ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
జాతీయం
అనర్హత ఆర్డినెన్స్ ఉపసంహరణ
వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎంఎల్‌ఏలు తక్షణమే అనర్హులు కాకుండా రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 2న ఉపసంహరించుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు సెప్టెంబర్ 24న కేంద్రం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3న ఆమోదం తెలిపింది. జూలై 30 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.
పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేబినెట్ తీర్మానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అంశాల పరిష్కారానికి, విభజన అంశాన్ని పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. మంత్రుల బృందం ఆరువారాల్లో సిఫార్సులు చేస్తుంది.
భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ బెల్జియం పర్యటన
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన బెల్జియం పర్యటనలో ఆ దేశ ప్రధానమంత్రి ఎలియా డి రూపోతో అక్టోబర్ 3న సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ప్రధాన మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉన్నత విద్య తదితర రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి తమ దేశ మద్దతును ప్రధాని డిరూపో పునరుద్ఘాటించారు.
రెమిటెన్సుల్లో భారత్‌కు మొదటి స్థానం
ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నిధులు (రెమిటెన్సులు) పొందడంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 2013లో భారత్ 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు పొంది మొదటి స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో అక్టోబర్ 3న తెలిపింది. చైనా 60 బిలియన్ డాలర్లు పొంది రెండో స్థానంలో నిలిచింది. 26 బిలియన్ డాలర్ల నిధులతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో ఉంది. 2013లో అభివృద్ధి చెందుతున్న దేశాలు పొందుతున్న మొత్తం రెమిటెన్సులు 414 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్‌కు ఆమోదం
ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 3న ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో అమలు చేస్తారు. ఈ పథకం కోసం మొత్తం 98,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో సమకూరుస్తాయి. ఈశాన్య, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి.
సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రత్యేక తరహా రాష్ట్రాల్లో 75:25 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తారు. ఈ పథకం విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు అత్యంత స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది. టీచింగ్- లెర్నింగ్ క్వాలిటీ, పరిశోధనలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ పథకం కిందకు 316 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 13,024 కళాశాలలను తీసుకువస్తారు.
ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 7న నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బ్యాంక్ చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని అక్టోబర్ 7న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి దీన్ని ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 500 కిలోల నుంచి వెయ్యి కిలోల బరువు ఉన్న వార్‌హెడ్లను మోసుకెళ్తుంది. దీన్ని 2003లో సైన్యంలో ప్రవేశపెట్టారు.
కరణ్ థాపర్‌కు ఐపీఐ పురస్కారం
సమకాలీన అంశాలపై, వివిధ రంగాల్లో ప్రముఖులతో టీవీ ఇంటర్వ్యూలు నిర్వహించడంలో పేరొందిన కరణ్ థాపర్ ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ (ఐపీఐ)-ఇండియా అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం ఫర్ 2013’కు ఎంపికయ్యారు. సీఎన్‌ఎన్ ఐబీఎన్ చానల్‌లో ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమం ద్వారా 2012లో ప్రజా సంబంధిత అంశాలపై విధాన నిర్ణేతలను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా వాటిపై దృష్టి సారించేలా కృషి చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐపీఐ-ఇండియా శాఖ అక్టోబర్ 7న తెలిపింది.
అంతర్జాతీయం
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
వైద్యశాస్త్రంలో చేసిన కృషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీర కణాల్లో అంతర్గతంగా, కణాల మధ్య రవాణా వ్యవస్థపై పరిశోధన చేసిన.. అమెరికాకు చెందిన జేమ్స్ రోత్‌మాన్, రాండీ షెక్‌మాన్‌తోపాటు జర్మనీ సంతతి శాస్త్రవేత్త థామస్ స్యూదోఫ్‌లను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నోబెల్ జ్యూరీ ప్రకటించింది. ఈ బహుమతి కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను ముగ్గురు శాస్త్రవేత్తలు అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తారు.
2050 నాటికి జనాభాలో భారత్ నెంబర్ వన్
2050 నాటికి భారత్ 160 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫిక్ స్టడీస్ తెలిపింది. ప్రస్తుతం భారత్ జనాభా 120 కోట్లు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న చైనా స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం చైనా జనాభా 130 కోట్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 710 కోట్ల్లుగా ఉంది.
ఒబామా ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీగా అరుణ్
అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన అరుణ్ ఎం.కుమార్‌ను అక్టోబర్ 4న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఆయన కె.పి.ఎం.జి కన్సల్టెన్సీ సంస్థలో భాగస్వామిగా, బోర్డు సభ్యుడిగా పనిచేశారు. విదేశీ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీతోపాటు అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగం డెరైక్టర్ జనరల్‌గా కూడా అరుణ్‌కుమార్ నియమితులయ్యారు.
వరల్డ్ టాయిలెట్ సమ్మిట్
వరల్డ్ టాయిలెట్ సదస్సు ఇండోనేషియాలో అక్టోబర్ 2న మొదలైంది. ఈ మూడు రోజుల సదస్సులో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో విసర్జన ప్రధానాంశాలుగా చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం, మురుగునీటి పారుదల సౌకర్యం అందుబాటులో లేదు. డయేరియాతో ప్రతి ఏటా 10 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సింగపూర్‌కు చెందిన జాక్‌సిమ్ 2001లో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు.
15.7 మిలియన్లమందికి ఆకలి బాధ
అభివృద్ధి చెందిన దేశాల్లో 15.7 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థలు తెలిపాయి. అక్టోబర్ 2న విడుదల చేసిన ప్రపంచంలో ఆహార భద్రత స్థితి - 2013 అనే నివేదికలో 2011-13లో మొత్తం 842 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు తెలిపింది. ఈ సంఖ్య 2010-12లో 868 మిలియన్లుగా ఉండేది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆకలి బాధతో ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 15.7 మిలియన్ల మంది ఆకలితో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
చురుకుగా, ఆరోగ్యంగా జీవించడానికి చాలినంత ఆహారం లేకపోవడాన్ని ఆకలి బాధగా నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న ఆర్థిక వృద్ధి ఆదాయాల పెరుగుదలకు, ఆహార లభ్యతకు తోడ్పడుతోందని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తిలో అధిక వృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆహార లభ్యతను మెరుగుపరుస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను ప్రతి ఏటా ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి, ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రచురిస్తాయి.
షట్‌డౌన్ ప్రకటించిన అమెరికా ప్రభుత్వం
అమెరికా ప్రభుత్వం అక్టోబర్ 1న షట్‌డౌన్ ప్రకటించింది. షట్‌డౌన్ చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాలకు అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత అమెరికా షట్‌డౌన్ ప్రకటించింది. 1996లో క్లింటన్ కాలంలో షట్‌డౌన్ విధించారు. ఈ పాక్షిక షట్‌డౌన్ వల్ల అత్యవసర, నిత్యావసర సేవలు తప్ప ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతాయి.
అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సెప్టెంబర్ 30న కాంగ్రెస్ ఆమోదించకపోవడంతో షట్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. ‘ఒబామా కేర్’ అని పిలిచే ఆరోగ్య పథకంపై రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో బడ్జెట్‌కు ఆమోదం లభించలేదు. యాజమాన్యాల నుంచి ఆరోగ్య బీమా లేనివారు వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా పొందాలనేది ‘ఒబామా కేర్’ చట్టంలోని ముఖ్య నిబంధన. దీన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు.
యూకేలో హైకమిషనర్‌గా రంజన్ మథాయ్
భారత మాజీ విదేశాంగ కార్యదర్శి రంజన్ మథాయ్ యునెటైడ్ కింగ్‌డమ్‌లో భారత హైకమిషనర్‌గా అక్టోబర్ 1న నియమితులయ్యారు. ప్రస్తుత హైకమిషనర్ జైమిని భగవతీ స్థానంలో మథాయ్ బాధ్యతలు చేపడతారు. ఆయన ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశారు.
క్రీడలు
సైనా నెహ్వాల్‌కు ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక అవార్డు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు స్పోర్ట్స్ పత్రిక ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ అవార్డు లభించింది. 2012 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణిగా ఆ పత్రిక సైనాను ఎంపిక చేసింది. ఈ అవార్డు రావడం ఆమెకు ఇది రెండోసారి. 2009లో అవార్డు ప్రారంభించినప్పుడు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ను పత్రిక ప్రకటించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఉన్ముక్త్ చంద్ (క్రికెట్), ఉత్తమ క్రీడాకారుడిగా విరాట్ కోహ్లి (క్రికెట్) ఎంపికయ్యారు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది.
ముంబై ఇండియన్స్‌కు టీ-20 టైటిల్
చాంపియన్స్‌లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీలో అక్టోబర్ 6న జరిగిన ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకోవడం ఇది రెండోసారి. 2011లో మొదటిసారి చాంపియన్స్‌లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్భజన్ సింగ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా డ్వేన్ స్మిత్ ఎంపికయ్యారు. అత్యధిక పరుగులకిచ్చే గోల్డెన్ బ్యాట్ అజింక్యా రహానే (288 పరుగులు, రాజస్థాన్ రాయల్స్), అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రీడాకారుడికిచ్చే గోల్డెన్ వికెట్ ప్రవీణ్ తాంబే (12 వికెట్లు, రాజస్థాన్ రాయల్స్)కు దక్కాయి.
జోకోవిచ్‌కు చైనా ఓపెన్ టెన్నిస్ టైటిల్
పురుషుల సింగిల్స్: ైచె నా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియాకు చెందిన జోకోవిచ్ సాధించాడు. అక్టోబర్ 6న బీజింగ్‌లో జరిగిన ఫైనల్‌లో రఫెల్ నాదల్ (స్పెయిన్)ను ఓడించాడు. 2009, 2010, 2012లో కూడా ఈ టైటిల్‌ను జోకోవిచ్ గెలిచాడు.
మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో జంకోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. ఇది సెరెనాకు 56వ టైటిల్.
మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), కారా బ్లాక్ (జింబాబ్వే)లు మహిళల డబుల్స్ టైటిల్ గెలుపొందారు. వీరు ఫైనల్‌లో వెరా దుషెనివా (రష్యా), అరంటా సన్‌టోంజా (స్పెయిన్)ల జంటను ఓడించారు.
వెటెల్‌కు కొరియా గ్రాండ్ ప్రి
ఫార్ములావన్ కొరియా గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. అక్టోబర్ 6న ముగిసిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, లోటస్ జట్టు డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానంలో నిలిచాడు.
బోపన్న జోడికి జపాన్ ఓపెన్
జపాన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్), రోజర్ వాసెలిన్ (జపాన్) జోడి గెలుచుకుంది. అక్టోబర్ 6న జరిగిన ఫైనల్‌లో జెమీ ముర్రే (బ్రిటన్), జాన్‌పీర్స్ (ఆస్ట్రేలియా) జోడిని ఓడించింది.
భారత్‌కు అండర్-19 నాలుగు దేశాల క్రికెట్ టైటిల్
అండర్-19 నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. అక్టోబర్ 5న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను.. భారత్ ఓడించింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జింబాబ్వే దేశాలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి.
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
Published Thu, Oct 10 2013 3:58 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement