గుమ్మడిదలలోని మహాసాయి పరిశ్రమలో ఎగిసి పడుతున్న మంటలు
జిన్నారం/గుమ్మడిదల(పటాన్‌చెరు): సంగారెడ్డి జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలను కలుపుతున్న క్రమంలో మంటలు ఎగిసిపడ్డాయని, దీంతో తాము బయటకు పరుగులు పెట్టామని కార్మికులు చెబుతున్నారు. గుమ్మడిదల గ్రామంలోని మహాసాయి లెబొరేటరీస్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం కార్మికులు రసాయనాలను కలుపుతుండగా ప్రతి చర్య జరగడంతో మంటలు అంటుకున్నాయి. కార్మికులు మంటలను అదుపు చేయలేక బయటకు పరుగులు తీశారు.
మంటల కారణంగా పరిశ్రమ ఆవరణలో ఉన్న రసాయన డ్రమ్ములు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ సంఘటనలో ఫ్యాక్టరీ ఆవరణలోని రెండు డీసీఎంలు, ట్యాంకర్ కాలిబూడిదయ్యాయి. నర్సా పూర్, జీడిమెట్ల, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీల నుంచి పదివరకు ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు వచ్చాయి. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి హాని జరగలేదని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. అయితే, పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తో కార్మికులెవరైనా లోపల చిక్కుకొని ఉంచవచ్చేమోనని అనుమానిస్తున్నారు. పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులకు మాత్రం గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరగ్గా రాత్రి 8 గంటల వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment