
జైన, బౌద్ధ మతాలు
మలి వేదకాలం చివర్లో నెలకొన్న పరిస్థితులే క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మత ఉద్యమాలు
మలి వేదకాలం చివర్లో నెలకొన్న పరిస్థితులే క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మత ఉద్యమాలు ప్రారంభం కావడానికి కారణమయ్యాయి. ఈ ఉద్యమాల్లో ముఖ్యమైనవి జైన, బౌద్ధ మతాలు.
కారణాలు
ఈ కాలంలో సమాజంలో వర్ణ వ్యవస్థ బలపడింది. ఈ వ్యవస్థలో మిగిలిన మూడు వర్ణాలపై బ్రాహ్మణులు ఆధిక్యత కలిగి ఉన్నారు. కానీ విశాలమైన భూ భాగాల్లో రాజ్యాలను స్థాపించి రాజ్యాధికారంతోపాటు రాజకీయంగా ఉన్నత దశలో ఉన్న క్షత్రియులు సామాజికంగా ఉన్నత దశను కోరుకున్నారు. జైన, బౌద్ధ మత స్థాపకులు ఇద్దరూ క్షత్రియులే. ఈ కాలంలో వైశ్యుల ఆర్థిక స్థితి మెరుగుపడింది. కానీ సామాజికంగా వారి స్థాయిలో మార్పు లేనందువల్ల వారిలో కూడా సామాజిక అశాంతి కలిగింది. శూద్రులు, స్త్రీలు తమకు మోక్షం ఇవ్వని వైదిక మతం పట్ల అసంతృప్తికి లోనయ్యారు. ఇదే సమయంలో అందరికీ సామాజిక సమానత్వం, మోక్షాన్ని ప్రసాదించే జైన, బౌద్ధ మతాల పట్ల వీరంతా ఆదరణ చూపారు. పైగా వీటి మోక్ష మార్గం వ్యయ రహితం, సులువైనదీ.
క్రీ.పూ.6వ శతాబ్దంలో ఇనుప లోహ పరిజ్ఞానం వల్ల గంగానదీ మైదాన ప్రాంతం సాగులోకి వచ్చింది. దీంతో వ్యవసాయాభివృద్ధికి గొప్ప అవకాశం ఏర్పడింది. వ్యవసాయాన్ని విస్తరించడంలో పశువుల పాత్ర ఎంతో కీలకమైంది. అయితే వైదిక యజ్ఞయాగాది క్రతువుల పేరిట విలువైన పశు సంపదకు తీవ్ర నష్టం కలగడంతో వ్యవసాయ వర్గాల నుంచి వైదిక క్రతువుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత దేశంలో క్రీ.పూ.6వ శతాబ్ద కాలాన్ని రెండో నగరీకరణగా భావిస్తారు.
వ్యవసాయాభివృద్ధితో మిగులు ఏర్పడటం, తొలిసారిగా నాణేలు వాడకంలోకి రావడం మొదలైన కారణాల వల్ల వ్యాపార వాణిజ్యాలకు గొప్ప ప్రోత్సాహం లభించింది. వైదిక గ్రంథాలు వడ్డీ వ్యాపారాన్ని, సముద్రయానాన్ని నిషేధించడంతో వ్యాపారాభివృద్ధికి ఆటంకం కలిగింది. ఇదే సమయంలో జైన, బౌద్ధాలు ఇటువంటి నిషేధాలు విధించకపోగా తమ అహింసా సిద్ధాంతం ద్వారా వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి చెందడానికి తగిన శాంతియుత వాతావరణం కల్పించాయి.
దీంతో వ్యాపార వర్గాల నుంచి వైదిక మతం కంటే ఈ కొత్త మతాల పట్ల అధిక మద్దతు లభించింది. జైన, బౌద్ధ మతాలు రెండూ గణతంత్ర రాజ్యాల్లో ప్రారంభించినవే. రాజరికాల్లోని బ్రాహ్మణాధిక్యత, ఇతర వివక్షతలకు ఇక్కడ స్థానం లేకపోవడమే కాకుండా ప్రజాస్వామిక విలువలకు ఇవి ప్రతీకలుగా నిలిచాయి. దీంతో ఈ కొత్త మతాల ప్రాభవానికి తగిన వేదిక లభించింది. ఈ మతాలను అధికంగా ఆదరించింది కూడా ఈ రాజ్యాల్లోని ప్రజలే. జైన , బౌద్ధ మతాలు వైదిక మతంలా బ్రాహ్మణులు, ఇతర ఉన్నత వర్గాల వారికి పరిమితమైన సంస్కృత భాషకు బదులు ప్రాకృతం, పాళి వంటి సామాన్య ప్రజానీకానికి దగ్గరగా ఉన్న సులువైన భాషల ద్వారా తమ ప్రచారాన్ని నిర్వహించాయి. దీంతో అవి వైదికం కంటే సులువుగా ప్రజలను చేరి వారి ఆదరణను పొందాయి.