పరిశ్రమల్లో కార్మికులకు కరువైన రక్షణ
రియాక్టర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు
ఏడాదిలో దాదాపు 30 మంది మృత్యువాత
పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు
జిన్నారం : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల్లో 400 పైచిలుకు భారీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ రసాయన పరిశ్రమలే. సుమారు పది వేల మంది పర్మినెంటు, 35 వేల మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల్లో 50 శాతం పైగా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు పలువురు కాంట్రాక్టు కార్మికులుగా విధులను నిర్వహిస్తున్నారు.
రసాయన పరిశ్రమల్లో పని చేసే వారికి తగిన అనుభవం, అవగాహన నైపుణ్యం తప్పనిసరి కాగా, చాలామంది అవే మీ లేకుండానే విధుల్లోకి చేరిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు.. ప్రమాదమని తెలిసీ జీవనభృతి కోసం ఆయా విధులు నిర్వర్తించడానికి సిద్ధమైపోతున్నారు. కార్మికుల అవసరాన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఆసరాగా తీసుకుని వారి చేత ఇష్టానుసారం పనులు చేయించుకుంటున్నాయి.
ప్రాణాలు మింగేస్తున్న రియాక్టర్లు
రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు ప్రమాదకరంగా మారాయి. గడచిన ఏడాదిలో దాదాపు 30 మంది కార్మికులు విధి నిర్వహణలో మృత్యువాతపడినట్టు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. రియాక్టర్లను సరిగా నిర్వహించకపోవడం, వాటి వద్ద అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని విధుల్లో ఉంచకపోవడమే దుర్ఘటనలకు కారణమవుతోంది.
కొన్నిసార్లు రియాక్టర్లు పేలి.. ఇంకొన్ని సార్లు వాటిలోకి దిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్టాలకు చెందిన కార్మికులే ఉన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు మృతి చెందితే వారిని రహస్యంగా స్వస్థలాలకు తరలించి యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. నష్టపరిహారం ఊసే లేదు. స్థానికంగా ఉన్న కార్మికులు మృతి చెందితే కార్మిక సంఘాల ఒత్తిడికి తలొగ్గి యాజమాన్యాలు ఎంతోకొంత పరిహారం ఇస్తున్నాయి.
కార్మిక శాఖ ఏం చేస్తున్నట్టు?
పారిశ్రామికవాడల్లోని కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నా.. కార్మిక శాఖ అధికారులు అందుకు కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. తాజాగా గడ్డపోతారం, బొల్లారం పారిశ్రామికవాడల్లోని రెండు పరిశ్రమల్లో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద కారణాలను వెలికి తీయడంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా?, పరిశ్రమను సక్రమంగా నిర్వహిస్తున్నారా?, అన్ని అనుమతులు ఉన్నాయా?, కార్మికుల భద్రతకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? అనే వాటిపై అధికారులు ఇప్పటికీ దృష్టి సారించిన దాఖలాల్లేవు. అతి తక్కువ వేతనాలకు కార్మికులను విధుల్లోకి తీసుకుని వారి చేత ప్రమాదకర పనులు చేయిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రమాదాలకు కారణాలివే..
► అనుభవం, నైపుణ్యం గల కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం
► రియాక్టర్లు, ఇతర ప్రమాదకర యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు తగిన రక్షణ పరికరాలను అందించకపోవడం
► భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కార్మిక శాఖ తనిఖీ చేయడం లేదు
► రక్షణ విషయంలో కార్మికులకు ఎప్పటికప్పుడు తగిన అవగాహన కల్పించాలి. అది జరగడం లేదు.
పేలుతున్న నిర్లక్ష్యం.. ప్రాణమే మూల్యం
Published Thu, May 7 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement