(ఐఐఎం)ల.. బ్రాండ్ ఇమేజ్ మరోసారి
నిరూపితమైంది. ఐఐఎం విద్యార్థులు..
ఇండస్ట్రీకి హాట్‌కేక్స్ అని స్పష్టమవుతోంది.
విదేశీ పరిశ్రమలకు సైతం ఐఐఎం
విద్యార్థులు.. బెస్ట్ ప్రిఫరెన్స్‌గా నిలుస్తున్నారు.
ఇందుకు నిదర్శనం.. ఐఐఎం క్యాంపస్‌లలో
కొనసాగుతున్న.. సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్
(ఎస్‌పీఓ). రెండు నెలల వ్యవధిలో ఉండే
ఇంటర్న్‌షిప్ దిశగా.. ఎస్‌పీఓ స్టైపెండ్
రూ. రెండు లక్షలకు పైగానే ఉంది. జాతీయ
స్థాయిలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
కొంత తగ్గే అవకాశం ఉందనే
వార్తల నేపథ్యంలో.. ఐఐఎంలలో పెరిగిన
సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌పై విశ్లేషణ..
రెండేళ్ల పీజీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో కంపెనీల్లో రెండు నెలల ఇంటర్న్‌షిప్ చేసేందుకు మార్గం ఎస్‌పీఓ. విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు అందించే ఎస్‌పీఓల విషయంలో ఐఐఎంల విద్యార్థులను నియమించుకోవడానికి బహుళ జాతి సంస్థలు రూ.లక్షలు ఆఫర్ చేస్తుండటం విశేషం. 2016-18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఐఐఎంలలో ఈ ప్రక్రియ ముగిసింది. మిగతా ఐఐఎంలలో ఈ నెల చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
పెరిగిన ఎస్‌పీఓల శాతం
క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో ఈ ఏడాది మందగమన పరిస్థితులు ఉన్నాయనే నిపుణుల అభిప్రాయాల నడుమ కొన్ని ఐఐఎంలలో ముగిసిన ఎస్‌పీఓల్లో మాత్రం ఆఫర్ల సంఖ్య పెరగడం విశేషం. ఎస్‌పీఓ ముగిసిన 8 ఐఐఎంలలో ఆఫర్ల సంఖ్య సగటున 25 నుంచి 30 శాతం పెరిగింది. కొత్త, పాత ఐఐఎంలు అనే బేధం లేకుండా అన్నిటిలోనూ ఈ శైలి కొనసాగడం మరో విశేషం.
అహ్మదాబాద్ టు విశాఖపట్నం
టాప్ బీ స్కూల్‌గా అందరి మన్ననలు అందుకుంటున్న అహ్మదాబాద్ ఐఐఎం మొదలు గత ఏడాదే ప్రారంభమైన విశాఖపట్నం వరకు అంతటా ఎస్‌పీఓల్లో పెరుగుదల నమోదవడం విశేషం. సెప్టెంబర్ చివరలో ప్రారంభమై నవంబర్ రెండో వారం వరకు కొనసాగిన ఎస్‌పీఓ ఆయా ఐఐఎంలలో రెండు, మూడు రోజుల్లోనే ముగిసింది. విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో సమ్మర్ ఇంటర్న్స్‌గా విధులు నిర్వహించే అవకాశం లభించింది.
దాదాపు అందరికీ
అహ్మదాబాద్, కోజికోడ్, బెంగళూరు, కోల్‌కతా వంటి పాత ఐఐఎంలలో 100 శాతం మందికి ఆఫర్లు లభించాయి. ఐఐఎం బెంగళూరులో మొత్తం 402 మంది విద్యార్థులకూ ఎస్‌పీఓలు దక్కాయి. ఐఐఎం కోజికోడ్‌లోనూ మొత్తం 364 మంది పొందారు. ఐఐఎం లక్నోలో మొత్తం 458 మంది విద్యార్థులకూ ఎస్‌పీఓలు లభించాయి. కొత్తదైన ఐఐఎం ఇండోర్‌లో సైతం 100 శాతం ఎస్‌పీఓలు దక్కడం విశేషం. ఐఐఎం విశాఖపట్నంలో 60 మంది విద్యార్థుల్లో 54 మంది వీటిని చేజిక్కించుకున్నారు.
సంస్థల సంఖ్యలోనూ పురోగమనం
గత ఏడాదితో పోల్చితే సగటున 25 నుంచి 40 శాతం పెరుగుదల కనిపించింది. కొత్త సంస్థలు భారీగా పెరిగాయి. ఐఐఎం కోజికోడ్‌లో 119 సంస్థలు ఎస్‌పీఓ నిర్వహించగా అందులో 45 శాతం కొత్తవే. ఐఐఎం బెంగళూరులో 150 సంస్థలు పాల్గొనగా అందులో 30 శాతం పైగా కొత్త సంస్థలే ఉన్నాయి. ఐఐఎం కోల్‌కతాలో 24 శాతం పెరుగుదల కనిపించింది. ఇదే ధోరణి ఇతర సంస్థల్లోనూ ప్రతిబింబించింది.
పెరిగిన మొత్తం
ఎస్‌పీఓల్లో ఈసారి స్టైపెండ్ సగటున 15 నుంచి 25 శాతం పెరిగింది. అంకెల్లో చూస్తే సగటున రూ.1.25 లక్షల చొప్పున లభించాయి. ఐఐఎం కోజికోడ్‌లో సగటు స్టైపెండ్ రూ.2.5 లక్షలు.
కన్సల్టింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ హవా
ఎస్‌పీఓల్లో పాల్గొన్న కంపెనీల ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే ఎప్పటి మాదిరిగానే ఈసారీ కన్సల్టింగ్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగ సంస్థల హవా కొనసాగింది. ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థలు పాల్గొన్నాయి. బోస్టన్ కన్సల్టింగ్, మెకిన్సే, మోర్గాన్ స్టాన్లీ వంటి వాటిని ఉదాహరణగా పేర్కొనొచ్చు. బీఎఫ్‌ఎస్‌ఐకు సంబంధించి ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్; అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బార్‌క్లేస్, సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఎస్‌పీఓ సీజన్ తొలి రోజే ఆఫర్ల వెల్లువ కురిపించాయి. ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగంలో ఇంటర్న్స్‌ను రిక్రూట్ చేసుకోవడానికి బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు ప్రాధాన్యం ఇచ్చాయి.
మారిన దృక్పథం
ఎస్‌పీఓలను అంగీకరించే విషయంలో ఈ ఏడాది విద్యార్థుల దృక్పథంలో మార్పు కనిపించింది. చాలా మంది సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఎస్‌పీఓలు ముగిసిన ఐఐఎంలలో ఆఫర్ల యాక్సెప్టెన్స్ కోణంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్ సంఖ్య 30 శాతం నమోదయ్యాయి.
ఈ-కామర్స్.. తగ్గిన హవా
ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఇన్‌స్టిట్యూట్ వర్గాల నుంచి తిరస్కృతికి గురైన సంగతి తెలిసిందే. ఇది ఐఐఎంల ఎస్‌పీఓ సీజన్‌లోనూ ప్రతిబింబించింది. ఈ-కామర్స్ సంస్థలు అతి స్వల్ప సంఖ్యలో పాల్గొన్నాయి. అయితే అమెజాన్ డాట్ కామ్ ఈ-కామర్స్ సంస్థల పరంగా అగ్ర భాగంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్‌లోని మూడు క్లస్టర్లలో నిర్వహించిన ఎస్‌పీఓలో తొలి క్లస్టర్‌లో 25 ఆఫర్లతో అమెజాన్ టాప్ రిక్రూటర్‌గా నిలిచింది. ఐఐఎం బెంగళూరులోనూ 20 ఆఫర్లు ఇచ్చింది.
ప్రముఖ బి-స్కూల్స్‌లోనూ ఇదే ట్రెండ్
ఎస్‌పీఓల్లో ఆఫర్ల వెల్లువ ఐఐఎంలే కాకుండా ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లోనూ కనిపించింది. ప్రైవేట్ బి-స్కూల్స్ పరంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచే ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో 361 మంది విద్యార్థుల్లో అందరికీ ఎస్‌పీఓలు లభించాయి. ఇక్కడ సగటు స్టైపెండ్ రూ.1.10 లక్షలు నమోదైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్‌లోనూ ఈ హవా కనిపించింది. మొత్తం 288 మంది విద్యార్థుల్లో అందరికీ ఎస్‌పీఓలు లభించడమే కాకుండా సగటు స్టైపెండ్ రూ.1.24 లక్షలు నమోదవడం, 60 శాతానికి పైగా విద్యార్థులకు రూ.లక్షకు పైగా అందడం విశేషం.
ఎస్‌పీఓతో ఏం చేయాలి
రెండేళ్ల మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎస్‌పీఓ నిర్వహిస్తారు. వీటిలో ఎంపికైన అభ్యర్థులు ఫస్టియర్ పరీక్షలు ముగిశాక లభించే రెండు నెలల వ్యవధిలో తాము ఎంపికైన సంస్థలో, విభాగంలో విధులు నిర్వర్తించాలి. రెగ్యులర్ టెర్మినాలజీలో దీన్ని ఇంటర్న్‌షిప్‌గా పరిగణిస్తారు. ఈ రెండు నెలల వ్యవధిలో తమ సంస్థలో ఇంటర్న్ ట్రైనీగా పని చేసినందుకు సంస్థలు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహాన్నే ఎస్‌పీఓ ఆఫర్ లేదా స్టైపెండ్ అంటారు. ఈ సమయంలో విద్యార్థులు సంబంధిత సంస్థలో చక్కటి పనితీరు చూపాలి. ఇలా చేస్తే అదే కంపెనీలో కొనసాగేలా సంస్థలు అభ్యర్థుల ఆసక్తిని తెలుసుకుంటాయి.
ఫైనల్ ప్లేస్‌మెంట్స్
ఎస్‌పీఓల్లో నమోదైన గణాంకాలు, ఆఫర్లు, కంపెనీల సంఖ్య, వారి శైలిని పరిశీలిస్తే త్వరలో ప్రారంభం కానున్న ఫైనల్ ప్లేస్‌మెంట్ సీజన్‌కు శుభ సూచికలుగా పేర్కొనొచ్చు. డిసెంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు సాగే ఫైనల్ ప్లేస్‌మెంట్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణుల అభిప్రాయం.
ఫైనల్ ప్లేస్‌మెంట్‌కు మార్గదర్శకంగా
ఎస్‌పీఓ సీజన్‌లో కంపెనీలు అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన విధానాలను త్వరలో జరగనున్న ఫైనల్ ప్లేస్‌మెంట్ ప్రక్రియకు మార్గదర్శకంగా భావించాలి. కొన్ని సంస్థలు ఎస్‌పీఓ తేదీకి ముందు రోజు బృంద చర్చలు, రాత పరీక్ష, మౌఖిక పరీక్షలు నిర్వహించాయి. ఐఐఎం ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో ఇవి సహజమే. త్వరలో వీటిని ఎదుర్కోనున్న అభ్యర్థులు ఎస్‌పీఓలో పాల్గొన్న వారి ద్వారా కంపెనీలు ఆశించే లక్షణాలు, గ్రూప్ డిస్కషన్‌లలో ప్రాధాన్యమిచ్చిన టాపిక్‌ల గురించి తెలుసుకోవడం మేలు చేస్తుంది.
- గౌతమ్ ఈశ్వర్,
ప్లేస్‌మెంట్ కమిటీ సెక్రటరీ, ఐఐఎం- ఇండోర్