ప్రయాణం, పర్యాటకం
ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ, పర్యాటక రంగం.. అత్యంత ప్రాధాన్యత గల పరిశ్రమగా రూపొందింది. పర్యాటక రంగ అభివృద్ధి.. రవాణా, వసతి, పర్యాటకులను ఆకర్షించడం, మార్కెటింగ్, ప్రభుత్వ నియంత్రణ తదితర అనేక అంశాలపై ఆధారపడి ఉంది. పర్యాటక రంగం.. విదేశీ మారక ద్రవ్య ఆర్జన ద్వారా సంపదను సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్మిత్ (1995) అభిప్రాయంలో పర్యాటక రంగ పరిశ్రమ ముఖ్య లక్షణం.. శ్రమ సాంద్రత.ఈ పరిశ్రమ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది.
ఒకే ఆదాయ స్థాయి, పెట్టుబడి మూలధనం వద్ద వ్యవసాయం, ఆటోమొబైల్, పెట్రోకెమికల్ రంగాల్లో కల్పించే ఉపాధి కంటే ప్రయాణ, పర్యాటక రంగంలో కల్పించే ఉపాధి అధికంగా ఉంటుంది. ప్రయాణ, పర్యాటక రంగం.. నైపుణ్యం లేని, మధ్యస్థ నైపుణ్యాలున్న, పూర్తిస్థాయి నైపుణ్యాలున్న శ్రామికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రపంచ ప్రయాణ, పర్యాటక మండలి (World Travel and Tourism Council )..‘ప్రయాణ, పర్యాటక రంగ ఆర్థిక ప్రభావం–2017’ పేరుతో విడుదల చేసిన నివేదికలో 185 దేశాల్లోని పరిస్థితులను వివరించింది.
ప్రపంచ ప్రయాణ, పర్యాటక మండలి నివేదిక (2017)
ఐక్యరాజ్యసమితి 2017ని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టెయినబుల్ టూరిజం ఫర్ డెవలప్‌మెంట్’గా వర్ణించింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక రంగాల్లో ఒకటైన ప్రయాణ, పర్యాటక రంగం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పనతోపాటు ఎగుమతుల పెంపు, సంపద సృష్టికి దోహదపడుతోంది. ఇది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, పర్యావరణ, వారసత్వ విలువల పెంపునకు దోహదపడగలదని భావించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు, రాజకీయ అస్థిరత్వ పరిస్థితులు ఉన్నప్పటికీ 2016లో ప్రత్యక్ష స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి 3.1 శాతాన్ని తన వాటాగా అందించడంతో పాటు 60 లక్షల నికర అదనపు ఉద్యోగాలను సృష్టించింది.
మొత్తంమీద ఈ రంగం 2016లో 7.6 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని (ప్రపంచ జీడీపీలో 10.2 శాతాన్ని) అందించడంతోపాటు 29.20 కోట్ల మందికి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి 10 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగాన్ని ఈ రంగం తన వాటాగా కలిగి ఉంది. మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో ఈ రంగం వాటా 6.6 శాతం కాగా ప్రపంచ సేవల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 30 శాతంగా నమోదైంది. 2017 వార్షిక నివేదిక 185 దేశాలు, ప్రపంచవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 2016లో ఈ రంగంలో జరిగిన అభివృద్ధితోపాటు వచ్చే పదేళ్లలో అభివృద్ధి అంచనాలను వెల్లడించింది.
వృద్ధి దిశగా పర్యాటకం
2016తో పోల్చితే 2017లో ప్రపంచ ప్రయాణ, పర్యాటక రంగ వృద్ధి 2.1 శాతం ఉండగలదని అంచనా. 2016లో ఈ రంగం ప్రత్యక్షంగా 10.87 కోట్ల మందికి ఉపాధి కల్పించింది. మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 3.6 శాతం. 2017–27 మధ్య కాలంలో ఈ రంగంలో సగటు ఉపాధి వృద్ధిని 2.2 శాతంగా అంచనా వేశారు. 2017లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి వృద్ధి 1.9 శాతంగా, 2027 నాటికి సగటు సాంవత్సరిక ఉపాధి వృద్ధి 2.5 శాతంగా ఉండగలదని అంచనా.
గత ఆరేళ్లుగా ప్రయాణ, పర్యాటక రంగంలో వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును (2.5 శాతాన్ని) అధిగమించింది. 2016లోనూ ప్రయాణ, పర్యాటక రంగ వృద్ధి.. వరల్డ్ ట్రావెల్, టూరిజం కౌన్సిల్ రూపొందించిన ‘ప్రయాణ, పర్యాటకం – ఆర్థిక ప్రభావం 2017’ నివేదిక ప్రకారం మొత్తం 185 దేశాల్లోని 116 దేశాలు సాధించిన సగటు వార్షిక వృద్ధి కన్నా ఎక్కువ. ఆయా దేశాల్లో ఆర్థిక, వ్యాపార సేవలు; తయారీ, పౌర సేవలు; రిటైల్, పంపిణీ, రవాణా రంగం సాధించిన వృద్ధి కన్నా ప్రయాణ, పర్యాటక రంగం సాధించిన వృద్ధి అధికం.
2017లోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంపద, ఉపాధి కల్పనకు ప్రయాణ, పర్యాటక రంగం దోహదపడగలదని నివేదిక పేర్కొంది. ప్రత్యక్ష ప్రయాణ, పర్యాటక రంగ జీడీపీ వృద్ధి 2016లో 3.1 శాతం కాగా 2017లో 3.8 శాతానికి పెరగగలదని అంచనా. దీర్ఘకాలంలో ఈ రంగంలో పెట్టుబడి, అభివృద్ధి ఇదేవిధంగా కొనసాగితే ప్రయాణ, పర్యాటక రంగంలో వృద్ధి పటిష్టంగా ఉండగలదని నివేదిక స్పష్టం చేసింది.
ప్రపంచ ప్రయాణ, పర్యాటక రంగ ప్రగతి – అంచనాలు
2016లో ప్రపంచ జీడీపీకి ప్రయాణ, పర్యాటక రంగం ప్రత్యక్ష వాటాగా 2,306 బిలియన్ డాలర్లను అందించగా జీడీపీలో ఈ రంగం మొత్తం వాటా 7,613.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. విజిటర్ ఎక్స్‌పోర్ట్స్ 1,401.5 బిలియన్ డాలర్లు, వ్యాపార వ్యయం 1,153.6 బిలియన్ డాలర్లు, మూలధన పెట్టుబడి 806.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
2016లో ప్రపంచ స్వదేశీ వ్యయంలో ప్రయాణ, పర్యాటక రంగ వాటా 4.8 శాతం. కాగా లీజర్ స్పెండింగ్‌లో 2.3 శాతం, వ్యాపార వ్యయంలో 0.7 శాతం, మూలధన పెట్టుబడిలో 4.4 శాతం వాటాను ప్రయాణ, పర్యాటక రంగం నమోదు చేసుకుంది.
2017లో ప్రపంచ జీడీపీలో ప్రయాణ, పర్యాటక రంగ ప్రత్యక్ష వాటాలో వృద్ధి 3.8 శాతం. జీడీపీలో ఈ రంగం మొత్తం వాటాలో వృద్ధి 3.6 శాతంగా; మొత్తం ఉపాధికి సంబంధించి ప్రత్యక్ష వాటాలో 2.1 శాతంగా; ఉపాధిలో ఈ రంగం మొత్తం వాటాలో వృద్ధి 1.9 శాతంగా నమోదు కాగలదని అంచనా.
2017లో ప్రయాణ, పర్యాటక రంగం స్వదేశీ వ్యయంలో 3.7 శాతం. లీజర్ స్పెండింగ్‌లో 3.9 శాతం. వ్యాపార వ్యయంలో 4 శాతం. మూలధన పెట్టుబడిలో 4.1 శాతం వృద్ధిని ఈ రంగం నమోదు చేసుకుంటుందని అంచనా.
2027లో ప్రపంచ జీడీపీలో ప్రయాణ, పర్యాటక రంగ ప్రత్యక్ష వాటాలో వృద్ధి 4 శాతం, మొత్తం ఉపాధికి సంబంధించి ప్రత్యక్ష వాటాలో వృద్ధి 2.2 శాతంగా నమోదు కాగలదని అంచనా.
2027లో ప్రయాణ, పర్యాటక రంగానికి సంబంధించి స్వదేశీ వ్యయంలో వృద్ధి 3.9 శాతం, లీజర్ స్పెండింగ్‌లో 4.1 శాతం, వ్యాపార వ్యయంలో 3.7 శాతం, మూలధన వ్యయంలో ఈ రంగం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని అంచనా.
2016లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం పెట్టుబడిలో ప్రయాణ, పర్యాటక రంగ పెట్టుబడి 4.4 శాతం (806.5 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. 2017లో ఈ రంగం పెట్టుబడిలో 4.1 శాతం, రానున్న పదేళ్ల కాలంలో సగటున 4.5 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా.
మొత్తం ఎగుమతుల్లో విజిటర్ ఎక్స్‌పోర్ట్స్ 2016లో 6.6 శాతం కాగా 2017లో ఈ మొత్తంలో 4.5 శాతం, 2017–27 మధ్య కాలంలో సగటున 4.3 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా.
n 2011లో ప్రపంచవ్యాప్తంగా అంతర్గత సందర్శకుల వినియోగం 4143.4 బిలియన్ డాలర్లు కాగా 2016లో 4976.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2017లో ఈ మొత్తం 5169.8 బిలియన్ డాలర్లుగా, 2027లో 7635.1 బిలియన్ డాలర్లుగా ఉండగలదని అంచనా.
2016లో మొత్తం ఎగుమతుల్లో విజిటర్ ఎక్స్‌పోర్ట్స్ వాటా 6.6 శాతం కాగా 2017లో విజిటర్ ఎక్స్‌పోర్ట్స్‌లో వృద్ధి 4.5 శాతంగా, 2027లో 4.3 శాతంగా ఉండగలదని అంచనా.
2011లో ప్రపంచంలోని ప్రభుత్వాల ఉమ్మడి వ్యయంలో వృద్ధి 1.4 శాతంగా, 2016లో 3.7 శాతంగా నమోదైంది. ఈ వ్యయంలో వృద్ధి 2017లో 2.6 శాతంగా, 2027లో 2.5 శాతంగా ఉండగలదని అంచనా.