జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇంజనీరింగ్‌తో సత్వర భవిష్యత్తు లభిస్తుందని విద్యార్థులు బీటెక్ కోర్సులో
గెస్ట్ కాలమ్
‘‘జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇంజనీరింగ్‌తో సత్వర భవిష్యత్తు లభిస్తుందని
విద్యార్థులు బీటెక్ కోర్సులో అడుగుపెడుతున్నారు. ఇంజనీరింగ్‌లో రాణించేందుకు పుస్తక
పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. మరెన్నో అంశాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలి.
ముఖ్యంగా క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం వంటి లక్షణాలు ఇంజనీరింగ్ కెరీర్‌కు చక్కటి
సోపానాలుగా నిలుస్తాయి’’ అంటున్నారు నిట్-గోవా డెరైక్టర్ ఫ్రొఫెసర్ జి.ఆర్.సి.రెడ్డి.
నిట్, ఐఐటీ, రాష్ట్రం పరిధిలోని సంస్థలు ఏవైనా సరే.. బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు ముందుగా ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో సీట్లు, ర్యాంకుల మేరకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు లభించకపోతే నిరుత్సాహానికి గురవడం సహజమే. కానీ ఆ నిరుత్సాహానికి వీలైనంత త్వరగా అంటే ఒకట్రెండు నెలల్లో స్వస్తి పలకాలి. సీటు లభించిన బ్రాంచ్‌లో ఆసక్తి పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు ప్రతి బ్రాంచ్‌లోనూ ఆసక్తికర అంశాలు ఉంటాయన్నది గుర్తించాలి.
ముఖ్యమైన మూడు లక్షణాలు
బీటెక్‌లో రాణించాలంటే.. విద్యార్థులకు ముఖ్యంగా మూడు లక్షణాలు అవసరం. అవి.. ఆసక్తి, అధ్యయనం, అన్వేషణ. సిలబస్/కరిక్యులంలో పేర్కొన్న అంశాలన్నింటిపై ఆసక్తి పెంచుకోవాలి. విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాలనుబట్టి కొన్ని సబ్జెక్ట్‌లు భారంగా అనిపిస్తాయి. కానీ, కెరీర్ దృష్ట్యా అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఒక అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ చదివితే ఆసక్తి క్రమేణా పెరుగుతుంది. చదివే ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ అధ్యయన నైపుణ్యాలు పెంచుకోవాలి. అంతేకాకుండా తమ బ్రాంచ్‌కు సంబంధించి కోర్ నైపుణ్యాలతోపాటు తాజా ఆవిష్కరణల గురించి నిరంతరం తెలుసుకోవాలి.
వాస్తవ పరిజ్ఞాన సముపార్జన
ప్రతి అంశాన్ని రీసెర్చ్ దృక్పథంతో చదవడం అలవర్చుకోవాలి. పుస్తక పరిజ్ఞానంతో సర్టిఫికెట్‌లో పర్సంటేజీ ఎక్కువగా వస్తుంది. కానీ, వాస్తవ పరిజ్ఞానం లభించదు. దీని సాధనకు మార్గం.. రీసెర్చ్ దృక్పథం, ప్రాక్టిక్టల్ ఓరియెంటేషన్. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో ఇటీవల కాలంలో కంపెనీల దృక్పథం మారింది. కనీస మార్కులను నిర్దేశిస్తూనే రియల్‌టైం నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బీటెక్ విద్యార్థులు దీన్ని గుర్తించి మొదటి సంవత్సరం నుంచి ఈ దిశగా కృషి చేయాలి. బీటెక్ విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకునే క్రమంలో ఇన్‌స్టిట్యూట్‌లో అందుబాటులో ఉన్న లైబ్రరీ, లేబొరేటరీ వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కళాశాలల్లో ఇంటర్నెట్ సదుపాయంతోపాటు డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉంచుతున్నారు. వాటి ద్వారా తాజా పరిస్థితులపై అన్వేషణ సాగించి నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకునేందుకు యత్నించాలి.
అధ్యాపకులది కీలక పాత్ర
ప్రొఫెషనల్ కోర్సుల్లో టీచింగ్ పరంగా విద్యార్థులకు స్పూన్ ఫీడింగ్ సాధ్యం కాదు అనే మాట వాస్తవమే. కానీ +2 స్థాయిలో మాదిరిగా స్పూన్ ఫీడింగ్ చేయలేకపోయినా.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే దిశగా అధ్యాపకులు కీలక పాత్ర పోషించాలి. అందుబాటులో ఉన్న అకడమిక్ రిసోర్సెస్, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన కల్పిస్తూ వాటిని అందుకునేందుకు మార్గనిర్దేశం చేయాలి.
ఒత్తిడి దరి చేరనీయొద్దు
ఇప్పుడే ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకుని ప్రొఫెషనల్ కోర్సులోకి అడుగుపెట్టే విద్యార్థులు ఒత్తిడికి గురవడం సహజమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి, తెలుగు మాతృభాష నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు తమ క్లాస్‌రూంలో ఇతరులతో పోల్చుకుని అకడమిక్ పరంగా, సామాజిక-ఆర్థిక నేపథ్యాల పరంగా ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా నిట్‌లు, ఐఐటీలు, మెట్రో సిటీల్లోని కళాశాలల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఇంజనీరింగ్ కోర్సులో ఏ మాత్రం సరికాదు. ఒత్తిడి కొనసాగినంత కాలం చదువులో వెనుకబడుతారు. కోర్సులో చేరిన ఉద్దేశం, లక్ష్యాలకు దూరంగా నిలిచిపోవాల్సి వస్తుంది.
విద్యార్థులకు సలహా
ఏ కాలేజీలో చేరినా, విద్యార్థులు స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు సరిగా లేని కళాశాలల్లో సీటు లభించిన విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేందుకు వ్యక్తిగతంగా కృషి చేయాలి. ఇంటర్నెట్‌ను వినియోగించుకోవడం, తాము చదివే కళాశాల సమీప ప్రాంతాల్లోని పరిశ్రమలకు వెళ్లడం, సీనియర్ల సలహాలు తీసుకోవడం వంటివి చేయాలి. బీటెక్ కోర్సులో చేరే విద్యార్థులు రెండో సంవత్సరం నుంచే తమ భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఆ దిశగా వాటిని నెరవేర్చుకునేందుకు గల మార్గాలను అన్వేషించాలి. అప్పుడే నాలుగో సంవత్సరం పూర్తి చేసే సమయానికి సరైన గమ్యం అది ఉద్యోగమైనా, ఉన్నత విద్య అయినా చేరుకోవడం సాధ్యమవుతుంది. ఉన్నత విద్య, ఉద్యోగం అనేది విద్యార్థుల సామర్థ్యం, అవసరాల మేరకు ఉంటుంది.
ఆల్ ది బెస్ట్!!