కాలుష్య కోరల్లో నక్కపల్లి | Pollution slipped nakkapalli | Sakshi
Sakshi News home page

కాలుష్య కోరల్లో నక్కపల్లి

Published Tue, Aug 27 2013 4:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

Pollution slipped nakkapalli

నక్కపల్లి రూరల్, న్యూస్‌లైన్:  నక్కపల్లి మండలం కాలుష్యం కోరల్లో చిక్కుకోనుంది. ఈ మండలంలో తీర ప్రాంతం వెంబడి కాలుష్యంతో కూడిన పలు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేసిన హెటిరో డ్రగ్స్ రసాయన పరిశ్రమ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తీరానికి చేరువలోని డీఎల్ పురం, గునిపూడి, నెల్లిపూడి, అమలాపురం, చందనాడ తదితర ప్రాంతాల్లో బ్రైటన్ అణు విద్యుత్ పరిశ్రమ, ఇండ్రస్ట్రియల్ పార్క్, థర్మల్ పవర్ ప్లాంటు తదితర పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దీనిలో భాగంగా భూసేకరణపై రైతులకు గతంలో 4(1) నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు భలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణను నిలుపుదల చేయాలని కోర్టు స్టే ఇచ్చింది. కోర్టులో స్టే ఉండగా థర్మల్ పవర్ ప్లాంట్, అణువిద్యుత్ పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రజా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటును ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో రాజయ్యపేట సమీపంలో ఉన్న హెటిరో, అడ్డరోడ్డు వద్ద ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.

ఇందులో రైతులు, ప్రజలు వ్యతిరేకించినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఈ ప్రాంతంలో ప్రజలు పూర్తిగా వ్యవసాయం, వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలు జీవనోపాధి కోల్పోవడంతో పాటు గ్రామాలను సైతం ఖాళీ చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో కూడిన పరిశ్రమల వల్ల నక్కపల్లి మండలం పూర్తిగా కాలుష్యం కోరల్లో చిక్కుకోక తప్పదని, భవిష్యత్‌లో ఈ ప్రాంత ప్రజలకు  ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement