసా యనాలను వేరు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా ఒత్తిడి ఎక్కువై మెరుపులు వచ్చా యి. యాసిడ్ మాదిరి కాలే గుణం ఉన్న రసాయనాలు ఒక్కసారిగా బయటకు ఎగ జిమ్మాయి. అవి ఒంటి మీద పడటంతో చర్మం కాలి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన వేర్‌హౌస్ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా (40), బిహార్‌కు చెందిన రంజిత్‌కుమార్ (27) అనే ముగ్గురు అక్కడికక్కడే కాలి పోయారు. మంటలు కూడా చెలరేగినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..: ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను యాజమాన్యం హుటాహుటి న ఆస్పత్రికి తరలించింది. ఘటన జరిగిన గంటసేపటి తర్వాత పోలీసులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమకు చేరుకున్నారు. మరోవైపు వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను యాజమాన్యం ఘటనా స్థలా నికి పంపలేదు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు కార్మికులకు రక్షణ కల్పించేలా యాజ మాన్యం చర్యలు తీసు కోవాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతు న్నామని సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టీస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
రసాయన పరిశ్రమలో ప్రమాదం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఇండియా కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. రాత్రి 11.30 గంటల తర్వాత ప్లాంట్–4లో అకస్మాత్తుగా బాయిలర్ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పని చేస్తున్న 30 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగసి పడుతుండటం, దట్టంగా పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుధీర్ (38), బారువల (30), షేక్ సుబానీ (30), కె. జోసఫ్(25), ఎం నాగరాజు(35), ఎస్ నాగేశ్వరరావు (45), విహారీ (25), టి రవికుమార్ (20), పి.సుధీర్‌కుమార్ (35), కిరణ్ (35), సీహెచ్ రాజు (38), ఎం చాష్మమ్ (32), రోషన్ మోచి (24) తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో అగ్నిమాపక శాఖ, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేగాని మృతుల సంఖ్య నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. కాగా, గాయపడ్డ కార్మికుల్లో ఆరుగురికి పైగా బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. -
మగవారి కొంపముంచుతున్న కెమికల్స్, ఇలాగైతే కష్టమే!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా మానవజాతిలో ఫలదీకరణ సామర్ధ్యం క్రమంగా తగ్గిపోతోందా? అవునంటున్నారు షన్నా స్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పలు రకాల రసాయనాలు క్రమంగా మగవాళ్లలో వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు, అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. కౌంట్‌డౌన్ పేరిట తాజాగా విడుదల చేసిన పుస్తకం ప్రకారం మనుషుల్లో వీర్యకణాల సంఖ్య 1973తో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం మేర తగ్గిందని, ఇదే తరహా కొనసాగితే 2045 నాటికి స్పెర్మ్‌కౌంట్ జీరోకు చేరవచ్చని చెప్పారు. ఇదే నిజమైతే భవిష్యత్‌లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదని హెచ్చరించారు. ఈ విపత్తుకు కారణమైన రసాయనాలు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయని, రోజూవారీ ఫుడ్ర్యాపింగ్స్ మొదలు, ప్లాస్టిక్ కంటైనర్ల వరకు వాటర్‌ప్రూఫ్ బట్టల నుంచి రోజూవారీ డియోడరెంట్లు, సబ్బుల వరకు అన్ని చోట్ల ఈ రసాయనాల జాడ ఉందని వివరించారు. వీటిలో పీఎఫ్ఏఎస్గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ఎప్పటికీ ప్రకృతిలో బ్రేక్‌డౌన్ కావని, ఇవి శరీరంలో పర్మినెంట్‌గా ఉంటాయని చెప్పారు. ఇవి శరీరంలో పేరుకుపోయేకొద్దీ హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుందన్నారు. కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీయింగ్ పీఎఫ్ఏఎస్ కెమికల్స్‌పై ఆయాదేశాలు స్పందించే తీరులో వ్యత్యాసాలున్నాయని, కొన్ని దేశాల్లో వీటిని పూర్తిగా నిషేధిస్తే, కొన్ని చోట్ల పరిమితంగా వాడుతున్నారని, కొన్ని చోట్ల ఎలాంటి నియంత్రణా లేదని స్వాన్ వివరించారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించకుండా కెమికల్ ఇండస్ట్రీ ల్యాబీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రసాయనాల ప్రభావం మహిళల్లో సైతం ఫెర్టిలిటీపై పెరిగిందని స్వాన్ చెప్పారు. ప్రస్తుత మహిళ తన ముత్తవ్వతో పోలిస్తే 35వ ఏట గర్భం దాల్చే శక్తి తగ్గిందన్నారు. అలాగే ఒక మగవాడి వీర్యకణాలు అతడి తాతతో పోలిస్తే సగమయ్యాయన్నారు. ఇది మానవాళి అంతానికి దారి తీసే విపత్తని చెప్పారు. కేవలం స్పెర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఈ కెమికల్స్ కారణంగా మగవారి అంగ పరిమాణం, వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశాలు మేలుకొని ఈ కెమికల్ గండాన్ని ఎదుర్కోవాలని సూచించారు. -
గుజరాత్ ఫ్యాక్టరీలో ప్రమాదం..
భారూచ్: గుజరాత్ లోని ఓ పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగడంతో 8 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. భారూచ్ జిల్లాలోని దహెజ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక కార్య క్రమాలు కొనసాగు తున్నాయని ఎస్పీ ఆర్వీ ఛూదసమ తెలిపారు. మరణించిన వారంలో కొందరు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్ప త్రులకు తీసుకెళుతుండగా మరణిం చా రు. పరిశ్రమ ఉన్న ప్రాంతానికి పక్కనే ఉన్న రెండుగ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. -
రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
జిన్నారం/గుమ్మడిదల(పటాన్చెరు): సంగారెడ్డి జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలను కలుపుతున్న క్రమంలో మంటలు ఎగిసిపడ్డాయని, దీంతో తాము బయటకు పరుగులు పెట్టామని కార్మికులు చెబుతున్నారు. గుమ్మడిదల గ్రామంలోని మహాసాయి లెబొరేటరీస్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం కార్మికులు రసాయనాలను కలుపుతుండగా ప్రతి చర్య జరగడంతో మంటలు అంటుకున్నాయి. కార్మికులు మంటలను అదుపు చేయలేక బయటకు పరుగులు తీశారు. మంటల కారణంగా పరిశ్రమ ఆవరణలో ఉన్న రసాయన డ్రమ్ములు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ సంఘటనలో ఫ్యాక్టరీ ఆవరణలోని రెండు డీసీఎంలు, ట్యాంకర్ కాలిబూడిదయ్యాయి. నర్సా పూర్, జీడిమెట్ల, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీల నుంచి పదివరకు ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు వచ్చాయి. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి హాని జరగలేదని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. అయితే, పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తో కార్మికులెవరైనా లోపల చిక్కుకొని ఉంచవచ్చేమోనని అనుమానిస్తున్నారు. పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులకు మాత్రం గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరగ్గా రాత్రి 8 గంటల వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలిపింది. -
రసాయనిక పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో ఓ కంపెనీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని గోదాములో నిల్వ ఉంచిన రసాయనాలకు మంటలు అంటుకోవడంతో భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పేలుతున్న నిర్లక్ష్యం.. ప్రాణమే మూల్యం
పరిశ్రమల్లో కార్మికులకు కరువైన రక్షణ రియాక్టర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏడాదిలో దాదాపు 30 మంది మృత్యువాత పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు జిన్నారం : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల్లో 400 పైచిలుకు భారీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ రసాయన పరిశ్రమలే. సుమారు పది వేల మంది పర్మినెంటు, 35 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల్లో 50 శాతం పైగా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు పలువురు కాంట్రాక్టు కార్మికులుగా విధులను నిర్వహిస్తున్నారు. రసాయన పరిశ్రమల్లో పని చేసే వారికి తగిన అనుభవం, అవగాహన నైపుణ్యం తప్పనిసరి కాగా, చాలామంది అవే మీ లేకుండానే విధుల్లోకి చేరిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు.. ప్రమాదమని తెలిసీ జీవనభృతి కోసం ఆయా విధులు నిర్వర్తించడానికి సిద్ధమైపోతున్నారు. కార్మికుల అవసరాన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఆసరాగా తీసుకుని వారి చేత ఇష్టానుసారం పనులు చేయించుకుంటున్నాయి. ప్రాణాలు మింగేస్తున్న రియాక్టర్లు రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు ప్రమాదకరంగా మారాయి. గడచిన ఏడాదిలో దాదాపు 30 మంది కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాతపడినట్టు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. రియాక్టర్లను సరిగా నిర్వహించకపోవడం, వాటి వద్ద అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని విధుల్లో ఉంచకపోవడమే దుర్ఘటనలకు కారణమవుతోంది. కొన్నిసార్లు రియాక్టర్లు పేలి.. ఇంకొన్ని సార్లు వాటిలోకి దిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్టాలకు చెందిన కార్మికులే ఉన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు మృతి చెందితే వారిని రహస్యంగా స్వస్థలాలకు తరలించి యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. నష్టపరిహారం ఊసే లేదు. స్థానికంగా ఉన్న కార్మికులు మృతి చెందితే కార్మిక సంఘాల ఒత్తిడికి తలొగ్గి యాజమాన్యాలు ఎంతోకొంత పరిహారం ఇస్తున్నాయి. కార్మిక శాఖ ఏం చేస్తున్నట్టు? పారిశ్రామికవాడల్లోని కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నా.. కార్మిక శాఖ అధికారులు అందుకు కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. తాజాగా గడ్డపోతారం, బొల్లారం పారిశ్రామికవాడల్లోని రెండు పరిశ్రమల్లో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద కారణాలను వెలికి తీయడంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా?, పరిశ్రమను సక్రమంగా నిర్వహిస్తున్నారా?, అన్ని అనుమతులు ఉన్నాయా?, కార్మికుల భద్రతకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? అనే వాటిపై అధికారులు ఇప్పటికీ దృష్టి సారించిన దాఖలాల్లేవు. అతి తక్కువ వేతనాలకు కార్మికులను విధుల్లోకి తీసుకుని వారి చేత ప్రమాదకర పనులు చేయిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలివే.. ► అనుభవం, నైపుణ్యం గల కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం ► రియాక్టర్లు, ఇతర ప్రమాదకర యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు తగిన రక్షణ పరికరాలను అందించకపోవడం ► భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కార్మిక శాఖ తనిఖీ చేయడం లేదు ► రక్షణ విషయంలో కార్మికులకు ఎప్పటికప్పుడు తగిన అవగాహన కల్పించాలి. అది జరగడం లేదు. -
నిరంతర పునశ్చరణ.. అన్వయ సామర్థ్యమే కీలకం
గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో కీలకమైన విభాగం జనరల్ సైన్స్. ఇందులో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం నుంచి ప్రశ్నలు ఉంటాయి. మన శరీరంతో మొదలుకుని, చుట్టూ ఉన్న ప్రతీ వస్తువు రసాయన అనువర్తనాలతో తయారైనప్పటికీ వాటిని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదు. దీనికి ప్రధాన కారణం రసాయన నామాలు, రసాయన ఫార్ములాలు. అయితే ఒక క్రమ పద్ధతిలో తార్కికత జోడించి ప్రిపరేషన్ సాగిస్తే రసాయన శాస్త్రంలో కూడా మెరుగైన మార్కులు సాధించవచ్చు. - డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో రసాయన శాస్త్రం నుంచి సగటున 10-15 ప్రశ్నలు వస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈ విభాగం నుంచి అడుగుతున్న ప్రశ్నల సంఖ్య కూడా పెరుగుతోంది. 2012 గ్రూప్-1లో 17 ప్రశ్నలు, గ్రూప్-2లో 21 ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నలన్నీ విస్తృతంగా కాకుండా.. మనచుట్టూ, నిత్య జీవితంలో ఎదురయ్యే విషయాలకు, ఉపయోగించే పదార్థాలకు సంబంధించిన అనువర్తనాలపై ఉండటాన్ని గమనించవచ్చు. విభజించి చదువుకోవాలి: రసాయన శాస్త్రాన్ని ప్రధానంగా మూలక రసాయన శాస్త్రం, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం, సాధారణ రసాయన శాస్త్రంగా విభజించి చదువుకోవాలి. ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు: పరమాణు నిర్మా ణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, రేడియోధార్మికత, కేంద్రక రసాయనశాస్త్రం, వివిధ కుటుంబాలకు చెం దిన మూలకాలు-ఆవర్తనాలు, లోహశాస్త్రం, జీవాణువులు, పాలీమర్లు, ఇంధనాలు, హైడ్రోకార్బన్లు, కొల్లాయిడ్లు, ఆమ్లాలు-క్షారాలు, వాయు నియమాలు, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఎరువులు, క్రిమి సంహారిణులు, ఔషధాలు, వివిధ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు, నోబెల్ బహుమతులు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, గాజు, సిమెంట్, వివిధ పదార్థాల రసాయన నామాలు. రెండు రకాలు ప్రశ్నలు: రసాయన శాస్త్రంలో సాధారణంగా రెండు రకాలు ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కంటెంట్ ప్రశ్నలు. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు (అప్లికేషన్ టైప్). కంటెంట్ ప్రశ్నలు: ఇటువంటి ప్రశ్నలు జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. సాధారణంగా వివిధ రసాయన నామాలపై ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. వీటిని గుర్తు పెట్టుకోవాలంటే నిరంతర పునశ్చరణ (Repeated Revision)అవసరం. అంతేకాకుండా కెమిస్ట్రీని Chemistry is a volatile subject అని కూడా అంటారు. కాబట్టి ప్రిపరేషన్లో పునశ్చరణకు అధిక ప్రాధాన్యత నివ్వాలి. ఉదా: కఠిన జలంలో ఉండే అయాన్లు? (గ్రూప్ -1, 2012) 1) కాల్షియం, మెగ్నీషియం 2) సోడియం, పొటాషియం 3) కాల్షియం, బేరియం 4) సోడియం, జింక్ సమాధానం: 1 వివరణ: నీటి కాఠిన్యత రెండు రకాలు. అవి.. తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత. కాల్షియం, మెగ్నీషియం బై కార్బోనేట్ తాత్కాలిక కాఠిన్యతను, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, సల్ఫేట్లు శాశ్వత కాఠిన్యతను కలిగిస్తాయి. ఈ ప్రశ్న లవణాలలోని కేటయాన్లు కాల్షియం, మెగ్నీషియంలపై ఆధారపడి ఉంది. అంటే సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు ఉంటే తప్ప ఇటువంటి ప్రశ్నకు సమాధానం గుర్తించడం కష్టం. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలకు సంబంధించి సినాప్సిస్ రాసుకోవడంతోపాటు వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు: ఇటువంటి ప్రశ్నలు అన్వయ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. అంటే సబ్జెక్ట్‌ను చదవడం ద్వారా వచ్చిన అవగాహనను వివిధ అంశాలకు అన్వయించే ప్రయత్నం చేయాలి. ఈ అనువర్తనాలన్నీ దాదాపుగా నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో ముడిపడి ఉంటాయి. ఉదా: నిప్పును ఆర్పివేసే ప్రయత్నంలో ఉపయోగించే వాయువు? (గ్రూప్-2, 2012) 1) హైడ్రోజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్ 3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) హైడ్రోజన్ సల్ఫైడ్ సమాధానం: 2 వివరణ: ఈ ప్రశ్న కార్బన్ డై ఆక్సైడ్ ధర్మంపై ఆధారపడిన అనువర్తనానికి సంబంధించింది. కార్బన్‌కు ప్రధానంగా రెండు వాయువులు ఉంటాయి. అవి.. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ దహనశీలి, విషపూరితమైంది. కార్బన్ డై ఆక్సైడ్ మంటలనార్పుతుంది. గ్రీన్‌హౌజ్ వాయువు. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని మొక్కల్లో కార్బోహైడ్రేట్ల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక సమ్మేళనం గురించి చదివేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అనువర్తనాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. రసాయన శాస్త్రంలో అన్ని అంశాలను కాకుండా కొన్ని ముఖ్యమైన వాటిని పరీక్ష క్లిష్టత మేరకు ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. ఈ క్రమంలో అంశాల వారీగా దృష్టిసారించాల్సినవి. మూలాధారం: రసాయన శాస్త్రానికి మూలాధారంగా భావించే పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక-ఆవర్తన ధర్మాలు, రసాయన బంధం వంటి అంశాల్లోంచి కచ్చితంగా ఒకటి-రెండు ప్రశ్నలు రావచ్చు. పరమాణు నిర్మాణంలో భాగంగా పరమాణు నమూనాలు, విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాలు (కాస్మిక్, గామా, ఎక్స్-కిరణాలు, అతినీలలోహిత, పరారుణ), కాంతి విద్యుత్ ఫలితం దాని అనువర్తనాల గురించి క్షుణ్నంగా చదవాలి. ఆవర్తన పట్టికలోని వివిధ కుటుంబాలు అంటే క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు, కార్బన్ కుటుంబం, నైట్రోజన్ కుటుంబం, చాల్కోజన్లు, హాలోజన్లు, జడవాయువులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. వివిధ కుటుంబాలలోని మూలకాలను గుర్తించే నైపుణ్యం సాధించాలి. వాటిలో రేడియోధార్మికత కలిగిన వాటి పట్ల ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆవర్తన పట్టికపై పట్టు పెంచుకోవాలంటే..ఆవర్తన పట్టికను మనం నిత్యం చూసే ప్రాంతం (రీడింగ్ టేబుల్ లేదా డ్రెస్సింగ్ టేబుల్, స్విచ్చ్ బోర్డు తదితర)లో స్టిక్ చేసి పరిశీలిస్తూండాలి. ఆవర్తన ధర్మాలైన పరమాణు సైజు, అయనీకరణ శక్మం, రుణ విద్యుదాత్మకత, రసాయన ధర్మం వంటి అంశాలకు కూడా ప్రిపరేషన్లో తగినంత ప్రాధాన్యతనివ్వాలి. రసాయన బంధంలో అయానిక, సమయోజనీయ పదార్థాలను గుర్తించే సామర్థ్యం పెంచుకోవాలి. ద్విబంధం, త్రిబంధం ఏ అణువులో ఉంటాయో గుర్తు పెట్టుకోవాలి. హైడ్రోజన్ బంధం అనువర్తనాలు, పదార్థాల ద్రావణీయత, అణువుల ఆకృతి, బంధ కోణం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రేడియోధార్మికత, కేంద్రక రసాయన శాస్త్రం: సహజ, కృత్రిమ రేడియోధార్మికత, ఆల్ఫా, బీటా, గామా వికిరణాలు-ధర్మాలు, కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం -అనువర్తనాలు, అణు రియాక్టర్లకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు, భారజల ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవడం ప్రయోజనకరం. రసాయన పదార్థాలు: వివిధ మూలకాల ధర్మాలతోపాటు ఆయా మూలకాలు ఏర్పరిచే ముఖ్యమైన సమ్మేళనాలపై తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ క్రమంలో పదార్థాల రసాయన నామాలు, వాటి ఉపయోగాలపై ప్రశ్నలు ఇస్తుంటారు. హైడ్రోజన్, సోడియం, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, కార్బన్, సిలికాన్, టిన్, లెడ్, నైట్రోజన్, ఫాస్పరస్, ఆక్సిజన్, సల్ఫర్, వివిధ హాలోజన్లు, జడవాయువులు, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మొదలైన మూలకాలు, వాటి సమ్మేళనాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంధనాలు: ఘన, ద్రవ, వాయు ఇంధనాల శ్రేష్టత, వివిధ ఇంధనాలలోని అనుఘటక రసాయన పదార్థాలపై ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువ. ఇందులో సీఎన్జీ, ఎల్పీజీ, బయోగ్యాస్, గోబర్ గ్యాస్, వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రధానమైనవి. అదే సమయంలో పెట్రోలియం గురించి కూడా నేర్చుకోవాలి. ఉదాహరణ-ఎల్పీజీలో ఉండే ప్రధాన వాయువు? (గ్రూప్-1, 2012). సమాధానం: బ్యూటేన్ లోహశాస్త్రం: రసాయన శాస్త్రంలో మరో ముఖ్యమైన విభాగం లోహశాస్త్రం. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం రాగి మొదలు కంచు, ఇత్తడి, స్టీల్ వంటి మిశ్రమ లోహాలు వాటి అనువర్తనాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వివిధ లోహాల ఖనిజాలు (ఉదాహరణ- అల్యూమినియం ఖనిజం-బాక్సైట్), లోహ నిష్కర్షణ ప్రక్రియలోని వివిధ సూత్రాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణ-భర్జనం, భస్మీకరణం. జీవాణువులు, పాలీమర్లు, ఔషధాలు: జీవవ్యవస్థ నిర్మాణం, పని చేయడంలోనూ వివిధ పదార్థాలు పాల్గొంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, లిపిడ్లు, హార్మోన్లు, విటమిన్లు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే జీవశాస్త్రంతో అన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. రబ్బర్, సెల్యూలోజ్ ఉత్పన్నాలు, పీవీసీ, టెఫ్లాన్, బేకలైట్ వంటి పాలీమర్లు అనువర్తనాలను వివరంగా చదవాలి. యాంటీపెరైటిక్స్, అనాల్జెసిక్లు, యాంటీబయాటిక్స్, సెడెటివ్స్, యాంటాసిడ్స్ వంటి సాధారణ ఔషధాల గురించి తెలుసుకోవాలి. టీ, సిగరెట్, గంజాయి, శీతలపానీయాల్లో ఉండే పదార్థాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఆమ్లాలు-క్షారాలు: మన ఉదరంలో బలమైన హైక్రోక్లోరికామ్లం ఉంటుంది. తినే సోడా, తమలపాకుకు పూసే సున్నపు తేట క్షార ధర్మం కలిగి ఉంటుంది. వెనిగర్, నిమ్మ ఉప్పు, చీమల కాటు ద్వారా వచ్చే స్రవం అన్నీ ఆమ్లాలే. ఆమ్లాలు-క్షారాలు కలిసి తటస్థీకరణం జరిగితే ఏర్పడేది లవణం. ఇలా వివిధ ఆమ్లాలు- క్షారాలు, లవణాలపై సమాచారాన్ని సేకరించాలి. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలను పరిశీలిస్తూ చదవడం ప్రయోజనకరం. వివిధ ప్రక్రియలు: బీర్, వైన్ తయారీ, సముద్రపు నీటి నుంచి స్వాదు జలం తయారీ, మొక్కలు నీటిని పీల్చుకోవడం వంటి వివిధ ప్రక్రియలకు సంబంధించిన కిణ్వప్రక్రియ, ద్రవాభిసరణం, తిరోగామి ద్రవాభిసరణం వంటి ప్రక్రియల గురించి ప్రశ్నలు అడగొచ్చు. ద్రావణాలు: ద్రావణం అంటే ద్రవం అని అందరూ భావిస్తుంటారు. కానీ గాలి వంటి వివిధ వాయువుల సజాతీయ మిశ్రమం కూడా ద్రావణమే. అసంతృప్త, సంతృప్త, అతి సంతృప్త ద్రావణాలు, నిజ ద్రావణం, అవలంబనం, కొల్లాయిడ్ల అనువర్తనాలపై ప్రశ్నలు రావచ్చు. మిశ్రమాలు, సమ్మేళనాలు: పదార్థ స్థితిగతుల ఆధారంగా మిశ్రమాలను వేరు చేసే పద్ధతులు, మిశ్రమాలు-సంయోగ పదార్థాల మధ్య భేదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వీటిపై అడిగే ప్రశ్నలు ప్రాథమిక భావనలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ముందుగా మిశ్రమం అంటే ఏమిటి? సంయోగ పదార్థం అంటే ఏమిటి? వంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. కాలుష్యం: పెరుగుతున్న కాలుష్యం కారణంగా పోటీ పరీక్షల్లో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. హరిత గృహ ప్రభావం లేదా భౌగోళిక తాపం, ఓజోన్ పొరకు చిల్లులు, ఆమ్ల వర్షాలు, ఫ్లోరోసిస్, వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఫార్మా పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు, అగ్ని పర్వతాలు, గాలి-నీటిలోకి విడుదలయ్యే కలుషితాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. సూచనలు: - బాయిల్, చార్లెస్ వంటి వాయు నియమాల అనువర్తనాలను పరిశీలించాలి. - రసాయన శాస్త్ర గతిని మార్చిన ఆవిష్కరణలు, సంబంధిత శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలపై కూడా దృష్టి సారించాలి. - నీటి కాఠిన్యతకు కారణమైన లవణాలు, కాఠిన్యతను పోగొట్టే పద్ధతులను తెలుసుకోవాలి. - ఎరువులు, పురుగు మందులు, గాజు, సిమెంట్, అగ్గి పెట్టెలు, టపాకాయల వంటి పరిశ్రమల్లో ఉపయోగించే పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి. చదవాల్సినవి: 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫిజికల్ సైన్స్ పుస్తకాలు (పాతవి) ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం పుస్తకాలు ఆయా అంశాలను చదివేటప్పుడు లోతుగా వెళ్లకుండా ధర్మాలు, ఉపయోగాలు వరకు పరిమితమైతే సరిపోతుంది. చదివేటప్పుడు ప్రతి వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటూ చదవాలి. ప్రతి అంశాన్ని ప్రశ్న కోణంలో ఊహించుకుంటూ ప్రిపేర్ కావడం మంచిది. -
రసాయన పరిశ్రమ స్థాపించొద్దు; గ్రామస్తుల ధర్నా
మెదక్: జిల్లాలోని తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లిలో బుధవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాము నివాసించే ప్రాంతంలో రసాయన పరిశ్రమను స్థాపించొద్దంటూ వారు ధర్నాకు దిగారు. రసాయన పరిశ్రమ నిర్మాణం విషయమై వచ్చిన జాయింట్ కలెక్టర్‌ను గ్రామస్తులు నిర్భంధించినట్టు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. గ్రామస్తుల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం. -
కాలుష్య కోరల్లో నక్కపల్లి
నక్కపల్లి రూరల్, న్యూస్‌లైన్: నక్కపల్లి మండలం కాలుష్యం కోరల్లో చిక్కుకోనుంది. ఈ మండలంలో తీర ప్రాంతం వెంబడి కాలుష్యంతో కూడిన పలు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేసిన హెటిరో డ్రగ్స్ రసాయన పరిశ్రమ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తీరానికి చేరువలోని డీఎల్ పురం, గునిపూడి, నెల్లిపూడి, అమలాపురం, చందనాడ తదితర ప్రాంతాల్లో బ్రైటన్ అణు విద్యుత్ పరిశ్రమ, ఇండ్రస్ట్రియల్ పార్క్, థర్మల్ పవర్ ప్లాంటు తదితర పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా భూసేకరణపై రైతులకు గతంలో 4(1) నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు భలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణను నిలుపుదల చేయాలని కోర్టు స్టే ఇచ్చింది. కోర్టులో స్టే ఉండగా థర్మల్ పవర్ ప్లాంట్, అణువిద్యుత్ పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రజా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటును ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో రాజయ్యపేట సమీపంలో ఉన్న హెటిరో, అడ్డరోడ్డు వద్ద ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇందులో రైతులు, ప్రజలు వ్యతిరేకించినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఈ ప్రాంతంలో ప్రజలు పూర్తిగా వ్యవసాయం, వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలు జీవనోపాధి కోల్పోవడంతో పాటు గ్రామాలను సైతం ఖాళీ చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో కూడిన పరిశ్రమల వల్ల నక్కపల్లి మండలం పూర్తిగా కాలుష్యం కోరల్లో చిక్కుకోక తప్పదని, భవిష్యత్‌లో ఈ ప్రాంత ప్రజలకు ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.