
జాబ్ పాయింట్: బెస్టు ఇంజనీరింగ్ జాబ్స్
ఒకదేశం ప్రగతి పథంలో ముందుకు సాగడానికి చోదక శక్తులుగా పనిచేసేవారే ఇంజనీర్లు. నిపుణులైన ఇంజనీర్లు ఉన్న దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది, అగ్రస్థాయికి చేరుకుంటుంది.
ఒకదేశం ప్రగతి పథంలో ముందుకు సాగడానికి చోదక శక్తులుగా పనిచేసేవారే ఇంజనీర్లు. నిపుణులైన ఇంజనీర్లు ఉన్న దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది, అగ్రస్థాయికి చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న వృత్తి ఇంజనీరింగ్. ఇందులో అధిక వేతనాలు, పనిలో సంతృప్తి ఉంటాయి. ఆధునిక సమాజంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌లో కొత్తకొత్త రంగాలు, కోర్సులు తెరపైకి వస్తున్నాయి. వినూత్నమైన ఈ కోర్సులను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. 2014లో ఎక్కువ డిమాండ్ ఉన్న టాప్ ఇంజనీరింగ్ జాబ్స్ ఏమిటో తెలుసుకుందాం..
రోబోటిక్స్: రోగులకు శస్త్రచికిత్సలను మర మనుషులే(రోబోలు) చేసే రోజులొచ్చాయి. భవిష్యత్తంతా రోబోలదేనని చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న బెస్టు ఆప్షన్ రోబోటిక్స్. ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, మెకానికల్ సబ్జెక్టుల్లో పట్టున్న విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. కొత్త రోబోలను రూపొంది ంచడం ప్రస్తుతానికి ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కోర్సు చేస్తే రోబోటిక్స్ పరిశ్రమలో టెస్టర్స్, ప్రోగ్రామర్స్, ఆపరేటర్స్‌గా కూడా స్థిరపడొచ్చు. రోబోటిక్స్ నిపుణులు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది.
3డీ ప్రింటింగ్ : ఆధునిక సాంకేతిక విప్లవానికి ఉదాహరణ 3డీ ప్రింటింగ్. అస్ట్రోనాట్స్ నుంచి ఆర్కిటెక్ట్‌ల దాకా.. అందరికీ ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అవసరం ఏర్పడుతోంది. మన దేశంలో 3డీ ప్రింటింగ్ అనేది ప్రారంభ దశలోనే ఉంది. అద్భుతమైన 3డీ మోడల్స్, ప్రింటర్స్‌ను సృష్టించగల నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్‌లో డిగ్రీతో తగిన అనుభవం సంపాదిస్తే భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పొచ్చు.
ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్ : విద్యుత్ అవసరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉత్పత్తికి అవసరమైన వనరులు మాత్రం వేగంగా తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో కరెంటును ఉత్పత్తి చేయడం అనివార్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై అందరి దృష్టి పడింది. ఇలాంటి వనరులతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. ఎనర్జీ జనరేషన్, కన్వర్షన్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్‌పై పరిజ్ఞానం, నైపుణ్యం ఉంటే ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌గా వృత్తిలో రాణించొచ్చు.
నానో టెక్నాలజీ : ఇది ఇంజనీరింగ్‌లో బహుముఖాలు కలిగిన రంగం. మెటీరియల్స్ సైన్స్, ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల సమ్మిళిత రూపమే నానో టెక్నాలజీ ఇంజనీరింగ్. ప్రస్తుతం అన్ని వస్తువుల పరిమాణం తగ్గిపోతోంది. వస్తువు పరిమాణంలో చిన్నగా ఉన్నా.. సమర్థంగా పనిచేసేలా చేయడం నానో టెక్నాలజీ నిపుణుల బాధ్యత. ప్రస్తుతం నానో టెక్నాలజీ నిపుణుల కొరత ఉంది.
ఫ్యూయెల్ సెల్స్ : కెమికల్ ఇంజనీరింగ్‌లో ఆదరణ పొందుతున్న స్పెషలైజ్డ్ ఫీల్డ్.. ఫ్యూయెల్ సెల్స్. రసాయనిక చర్య ద్వారా ఇంధనంలోని రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం ఫ్యూయెల్ సెల్స్ ఇంజనీర్ విధి. ఫ్యూయెల్ సెల్స్ నిపుణులకు విద్యుత్, అటోమొబైల్ కంపెనీల్లో భారీగా అవకాశాలున్నాయి.
నేటి విద్యలో..
సివిల్స్-ప్రిలిమ్స్ పేపర్-1: సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్: బ్యాంకింగ్ అవేర్‌నెస్. పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.