పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం 133 | India ranks 133rd in World Press Freedom | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం 133

Published Fri, Apr 29 2016 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం 133

పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థానం 133

కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్స్

రాష్ట్రీయం
ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా
మెదక్, మహబూబ్‌నగర్

తెలంగాణలోని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలను ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద ఆయా జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అన్నింటినీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నారు.

అమెరికాకు చెందిన మాండలెజ్ ఇంటర్నేషనల్‌లో భాగమైన మాండలెజ్ ఇండియా... శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ప్లాంటులో తొలిదశ ఉత్పత్తిని ఏప్రిల్ 25న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.

స్పోర్ట్స్
లారెస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా జకోవిచ్

ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పిలిచే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులను బెర్లిన్‌లో ఏప్రిల్ 18న ప్రదానం చేశారు.అవార్డు విజేతలు: స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్: నొవక్ జకోవిచ్ (టెన్నిస్). స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్: సెరెనా విలియమ్స్ (టెన్నిస్). బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్: జోర్డాన్ స్పీథ్ (గోల్ఫ్). టీం ఆఫ్ ద ఇయర్: ఆల్ బ్లాక్స్ (రగ్భీ యూనియన్). లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు: నికీ లాడా (ఫార్ములావన్).

బార్సిలోనా ఓపెన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. ఏప్రిల్ 24న బార్సిలోనాలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కీ నిషికోరి (జపాన్)ను నాదల్ ఓడించాడు. నాదల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి.  తాజా టైటిల్ విజయంతో క్లే కోర్టులపై 49 సార్లు టైటిల్ నెగ్గిన గిలెర్మో విలాస్ రికార్డును సమం చేశాడు. మొత్తంగా నాదల్‌కు ఇది 69వ సింగిల్స్ టైటిల్.

భారత రెజ్లర్ సందీప్ తోమర్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగోలియాలో ఏప్రిల్ 24న జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్‌లో 57 కిలోల విభాగంలో సందీప్ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత పొందాడు.

అవార్డులు
తారా గాంధీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం  

ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌ను మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో అందుకున్నారు. శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య రంగాల్లో చేసిన కృషికి గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. తారా గాంధీ గత 28 ఏళ్లుగా గాంధీజీ స్థాపించిన కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలకు సేవలందిస్తున్నారు.

జాతీయం
సివిల్స్ సర్వీసెస్ డే

న్యూఢిల్లీలో ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డేను నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛ విద్యాలయ అవార్డు: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్; దాద్రానగర్ హవేలీలు స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు ఎంపికయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో ముందున్న జిల్లాల అధికారులకు సివిల్ సర్వీసెస్ డేలో ప్రధాని అవార్డులను అందజేశారు.

పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 133వ స్థానం
పత్రికా స్వేచ్ఛపై జరిపిన సర్వేలో భారత్..133వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఏప్రిల్ 19న విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచీలో ఫిన్‌లాండ్ వరుసగా ఆరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో నెదర్లాండ్స్ (2), నార్వేలు (3) ఉన్నాయి. మొత్తం 180 దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.

దేశంలో 10.38 కోట్ల మంది వృద్ధులు
దేశంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 22న విడుదల చేసిన భారత్‌లో వృద్ధాప్యం-2016 నివేదిక ప్రకారం 2011 నాటి జనాభా లెక్కల నాటికి మొత్తం జనాభాలో 10.38 కోట్ల మంది (8.6 శాతం) వృద్ధులున్నారు. 2001లో వీరి సంఖ్య 7.66 కోట్లు (5.6 శాతం). దేశంలోని మొత్తం వృద్ధుల్లో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ
స్టెల్త్ యుద్ధవిమానాన్ని పరీక్షించిన జపాన్

జపాన్ తొలిసారిగా అభివృద్ధి చేసిన స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఏప్రిల్ 22న ప్రయోగించింది. శత్రుదేశాల రాడార్లకు అందకుండా ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న దీనికి ఎక్స్-2 అని పేరు పెట్టింది. ఇప్పటి వరకు ఇలాంటి స్టెల్త్ యుద్ధవిమానాలను అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే రూపొందించాయి.

ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ఏప్రిల్ 23న విజయవంతంగా పరీక్షించింది. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది.

అంతర్జాతీయం
పారిస్ ఒప్పందంపై 171 దేశాల సంతకాలు
గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 22న భారత్ సంతకం చేసింది.  2015 డిసెంబర్‌లో కుదిరిన ఈ ఒప్పందంపై భారత్ తరఫున కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంతకం చేశారు. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 171 దేశాలు సంతకాలు చేశాయి. ఒక అంతర్జాతీయ ఒప్పందంపై ఒకే రోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి.

వార్తల్లో వ్యక్తులు
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి సల్మాన్ ఖాన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఏప్రిల్ 22న ప్రకటించింది. బాలీవుడ్ నటుడిని ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడం ఇదే తొలిసారి.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన అధికార పరిధి విస్తరణలో భాగంగా ఏప్రిల్ 20న సర్వసైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. జిన్‌పింగ్ ఇప్పటికే అధికార కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, సైన్యాన్ని నియంత్రించే కేంద్ర సైనిక కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 22న క్రీడలు, కళలు, సామాజికసేవ, సాహిత్యం, సైన్స్ రంగాల నుంచి మొత్తం ఆరుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. ఎంపికైన వారిలో బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్, మాజీ క్రికెటర్ నవ్ జోత్‌సింగ్ సిద్ధూ, నరేంద్ర జాదవ్ (ఆర్థికం) తదితరులున్నారు.

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement