మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్ | Nirbheek, India's first gun for women | Sakshi
Sakshi News home page

మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్

Published Thu, Apr 3 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్

మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్

జాతీయం: మహిళల కోసం ‘నిర్భీక్’ రివాల్వర్
ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన నిర్భీక్ అనే రివాల్వర్‌ను ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్చి 25న కాన్పూర్‌లో ఆవిష్కరించింది. 2012లో ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన నిర్భయ ఉదంతం నేపథ్యంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ రివాల్వర్‌ను తయారు చేసింది. మహిళలు తమను తాము కాపాడుకునేందుకు తయారు చేసిన ఈ రివాల్వర్ 525 గ్రాముల బరువు, 177.8 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 50 అడుగులు (15 మీటర్ల) దూరంలోని లక్ష్యాలను కాలుస్తుంది. దీన్ని మహిళలు తమ పర్సులలో, హాండ్ బ్యాగుల్లో తీసుకువెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దీని ధర రూ. 1,22,360.

ప్రకృతి విపత్తుల బారినపడే నగరాల జాబితా: ఏడో స్థానంలో కోల్‌కతా
ప్రపంచంలో ప్రకృతి విపత్తుల బారినపడే 616 నగరాల పరిస్థితులపై స్విస్ రే అనే సంస్థ మార్చి 26న ఓ నివేదిక విడుదల చేసింది. ప్రకృతి విపత్తుల ప్రమాదాలు గల నగరాల జాబితాలో కోల్‌కతా ఏడో స్థానంలో ఉందని తెలిపింది. భా రత్ నుంచి కోల్‌కతా నగరం ఒక్కటే ఈ జాబితాలో ఉంది. ఈ ప్రమాదాలు ఎదుర్కొనే నగరాల్లో టోక్యో(జపాన్) మొదటి స్థానం, మనీలా (ఫిలిప్పీన్స్) రెండోస్థానం, పెరల్ రివర్ డెల్టా (చైనా) మూడో స్థానం, ఒసాకా -కోబె(జపాన్) నాలుగో స్థానంలో ఉన్నాయి. ఐదో స్థానంలో జకార్తా (ఇండోనేషియా), నగోయా (జపాన్) ఆరో స్థానంలో ఉన్నాయి.

పోలియో రహిత దేశంగా భారత్
భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యు.హెచ్.ఒ) మార్చి 27న అధికారికంగా ప్రకటించింది. డబ్ల్యు.హెచ్.ఒ భారత్‌తో కలిపి మొత్తం 11 దేశాలను పోలియో వైరస్ రహిత దేశాలుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికార పత్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ న్యూఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి నుంచి అందుకున్నారు. 1995 నుంచి ముమ్మరంగా చేపట్టిన పోలియో నిర్మూలన కార్యక్రమాల వల్ల ప్రభుత్వం పోలియోను రూపుమాపగలిగింది.

క్రీడలు
దేవ్‌ధర్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవ్‌ధర్ ట్రోఫీని వెస్ట్‌జోన్ గెలుచుకుంది. విశాఖలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మార్చి 28న జరిగిన అంతిమపోరులో వెస్ట్‌జోన్ 133 పరుగుల భారీ తేడాతో నార్త్‌జోన్‌ను ఓడించింది. ఈ ట్రోఫీని వెస్ట్ జోన్ గెలవడం ఇది మూడోసారి.

క్యాండిడేట్ టోర్నీ టైటిల్ విజేత ఆనంద్
రష్యాలో జరిగిన క్యాండిడేట్ టోర్నీ చెస్ టైటిల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో నవంబర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు నిరుటి విజేత మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో తలపడేందుకు అర్హత సాధించాడు.

ప్రపంచకప్ షూటింగ్‌లో హీనాకు రజతం
భారత స్టార్ ఎయిర్ పిస్టల్ షూటర్ హీనా సిద్దూ అమెరికాలో జరిగిన ఐ.ఎస్.ఎస్.ఎఫ్ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించింది. ఫైనల్లో బల్గేరియాకు చెందిన బెనోవా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.

సంతోషికి స్వర్ణం
నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన లిఫ్టర్లు నాలుగు పతకాలు సాధించారు. మహిళల 53కిలోల విభాగంలో మత్స్య. సంతోషి స్వర్ణపతకం గెలుచుకుంది. ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 104 కిలోల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే మొత్తంగా 174 కిలోల బరువు ఎత్తిన సంతోషికి కాంస్యం కూడా వరించింది. కాగా పురుషుల 62 కిలోల కేటగిరీలో కె.గౌరీబాబు, పురుషుల 69 కిలోల విభాగంలో ఎం. రామకృష్ణ కాంస్యపతకాలు సాధించారు. ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.

బీసీసీఐకి ఇద్దరు అధ్యక్షులు
ఐపీఎల్‌కు సంబంధించినంతవరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్‌గవాస్కర్, ఐపీఎల్ మినహా మిగిలిన బోర్డు వ్యవహారాలన్నింటికీ సంబంధించి శివలాల్‌యాదవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న శ్రీనివాసన్‌ను పక్కనబెట్టాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై కేసును విచారిస్తున్న ఏకే పట్నాయక్, ఇబ్రహీం ఖలీవుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేసు విచారణ ముగిసేవరకు తమ ఆదేశాలమేర అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని సూచించింది.

ఖలిస్తాన్ ఉగ్రవాది భుల్లర్‌కు శిక్ష తగ్గింపు
ఖలిస్తాన్ ఉగ్రవాది దేవేందర్‌పాల్ సింగ్ భుల్లర్‌కు విధించిన మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చుతూ సుప్రీంకోర్టు మార్చి 31న తీర్పునిచ్చింది. భుల్లర్ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకునేందుకు విపరీతమైన జాప్యం జరగడం, ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. 1993లో అప్పటి యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్.భిట్టాను హత్యచేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని యూత్‌కాంగ్రెస్ కార్యాలయం ఎదుట భుల్లర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ దాడిలో 9మంది చనిపోగా భిట్టా తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఈ కేసులో భుల్లర్‌ను దోషిగా నిర్ధారించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించాయి.

‘టార్క్’ ఏర్పాటు
పన్ను చెల్లింపుదారుల్లో విశ్వసనీయతను పెంచి, ఆదాయపన్ను నిబంధనలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా పన్నుల పరిపాలనా సంస్కరణల కమిషన్ (టాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ కమిషన్-టార్క్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి సలహాదారైన పార్థసారథి షోమ్ టార్క్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పన్నుల విషయంలో నిర్మాణాత్మక సంస్కరణలు, నిబంధనలపై దృష్టి పెట్టేందుకు టార్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

అక్కంపల్లిలో పురాతన గుహలు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అక్కంపల్లిలో ప్రాచీన మానవుల నివాసంగా ఉన్న గుహల సముదాయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ గుహలలో ఉన్న చిత్రలేఖనం 7 వేల సంవత్సరాల క్రితం నాటి నాగరికత, సంస్కృతులను ప్రతిబింబిస్తున్నాయి. ఇందులోని ఐదు గుహలలో మూడు సహజ సిద్ధమైనవి కాగా రెండు రాళ్లు మలచినవిగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement